ప్రపంచంలో ఎన్నో వింతలు, విచిత్రాలు తరచు మన కంటపడుతూనే ఉంటాయి. కొన్ని విచిత్రాలని చూస్తే రాత్రి నిద్రపట్టదు కదా, పగలు ఏది తినాలని కూడా అనిపించదు. అలాంటిదొకటి ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మనకు తెలిసిన ప్రకారం ఆమ్లెట్ అనేది కోడి గుడ్డు, బాతు గుడ్డు, పక్షి గుడ్డులతో చేస్తుంటారు. కాని బతికున్న పురుగులని తీసుకొని ఆమ్లెట్ చేయడం వినడం, చూడడం వంటివి ఎప్పుడన్నా జరిగిందా, లేదంటే ఈ స్టోరీ చూడండి.
ఉత్తర వియత్నాంలోని హనోయిలో పురుగులతో ఆమ్లెట్ చాలా ఫేమస్ అట. సాధారణ ఆమ్లెట్ తరహాలోనే ఇది కనిపిస్తుంది. కాని దగ్గర నుండి చూస్తే అందులో పురుగులు కనిపిస్తాయి. వాటిని చూసి మన గుండె గుబేల్మనడం ఖాయం. అయితే దీని పేరు వచ్చేసి చారాయి( వేయించిన పురుగులు) లేదా సాండ్ వామ్ ఆమ్లెట్. దీని తయారీ చాలా సులభంగా ఉంటుందట. పురుగులని వేడి నీటితో కడిగిన తర్వాత ఉప్పు, కారం వేసి గుడ్ల మిశ్రమం, ఉల్లిపాయలు, కొత్తిమీర, మిర్చి అంతటిని మిక్స్ చేసి తర్వాత పెనంపై అరటి ఆకులు పెట్టి దాంట్లో వెన్న వేసి వేడి చేస్తారు.
కొద్ది సేపటి తర్వాత ఆమ్లెట్ తినడానికి సిద్ధంగా ఉంటుంది. దీని రుచి మాంసాహారం మాదిరిగానే ఉంటుందట. చలికాలంలో ఈ ఫుడ్‌ని వియత్నాం ప్రజలు ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఆమ్లెట్ కోసం అన్ని పురుగులని ఎక్కడ నుండి తెస్తారు అనే డౌట్ మీకు కలగొచ్చు. విషయం ఏమంటే ఆ పురుగులని ప్రత్యేకంగా సాగు చేసి ఆమ్లెట్ కోసం వాడతారట. మరి మీకు ఇలాంటి ఆమ్లెట్ టేస్ట్ చేయాలంటే వియత్నాంకు చెక్కేయాల్సిందే అంటున్నారు.