Lionel Messi: వాడి ప‌డేసిన‌ టిష్యూ ధ‌ర ఏడున్న‌ర కోట్ల రూపాయలా?

Lionel Messi: సెల‌బ్రిటీలు వాడిన వ‌స్తువులు అభిమానులకు ఎంతో అపురూపం. వారు వాడిన బైక్స్, బ్యాట్స్, టీ ష‌ర్ట్స్,కార్స్ ఇలాంటివి వేలం వ‌స్తే కోట్ల‌లో ధ‌ర‌లు ప‌లుకుతుంటాయి. తాజాగా అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ వాడి ప‌డేసిన టిష్యూ ధ‌ర ఏడున్న‌ర కోట్ల రూపాయ‌ల ధ‌ర ప‌ల‌క‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ, కొన్నాళ్ల క్రిందట బార్సిలోనా క్లబ్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. కాంట్రాక్ట్ విషయంలో జరిగిన కొన్ని సమస్యల కారణంగా బార్సిలోనా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు మెస్సీ. బార్సిలోనా క్లబ్ తరుపున ఇచ్చిన ఫేర్‌వెల్ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయిన మెస్సీ, కన్నీళ్లు పెట్టుకున్నాడు .గత ఆదివారం(ఆగస్టు 8న) జరిగిన ఫేర్‌వెల్‌ వేడుకలో తన అనుభవాలను పంచుకుంటూ కాస్త ఎమోషనల్‌ అయ్యాడు.

ఆ స‌మ‌యంలో త‌న‌లో నుండి దుఃఖం ఉబికి వ‌స్తుండ‌గా, కన్నీళ్లతో పాటు ముక్కును టిష్యూ పేప‌ర్‌ని తుడుచుకున్నాడు. సాధార‌ణంగా ఒక‌సారి వాడిన టిష్యూని మ‌నం ప‌డేస్తాం. కాని ఆ టిష్యూ వాడింది మెస్సీ కాబ‌ట్టి ఓ ప్ర‌భుద్దుడు దానిని తీసుకొని ఇంటర్నేషనల్ ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫాం ఎమ్‌ఈకెడో లో వేలానికి పెట్టాడు. అయితే ఫుట్‌బాల్‌ దిగ్గజం కన్నీళ్లు తుడిచిన ఆ టిష్యూ పేపర్‌కు అక్షరాల రూ. ఏడున్నర కోట్లు ( 1 మిలియన్‌ డాలర్లు) ధ‌ర ప‌లికింది.

ఇది తెలుసుకున్న నెటిజ‌న్స్ వాడిప‌డేసిన టిష్యూ పేప‌ర్‌కు అంత ధ‌ర చెల్లించారా అని ముక్కున వేలేసుకుంటున్నారు. వీరాభిమానులు మాత్రం మా దేవుడి కన్నీరు తుడిచిన ఆ టిష్యూ అమూల్యం..దాని ముందు ఎన్ని కోట్లైనా దిగదుడుపే అంటున్నారు.

13 ఏళ్ల వ‌య‌సులో 2000 సంవత్సరంలో బార్సిలోనాతో మొదలైన మెస్సీ ప్రయాణం దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగింది. 17 సీజ‌న్ల పాటు బార్సిలోనాతోనే ఉన్న మెస్సీ.. ఆ క్లబ్ త‌ర‌ఫున అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.