Deepak Chahar : ఉత్కంఠ‌గా జ‌రిగిన మ్యాచ్.. గెలిపించ‌లేక‌పోయినందుకు ఏడ్చేసిన భార‌త బౌల‌ర్

Deepak Chahar : భార‌త్ -సౌతాఫ్రికా మ‌ధ్య జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్‌లో భార‌త్ దారుణంగా నిరాశ‌ప‌ర‌చింది. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ మైదానంలో జరిగిన‌ చివరి వన్డేలో సౌతాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి వరకు విజయం నీదా నాదా అనే రేంజ్‌లో మ్యాచ్‌ కొనసాగింది. ఒక దశలో భారత్ గెలుస్తుందని అందరు భావించారు. కానీ అనూహ్యంగా భారత్ ఆలౌట్‌ అయింది. ఉత్కంఠగా జరిగిన పోరులో సౌతాఫ్రికా విక్టరీ సాధించి సిరీస్‌ని క్లీన్ స్వీప్‌ చేసింది.

Deepak Chahar in tears after SA match
Deepak Chahar in tears after SA match

భారత్ ఓటమి తర్వాత ఆల్ రౌండర్ దీపక్ చాహర్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. అతడి కళ్లు కన్నీళ్లతో తడిసిపోయాయి. దీనికి కారణం దీపక్ చాహర్ ఫాస్ట్‌గా హాఫ్ సెంచరీ కొట్టి టీమ్ ఇండియా విజయంపై ఆశలు రేకెత్తించినప్పటికీ కీలక సందర్భంలో ఔట్ కావడంతో టీమ్ ఇండియా మ్యాచ్‌లో ఓడిపోయింది. భారత్ 7వ వికెట్ 42.1 ఓవర్లలో పడిపోయింది.

ఆ సమయంలో జస్ప్రీత్ బుమ్రా దీపక్ చాహర్‌కు మద్దతుగా నిలిచాడు . బుమ్రా రాగానే దీపక్ చాహర్ ఓపెన్‌గా గేమ్‌ని ప్రదర్శించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 2 సిక్సర్లు, 5 ఫోర్లు కొట్టి దక్షిణాఫ్రికా జట్టుపై ఎదురుదాడి చేశాడు. ఒక దశలో భారత జట్టు 223 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినప్పటికీ, బుమ్రాతో కలిసి 8వ వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో దీపక్ చాహర్ మ్యాచ్ గమనాన్ని మార్చాడు.

48వ ఓవర్‌లో లుంగి ఎంగిడి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. దీపక్ చాహర్‌ని ఔట్‌ చేశాడు. అతను పెవిలియన్‌కు తిరిగి రావడానికి బదులుగా మైదానం వైపు ఉంచిన కుర్చీపై కూర్చున్నాడు. అయితే చాహర్ అవుట్ అయిన తర్వాత టీమ్ ఇండియా విజయవకాశాలు సన్నగిల్లాయి. 49వ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా వికెట్ కూడా పడిపోయింది. అప్పుడు చాహర్ తనను తాను తిట్టుకోవడం కనిపించింది. చివరి ఓవర్‌లో యుజ్వేంద్ర చాహల్ వికెట్ పడిపోవడంతో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో అత‌ను క‌న్నీరు పెట్టుకున్నాడు.

288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెఎల్‌ రాహుల్ 9 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. కానీ శిఖర్ ధావన్, విరాట్‌ కోహ్లీ రెండో వికెట్‌కి 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు బాధ్యతని భుజాలపై మోస్తూ ఆచితూచి ఆడారు. ఈ క్రమంలో శిఖర్ ధావన్ 61 పరుగులు (73 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్‌) ఔటయ్యాడు. అనంతరం విరాట్ కోహ్లీ 65 పరుగులు (84 బంతుల్లో 5 ఫోర్లు) కూడా వెనుదిరిగాడు. వీరి తర్వాత మిడిలార్డర్ కుప్ప‌కూలింది. దీంతో మ‌రోసారి నిరాశే ఎదురైంది.