Afghanistan: మీకు మేమున్నాం, రెచ్చిపోండి..ఆఫ్ఘ‌న్ క్రికెట‌ర్స్‌కి తాలిబ‌న్స్ మ‌ద్ద‌తు

Afghanistan: ప్ర‌స్తుతం ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలిబ‌న్ల రాజ్యం నడుస్తుంది. అక్క‌డ ప‌రిస్థితులు అన్ని పూర్తిగా మారాయి. రానున్న రోజుల‌లో దేశ భ‌విష్య‌త్ ఏంట‌నేది ఎవ‌రికి అర్ధం కావ‌డం లేదు. అయితే ఇప్పుడిప్పుడు ఆ దేశంలో ఊపిరి పోసుకుంటున్న క్రికెట్ ఆటపై నీలీనీడలు కమ్ముకుంటున్నాయి. దీనికి కారణం తాలిబన్లకు క్రికెట్ అంటే ఇష్టం లేకపోవడమేనని తెలుస్తోంది.


Taliban's Support to Afghanistan Cricketers
Taliban’s Support to Afghanistan Cricketers

తక్కువకాలంలో మేటిజట్లను మట్టికరిపించిన ఘనత ఆఫ్ఘన్ క్రికెట్ టీమ్‌ది. మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్‌కు ఆ దేశపు ఆటగాళ్లు చాలా శ్రమిస్తున్నట్టు సమాచారం. ఈ తరుణంలో తాలిబన్లు ఆఫ్ఘన్ క్రికెట్ జట్టును అనుమతిస్తారా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే తాలిబన్ల రాకతో ఆఫ్ఘన్ క్రికెట్‌కు వచ్చిన నష్టమేమీ లేదని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ సీఈవో హమీద్ షిన్వరీ స్పష్టత ఇచ్చారు.


Taliban's Support to Afghanistan Cricketers
Taliban’s Support to Afghanistan Cricketers

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు వచ్చే నెలలో పాకిస్థాన్‌తో వన్డే సిరీస్, ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ ఆడేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ సిరీస్ కోసం, అఫ్ఘానిస్తాన్ ఆటగాళ్ళు రోడ్డు మార్గంలో పాకిస్తాన్ వెళ్తారు. అక్కడి నుంచి జట్టు యూఏఈ ద్వారా శ్రీలంక చేరుకుంటుంది. సెప్టెంబర్ 1 నుంచి 5 వరకూ శ్రీలంకలో పాకిస్తాన్-ఆప్ఘనిస్తాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది.ఇప్పుడీ సిరీస్ జరుగుతుందా లేదా అనేది సందేహం ఉండగా,ఈ సిరీస్‌కు తాలిబన్లు అంగీకరించారంటూ చెప్పడం ప్రాధాన్యత సంత‌రించుకుంది.

తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌కు మద్దతుగా నిలిచి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు. తాజాగా, తాలిబన్ నాయకుడు అనీస్ హక్కానీ అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది, మాజీ క్రికెట్ బోర్డు అధికారులు అసదుల్లా, నూర్ అలీ జద్రాన్‌లతో సమావేశం సందర్భంగా ఆ దేశ క్రికెటర్లకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. మీ వెంట మేమున్నాం.. చెలరేగి ఆడండి అంటూ క్రికెటర్లను ఉత్సాహపరిచి, మద్దతు ఇచ్చినట్లు సమాచారం. దీంతో యూఏఈ వేదికగా త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు అఫ్గాన్‌కు లైన్‌ క్లియర్‌ అయినట్లేనని ఆ దేశ క్రికెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.