Balakrishna : ఏపీ టిక్కెట్ల ఇష్యూపై స్పందించిన బాల‌కృష్ణ‌.. పాక్‌లోను అఖండ విజృంభిస్తుందంటూ కామెంట్

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ‌కి 2021 ఎంత‌గా క‌లిసొచ్చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న న‌టించిన అఖండ సినిమా భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించడంతో పాటు ప‌లు రికార్డులు న‌మోదు చేసింది. మ‌రోవైపు బాల‌కృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాప‌బుల్ టాక్ షో అనేక రికార్డులు న‌మోదు చేస్తుంది. దేశ వ్యాప్తంగా ప‌లు షోల రికార్డుల‌ని ఇది తిర‌గ‌రాస్తుండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యింప‌జేస్తుంది.

Balakrishna On AP Ticket rate issue
Balakrishna On AP Ticket rate issue

హైదరాబాద్ లో ‘అఖండ సంక్రాంతి సంబరాలు’ పేరిట నిర్వహించిన విజయోత్సవ స‌భ జ‌ర‌గ‌గా, ఈ కార్య‌క్ర‌మంలో బాల‌కృష్ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్థాన్ లోనూ అఖండ చెలరేగిపోతోందని, అక్కడి నుంచి కూడా వీడియోలు వస్తున్నాయని చెప్పారు. అన్ సీజన్ లో రిలీజైన ఈ సినిమాను.. ఏపీ, తెలంగాణలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఆదరిస్తున్నారని చెప్పారు. పాన్ వరల్డ్ చిత్రంగా మారిందన్నారు.

థియేటర్లకు జనం వస్తారా? రారా? అన్న సందిగ్ధంలోనూ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ధైర్యంగా సినిమాను విడుదల చేశారన్నారు. ఈ సినిమా విడుదలైన దగ్గర్నుంచే సంక్రాంతి పండుగ వచ్చేసిందన్నారు. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా అన్ని సినిమాలూ బాగా ఆడాలని ఆయన కోరుకున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీనుపై ప్రశంసలు కురిపించారు. భారతీయ చిత్ర పరిశ్రమ గర్వపడే డైరెక్టర్ అని అన్నారు.

సినిమా టిక్కెట్ల అంశంపై స్పందిస్తూ.. టాలీవుడ్ సమస్యలపై పట్టించుకునే నాధుడే లేరని ఆవేదన వ్యక్తం చేశారు.. ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం పై ఇండస్ట్రీ అంతా కలిసికట్టుగా పోరాడాలి అని పిలుపు ఇచ్చారు.. రెండు తెలుగు ప్రభుత్వాలు సినిమా రంగానికి సహకరించాలని కోరారు.. సినిమా టికెట్ల ధరపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటాను అన్నారు.

అలాగే ఏపీ ప్రభుత్వం చెబుతున్నట్టు చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడాలు ఉండవు అన్నారు. పెద్ద సినిమా ప్లాప్ అయితే చిన్న సినిమా అంటారాని.. చిన్న సినిమా హిట్ అయితే పెద్ద సినిమా అంటారు అంటూ వ్యాఖ్యనించారు. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల వ్యవహారం త్వరలోనే కొలిక్కి వస్తుందని తాను ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరో ఒకరు ముందుకు వచ్చి పరిశ్రమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

తెలుగు సినిమా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలి అని అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీపై లక్షలాది మంది ఆధారపడుతున్నారని.. వారి అందిరికీ ఉపాధి లభించాలి అన్నారు.. దానికి ఏపీ, తెలంగాణ రెండు ప్రభుత్వాలు సహకరించాలని ఆయన మరోసారి కోరారు.