Pooja Hegde : పూజా హెగ్దే తమిళంలో నటించిన ‘బీస్ట్’ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ‘బీస్ట్’ సినిమా సూపర్ హిట్.. అని విజయ్ అభిమానులు హంగామా చేయడం తప్ప, సినిమాలో కంటెంట్ లేక తేలిపోయిన మాట వాస్తవం. విజయ్, పూజా హెగ్దే జంటగా రూపొందిన సినిమా ఇది. తీవ్రవాదం బ్యాక్‌డ్రాప్‌లో సినిమాని తెరకెక్కించారు.
విజయ్ ‘రా’ ఏజెంట్‌గా నటించాడు ఈ సినిమాలో. కాగా, ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్, ఆశ్చర్యకరమైన రీతిలో హీరోయిన్ పూజా హెగ్దేకి షాక్ ఇచ్చిందట. నిర్మాణం విషయంలో పక్కాగా వుండే సన్ పిక్చర్స్, పూజా హెగ్దేకి ముందుగానే రెమ్యునరేషన్ వంటి వ్యవహారాల్ని క్లియర్ చేసినట్లు తెలుస్తోంది.

పాపం పూజా హెగ్దే..
అయితే, పూజా హెగ్దే చేసిన అదనపు ఖర్చుల విషయమై ఓ బిల్లుని తాజాగా సన్ పిక్చర్స్ ప్రిపేర్ చేసి, ఆమెకు పంపించడం జరిగిందట. పూజా హెగ్దే అలాగే ఆమె బృందం సినిమా చిత్రీకరణ సమయంలో అదనపు లగ్జరీస్ చేశాయన్నది సన్ పిక్చర్స్ ఆరోపణగా కనిపిస్తోంది.
వాస్తవానికి, లెక్కలు ఎప్పటికప్పుడు తేలిపోతుంటాయ్. వాటికి అనుగుణంగానే రెమ్యునరేషన్ క్లియర్ చేస్తుంటాయి. అయితే, ఎందుకు ఇంత ఆలస్యంగా సన్ పిక్చర్స్ స్పందించింది.? బిల్లులు పంపింది.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

సినిమా హిట్టయితే సరే సరి, లేదంటే ‘కోత తప్పదు’ అని ముందే అగ్రిమెంట్లు చేసుకోవడంతో, అందుకు అనుగుణంగా పూజా హెగ్దే నుంచి నష్టాల్ని రికవరీ చేస్తున్నారట.. లగ్జరీస్ కేటగిరీలో.. అన్నది ఇంకో వాదన. ఇందులో ఎంతవరకు నిజం.? పూజా హెగ్దే ఈ విషయమై ఏమంటుంది.? వేచి చూడాల్సిందే.