Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి ఓటమి అనేది లేకుండా మంచి సక్సెస్‌లతో ముందుకు సాగుతున్నాడు. ఆయన ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పని చేస్తాడు.బాహుబలి తర్వాత రాజమౌళి ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ప్రస్తుతం రాజమౌళి చేస్తున్న ప్రతి సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ అనే చిత్రం చేయగా, ఈ మూవీ కరోనా వలన వాయిదా పడింది. అయితే రాజమౌళి సినిమా డైరెక్ట్ చేస్తున్నాడంటే భారీ అంచనాలు ఉండడం సహజం.

రాజమౌళి ఏ సినిమా చేసిన ఎంతో పరిశోధన చేసి, తాను అనుకున్నట్లుగా ఔట్‌పుట్ వచ్చేవరకు నిద్రపోడు. తాను సంతృప్తి చెందేవరకూ సన్నివేశాన్ని చెక్కుతూనే ఉంటాడు. అందుకే అతన్ని ‘జక్కన్న’ అని ముద్దుగా పిలుస్తారు. తాను అనుకున్నట్లుగా సన్నివేశం వస్తుందో లేదో అని ఎప్పుడూ భయపడుతూ ఉంటానని రాజమౌళి ఎన్నో ఇంటర్వ‍్యూల్లో చెప్పిన సంగతి తెలిసిందే.

ఆయన తీసే ప్రతి సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తారు. అందుకు ఎంత పరిశోధన అయినా చేస్తారు అని చెప్పేందుకు ‘ఈగ’ సినిమానే ఒక ఉదాహరణ. ఈగ సినిమా కోసం రాజమౌళి ఏం చేశారో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ఇటీవల బయటపెట్టారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఈగ’ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాన్ని తెలిపారు.
ఈగ చిత్రం కోసం పనిచేసేప్పుడు రాజమౌళి కొన్ని ఈగలను ఫ్రిజ్‌లో ఉంచాడట. ఆ ఫ్రిజ్‌లో ఆహారం కంటే ఈగలే ఎక్కువగా ఉండేవని తారక్ చెప్పినట్లు సమాచారం. ఈగల సుప్తావస్థ (హైబర్‌నేషన్) గురించి తెలుసుకునేందుకే జక్కన్న అలా చేశారని రామ్ చరణ్ చెప్పినట్లు తెలుస్తోంది. గడ్డకట్టే ఉష్ణోగ్రతలో వాటి మనుగడ ఎలా ఉంటుందో పరిశీలించేవారని చరణ్ పేర్కొన్నాడట.
చిత్రబృందంతో కలిసి ఈగల ప్రతి అంశాన్ని సుదీర్ఘంగా చర్చించేవారట. దీన్ని బట్టి అర్థమవుతుంది ఒక సినిమా కోసం జక్కన్న ఎంత కష్టపడతారో అని. 2012లో విడుదలైన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత, నేచురల్ స్టార్ నాని జంటగా నటించారు. కన్నడ హీరో సుదీప్ విలనిజం ఎంతగానో ఆకట్టుకోగా ‘ఈగ’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.