Bandi Sanjay : హైడ్రామా: బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర జరిగేనా.?
NQ Staff - November 28, 2022 / 10:54 AM IST

Bandi Sanjay : భైంసాలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన బహిరంగ సభకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అయితే, పాదయాత్రకు అనుమతిచ్చి చివరి నిమిషంలో అనుమతులు రద్దు చేయడమేంటని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు.
కార్యకర్తల్ని వెంటేసుకుని బండి సంజయ్, భైంసా బయల్దేరగా మార్గమధ్యంలో జగిత్యాల వల్ల బండి సంజయ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్‌కీ పోలీసులకీ మధ్య వాగ్వాదం జరిగింది.
భైంసాలో సభ, యాత్ర నిర్వహించి తీరుతానన్న బండి సంజయ్..
కాగా, కార్యకర్తల సాయంతో బండి సంజయ్ పోలీసుల నుంచి తప్పించుకోగలిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భైంసాలో పాదయాత్ర, బహిరంగ సభ నిర్వహించి తీరుతామని బండి సంజయ్ చెబుతున్నారు. అయితే, భైంసా సున్నితమైన పట్టణం గనుక పోలీసులకు సహకరించాలంటూ పోలీసులు, బండి సంజయ్‌ని కోరుతుండడం గమనార్హం.
అయినా, సున్నితమైన ప్రాంతమేంటి.? నాలుగు విడతల పాదయాత్ర సజావుగా సాగినప్పుడు, ఐదో విడత పాదయాత్ర విషయంలో ఎందుకు ప్రభుత్వానికి అభ్యంతరాలన్నది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. మరోపక్క, బండి సంజయ్‌ని ఏ క్షణంలో అయినా పోలీసులు అరెస్టు చేసే అవకాశముంది.
భైంసా వైపు వెళ్ళే మార్గాలన్నిటినీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.