Film Festival : మే 17 నుండి అట్టహాసంగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుండగా, ఈ వేడుకలో పూజా హెగ్డే, తమన్నా, ఊర్వశి రౌతేలా, దీపికా పదుకొణే వంటి అందాల ముద్దుగమ్మలు సందడి చేసిన విషయం తెలిసిందే. ప్రపంచాన్ని ఆకర్షించిన ఈ సినీ వేడుకకు దేశ విదేశాల నుంచి అగ్ర ప్రముఖ నటీనటులు సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్ పాల్గొన్నారు. ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి మాత్రమే కాకుండా టాలీవుడ్ నుంచి కూడా గ్లామరస్ హీరోయిన్స్ వేడుకలో పాల్గొన్నారు.
ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా రెడ్ కార్పెట్ పై కొంతమంది ప్రముఖ సెలబ్రెటీలు వెళుతుండగా హఠాత్తుగా జనాల్లో నుంచి వచ్చిన ఒక మహిళ అందరిని కంగారు పెట్టింది. సెక్యూరిటీని దాటుకుంటూ ఒక మహిళ తన దుస్తులను కూడా విప్పేసి నిరసనలు తెలిపింది. ఉక్రెయిన్ కి చెందిన ఆ మహిళ అందరూ చూస్తుండగానే అర్ధనగ్నంగా వినూత్న నిరసన తెలిపింది. గత కొంతకాలంగా తమ దేశమైన ఉక్రెయిన్ లో మహిళలు యువతులపై రష్యా సైనికులు అత్యాచారాలకు పాల్పడుతున్నారని అంటూ నినాదాలు చేసింది.
‘మాపై అత్యాచారాలు ఆపండి’ అంటూ ఒంటిపై ఆమె రాసుకొచ్చింది. ఉక్రెయిన్ జాతీయ పతాకాన్ని ఆమె తన ఒంటిపై వేసుకుంది. అంతేకాదు.. ఆమె తమపై అత్యాచారాలు ఆపాలంటూ నినదిస్తూ గళాన్నీ వినిపించింది. వెనువెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను బయటకు తీసుకెళ్లిపోయారు. ఒంటి మీద వస్త్రాలు కప్పారు. దీనిపై కేన్స్ అధికారిక బృందం ఇంకా ఎలాంటి స్పందనా తెలియజేయలేదు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉక్రెయిన్ కు సంఘీభావంగా ఆ దేశానికి చెందిన సినిమాలనూ ప్రదర్శిస్తున్నారు.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. కలర్ఫుల్ గా సందడిగా కొనసాగుతున్న కార్యక్రమంలో మహిళ ఆ విధంగా నిరసనలు తెలపడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇక ఇదే విషయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఎమోషనల్ అయ్యారు.
- Advertisement -
లైవ్ శాటిలైట్ వీడియో ద్వారా కేన్స్ ప్రారంభోత్సవంలో జెలెన్ స్కీ మాట్లాడుతూ.. రష్యా బలగాల దాడుల్లో తమ ఉక్రెయిన్ దేశ పౌరులు వేల సంఖ్యలో చనిపోతుంటే సినీ ప్రపంచం మౌనంగా ఉంటుందా అని ప్రశ్నిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రష్యా రోజురోజుకు దారుణంగా దురాగతాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.