Ponniyin Selvan Movie: ఎంత మణిరత్నం మూవీ అయితే మాత్రం మల్టీప్లెక్సుల్లో మరీ ఇంత రేట్ల పెంపా?
NQ Staff - September 26, 2022 / 04:08 PM IST

Ponniyin Selvan Movie : టికెట్ రేట్ల ఇష్యూ టాలీవుడ్ లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో, బడా నిర్మాతలు, భారీ సినిమాల మీద ఎలాంటి ప్రభావం చూయించిందో అందరికీ తెలిసిందే. ప్యాండెమిక్ తర్వాత ఆడియెన్స్ థియేటర్లకి రావడమే గగనమైపోయిందనుకున్న సమయంలో పండగల పేరుతో, ప్రాజెక్టుల మీదున్న అధిక హైప్ తో నచ్చినట్టుగా టికెట్ ధరలు పెంచేశారప్పట్లో. దాంతో మొదటికే మోసం వచ్చినట్టయి మళ్లీ మామూలు రేట్లకే ఫిక్సయ్యారు. కానీ తాజాగా డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ రేట్లు ఓ రేంజ్ లో పెంచేయడంతో ఈ టాపిక్ మరోసారి తెరపైకొచ్చింది. మణిరత్నం డైరెక్షన్లో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ సినిమా టికెట్ ధరను హైద్రాబాద్ లోని మేజర్ మల్టీప్లెక్సుల్లో రూ. 295 గా నిర్ణయించారు.
ఎంత మణిరత్నం సినిమా అయినా,
ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అయినా మరీ ఈ రేంజ్ ధరలేంటి? అని ప్రేక్షకులు షాకవుతున్నారు. మల్టీప్లెక్స్ ఆడియెన్స్ ఎంత ధర పెట్టయినా చూస్తారనుకుంటే మాత్రం పాప్ కార్న్ బకెట్లో కాలేసినట్టే. తెలుగులో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రాలయినా, బడా స్టార్ల సినిమాలయినా ప్రస్తుతం మామూలు టికెట్ రేట్లకే అమ్ముతున్నారు. కానీ అనూహ్యంగా పొన్నియిన్ సెల్వన్ కి మాత్రం విపరీతంగా ధరలు పెంచారు. టాలీవుడ్ లో తెరకెక్కిన స్ట్రెయిట్ తెలుగు చిత్రాలకే ఇంత రేట్లు పెట్టకుండా డబ్బింగ్ సినిమాలకి హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో ఇంత రేట్ పెట్టడంతో సినిమా ప్రేక్షకులు ఘాటుగానే రియాక్టవుతున్నారు.
చెప్పాలంటే నిజానికి తెలుగులో పొన్నియిన్ సెల్వన్ మీద మరీ భారీ అంచనాలయితే ఏమీ లేవు. మణిరత్నం కల్ట్ ఫ్యాన్స్, కాస్టింగ్ లో ఉన్న సదరు స్టార్ల అభిమానులు కాస్త ఇంట్రస్టింగ్ గా ఉన్నారు తప్ప మరీ రేట్లు పెంచినా ఎగబడి చూసేంత సీనయితే లేదు. ఈ విషయం తెలిసి కూడా, గత చేదు అనుభవాలుండి కూడా సాధ్యమైన దానికన్నా ఎక్కువగా టికెట్ ధరలు పెంచడం వల్ల ఓపెనింగ్స్ వసూళ్లు, లాభాలేమో గానీ.. ఒకింత నష్టానికే ఆస్కారం ఎక్కువన్న వాదన కూడా లేకపోలేదు.
మల్టీప్లెక్సుల్లో అయినా దాదాపు రూ. 300 టికెట్ రేట్ పెట్టినప్పుడు మరీ అంతగా శుక్రవారం కచ్చితంగా సినిమా చూడాలనుకునే హార్డ్ కోర్ మూవీ లవర్స్ కి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఇదే శుక్రవారం వరల్డ్ వైడ్ గా హృతిక్, సైఫ్ కలిసి నటించిన విక్రమ్ వేద కూడా రిలీజవుతుంది.
పైగా ఆ మూవీకి బాలీవుడ్ లోనే కాదు.. సౌత్ లోనూ మంచి ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండడం, కోలీవుడ్ హిట్ మూవీ రీమేక్ కావడంతో హైప్ అయితే బాగానే ఉంది. సో.. పొన్నియిన్ సెల్వన్ టికెట్ల రేట్లు చూశాక, మరీ పెద్దగా ఇంట్రస్ట్ లేని ఆడియెన్సును కూడా విక్రమ్ వేద పైపో, వేరే మరో సినిమావైపో మళ్లించేలా ఉన్నారు వాళ్లే. పోనీ పొన్నియిన్ సెల్వన్ మరీ అంత అద్భుతంగా ఉందని రిజల్ట్ తేలినా ఈ రేట్లతో రెండో సారి చూసే ధైర్యం చేయడం కష్టమే.
ఇప్పటికే టికెట్ల రేట్ల పెంపు వల్ల గట్టిగా దెబ్బతిన్నా మళ్లీ ఇప్పుడు తమిళ డబ్బింగ్ మూవీ కోసం ఇలాంటి రిస్క్ చేయడం ఏంటో? అంటూ కామన్ ఆడియెన్స్ కాస్త గట్టిగానే ఫైరవుతున్నారు. సోషల్మీడియాలోనూ ఈ ఇష్యూపై పోస్టులు, కామెంట్లు, కౌంటర్లు పడుతున్నాయి.
మరి ఈ రియాక్షన్స్ ని కన్సిడర్ చేసయినా టికెట్ రేట్ల అడ్డగోలు పెంపుపై యూటర్న్ తీసుకుంటారా? మొదటికే మోసం వస్తుందని గ్రహించి మామూలు ధరలనే నిర్ణయించి మల్టీప్లెక్సులకి ఆడియెన్స్ ని రానిస్తారా అనేది చూడాలిక.