Tollywood : సినిమా వాళ్లు బ‌లిసి కొట్టుకుంటున్నారు.. వైసీపీ ఎమ్మేల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Tollywood : టాలీవుడ్‌కి, ఏపీ ప్ర‌భుత్వానికి మ‌ధ్య వార్ ఇప్ప‌ట్లో ముగిసేలా లేదు. రోజురోజుకి ఈ వివాదం మ‌రింత‌గా ముదురుతుంది. ఈ రోజు రామ్ గోపాల్ వ‌ర్మ సినిమా రంగంకి సంబంధించిన ప‌లు అంశాల గురించి పేర్ని నానితో చ‌ర్చించ‌డానికి అమ‌రావ‌తికి వెళ్ల‌గా, మరి కొద్ది నిమిషాల‌లో ఈ చ‌ర్చ‌కు సంబంధించిన వివ‌రాలు బ‌య‌ట‌కు రానున్నాయి. అయితే ఇంత‌లోనే తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటున్న వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

MLA Nallapu Reddy Prasanna Kumar comments on Tollywood
MLA Nallapu Reddy Prasanna Kumar comments on Tollywood

టాలీవుడ్ పెద్ద‌ల‌ని టార్గెట్ చేస్తూ.. సినిమా వాళ్లు ఒళ్లు బలిసి కొట్టుకుంటున్నార‌న్న రేంజ్‌లో మాట్లాడారు. కోవూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు సినిమా వాళ్ల గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లంతా హైదరాబాద్ లో ఉన్నారని.. అసలు వారికి ఏపీలో ఒక ప్రభుత్వం ఉన్నారని.. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని కనిపిస్తోందా అని ప్రశ్నించారు.

అక్కడితో నే ఆయన ఆగలేదు.. సినిమాలో ఉన్న పెద్దలంతా చంద్రబాబు మనుషులే.. అని.. ఆయన కులానికి చెందిన వారే ఎక్కువమంది ఇండస్ట్రీలో ఉన్నారంటూ మరో వివాదానికి తెరలేపారు. అసలు హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు.. పేదల కోసం టికెట్ల ధరలు తగ్గిస్తే వారికి వచ్చిన నష్టం ఏంటని ఆయన ప్రశ్నించారు..

ఏపీ ప్ర‌భుత్వం తీరుపై ఇప్ప‌టికే పవన్ కళ్యాణ్, నాని లు బహిరంగంగానే వ్యాఖ్యలు చేయగా.. చిరంజీవి ట్విట్టర్లో వినతులు చేశారు. ఇటు దర్శకులు, నిర్మాతలు సైతం ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే నేరుగా మంత్రులపై ట్విట్టర్ లో యుద్ధమే చేశారు. మంత్రి పేర్ని నానికి పది ప్రశ్నలు సంధించారు. దానికి మంత్రి పేర్ని నాని అదే స్థాయిలో సమాధానాలు చెప్పారు.

అయితే వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. మ‌రి ఇప్పుడు ఈ కామెంట్స్ పై సినీ పెద్ద‌లు ఎలా స్పందిస్తారా అనేది చూడాలి.