China: చైనాలో మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌ణ‌.. ఫ్లైట్స్ బంద్‌, స్కూళ్లు మూసివేత‌

China: క‌రోనా పీడ ఇప్ప‌ట్లో విర‌గ‌డ అయ్యేలా కనిపించ‌డం లేదు. కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో మళ్లీ వైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుండటంతో కొన్ని నగరప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు. సెప్టెంబర్ నెల నుంచి అక్టోబర్ 18 వరకు కరోనా కేసులు అత్యధిక స్థాయిలో పెరిగాయి.

Schools and Colleges Closed in China Due to Covid Outbreak
Schools and Colleges Closed in China Due to Covid Outbreak

క‌రోనా తీవ్ర‌త పెరుగుతున్న నేప‌థ్యంలో ఆంక్ష‌లు విధిస్తున్నారు. ఉత్తర సరిహద్దుకు దగ్గరలోని ప్రావిన్సుల్లో రెండు నగరాల్లో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. దేశీయంగా కరోనావైరస్ వ్యాపించిన పలు నగరాల్లో ఇప్పటికే అధికారులు చాలామంది ఇన్ఫెక్షన్ సోకిన బాధితులను ట్రాక్ చేశారు. వారికి కరోనా టెస్టులు చేయిస్తున్నారు.

పర్యాటక బృందంలోని ఓ వృద్ధ జంట కారణంగానే కొత్త కేసులు వెలుగు చూస్తున్నట్టు అధికారులు గుర్తించారు. గన్షు ప్రావిన్స్‌, ఇన్నర్ మంగోలియాలోని జియాన్‌కు వెళ్లడానికి వారు షాంఘై నుంచి బయలుదేరినట్టు అధికారులు తెలిపారు. వారి కారణంగా బీజింగ్ సహా ఐదు ప్రావిన్సుల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నట్లు తెలిపారు.

కరోనా కేసులు వెలుగుచూస్తుండడంతో అప్రమత్తమైన కమ్యూనిస్ట్ ప్రభుత్వం.. వందలాది విమానాలను రద్దు చేసింది. ప్రధాన విమానాశ్రయాలైన జియాన్, లంఝ విమానాశ్రయం నుంచి దాదాపు 60 శాతం విమానాలు రద్దయ్యాయి. ప్రభావిత ప్రాంతాల్లోని విద్యాసంస్థలు, వినోద ప్రదేశాలు మూసివేసింది చైనా ప్రభుత్వం.

కరోనా టెస్ట్ లు పెద్ద ఎత్తున చేసి నియంత్ర‌ణ చేయాల‌ని భావిస్తున్నారు. ఎవరూ బయటకు వెళ్లొద్దని లంఝ నగర ప్రజలను స్థానిక అధికారులు ఆదేశించారు. కాగా, ఇవాళ చైనాలో 13 కొత్త కేసులు నమోదైనట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది.