Marriage: ఒక మహిళ ఎంతమందినైన చేసుకోవచ్చట.. ఎక్కడో తెలుసా?
Samsthi 2210 - July 1, 2021 / 05:08 PM IST

Marriage: పెళ్లంటే నూరేళ్ల బంధం అంటారు. అందుకే పెళ్లి చేసుకునే ముందు బకటి వందసార్లు ఆలోచించి ముందడుగు వేస్తుంటారు. ఒకరికి ఒకరు మంచి జోడి అనిపించాకే పెద్దలు కూడా పెళ్లి చేస్తారు. కాని ఇప్పుడు పెద్దలతో సంబంధం లేకుండా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. తమకు నచ్చిన వారిని ప్రేమించడం వెంటనే పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత డైవర్స్ మళ్లీ పెళ్లి ఇలా వివాహ వ్యవస్థ మరింత దారుణంగా మారింది.
పెళ్లంటే ఒక భార్య, ఒక భర్త ఉంటేనే చూడ ముచ్చటగా ఉంటుంది. రెండో పెళ్లి అనే పదం వినడానికి కూడా చాలా చెండాలంగా ఉంటుంది. అయితే భర్తలు ఎన్ని పెళ్లిళ్లు అయిన చేసుకుంటున్నప్పుడు భార్యలు ఎందుకు చేసుకోకూడదు అని దక్షిణాఫ్రికా మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఇష్టమొచ్చినన్ని పెళ్లిళ్లు చేసుకునే స్వేచ్ఛ మగవారికి ఉన్నప్పుడు ఒకరిని మించి భర్తలను పొందే స్వేచ్ఛ మహిళలకు ఎందుకుండొద్దు అంటూ దక్షిణాఫ్రికా మహిళలు ప్రశ్నిస్తున్నారు.
ప్రపంచంలో అత్యంత ఉదారమైన రాజ్యాంగవ్యవస్థల్లో దక్షిణాఫ్రికా ఒకటి. ఇప్పటికే అక్కడ స్వలింగ వివాహాలు, బహుభార్యత్వం అమల్లో ఉన్నాయి. తాజాగా బహుభర్తృత్వంపై వచ్చిన ప్రతిపాదనలనూ ఆ దేశ ప్రభుత్వం స్వీకరించింది. మహిళలు ఒకరిని మించి పెళ్లి చేసుకోవడానికి చట్టబద్ధమైన అనుమతుల కోసం ఆ దేశ ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తుంది. ఇందుకు సంబంధించి ఫైలును కూడా సిద్ధం చేసింది.
ఆ దేశంలో ఈ ఫైలుని ‘గ్రీన్ పేపర్’ అంటారు. ప్రజల అభిప్రాయాలను స్వీకరించేందుకు ఆ దేశ హోంమంత్రిత్వశాఖ, ఈ గ్రీన్ పేపర్‌ను జారీ చేసింది. బహుభర్తృత్వ ప్రతిపాదనలను అక్కడి సంప్రదాయవాదులు, కొన్ని మతసంస్థల ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్కడి టీవీ నటుడు నలుగురు భార్యలతో జీవనం సాగిస్తుండగా, ఆయన బహుభర్తృత్వంపై మండిపడుతున్నాడు.
బహుభర్తృత్వం అమలైతే దేశ సంస్కృతి సర్వనాశనమవుతుందని అంటున్నారు. ఓ మహిళ ఎన్నడూ పురుషుడి స్థానాన్ని భర్తీ చేయలేదని, బహుభర్తృత్వం ద్వారా పిల్లలు పుడితే ఎవరి తండ్రి ఎవరనేది ఎలా తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. మహిళకు ఎక్కువ మంది భర్తలున్నప్పుడు వారంతా ఆమె ఇంటి పేరు పెట్టుకుంటారా అని అడిగాడు . బహుభార్యత్వం అనేది ఆమోదం పొందిన ఆచారం అని, బహుభర్తృత్వానికి ఆమోదం లేదని ఆఫ్రికన్ క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన నేత కెన్నెత్ మెషో అభిప్రాయపడ్డారు.
బహుభర్తృత్వం ద్వారా పిల్లలు పుట్టినప్పుడు తండ్రి ఎవరో తెలుసుకునేందుకు డీఎన్‌ఏ టెస్టులు చేయాల్సి ఉంటుందని ఇస్లామిక్ అల్-జమాహ్ పార్టీ నేత గానిఫ్ హెన్రిక్స్ విమర్శించారు. ప్రస్తుతం దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుండగా, చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.