Tollywood : వేల కోట్లు సంపాదిస్తున్నారు.. టాలీవుడ్ హీరోలకు మంత్రి వార్నింగ్
NQ Staff - December 5, 2022 / 07:21 PM IST

Tollywood : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ గర్జన వేదిక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. కర్నూలులో జరిగిన ఈ భారీ బహిరంగ సభలో పలువురు మంత్రులు వైకాపా నాయకులు ప్రజా సంఘాల వారు, రాయలసీమ మేధావులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ టాలీవుడ్ సినీ ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కి టాలీవుడ్ హీరోల మద్దతు కావాల్సిందే అంటూ ఆయన డిమాండ్ చేశారు.
టాలీవుడ్ హీరోలు మా కర్నూలులో షూటింగ్ చేస్తున్నారు. మా జిల్లాల నుండి వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. కానీ కర్నూలులో హైకోర్టుకి మద్దతుగా మాట్లాడటం లేదు. ఇప్పటికైనా టాలీవుడ్ హీరోలు కర్నూలులో హైకోర్టు కి మద్దతుగా మాట్లాడాలంటూ మంత్రి గుమ్మనూరు జయరాం హెచ్చరించారు.
భవిష్యత్తులో కర్నూలు లో హైకోర్టు కి మద్దతుగా మాట్లాడని వారికి తగిన గుణపాఠం చెప్తాం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరచుతున్నాయి. ఈ విషయమై ఇప్పటి వరకు టాలీవుడ్ నుండి ఏ ఒక్కరు స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం మంత్రి వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతోంది.