Lockdown: 6 నెలల తర్వాత ఒకే ఒక్క కేసు.. లాక్డౌన్ ప్రకటించిన ప్రభుత్వం
Samsthi 2210 - September 3, 2021 / 02:00 PM IST

Lockdown: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు వేవ్‌లు పూర్తి కాగా, మూడో వేవ్ ప్రకంపనాలు కూడా మొదలయ్యాయి. ఈ మహమ్మారిని అరికట్టేందుకు దేశ ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం అందరికి వ్యాక్సిన్ ఒక్కటే ఆయుధంలా కనిపిస్తుంది. మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటించడంతో పాటు అందరు వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి.
అయితే అన్ని దేశాలకు ఇప్పుడు కరోనా పెద్ద సమస్యగా మారగా, దానిని అరికట్టేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనా బాగా పెరిగితే లాక్డౌన్ పెట్టడానికి ఏ మాత్రం వెనకాడడం లేదు. అయితే ముందు నుండి కరోనాపై పోరాటం చేసి విజయం సాధించిన న్యూజిలాండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది.
6 నెలల తర్వాత స్థానికంగా తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.. ఈ కేసును డెల్టా వేరియంట్‌గా అనుమానిస్తున్నారు అధికారులు.. ఇక, దీంతో అప్రమత్తమైన ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్… మూడు రోజుల లాక్డౌన్ ప్రకటించారు.మరోవైపు 50 లక్షలకు పైగా జనాభా ఉన్న న్యూజిలాండ్‌లో ఇప్పటి వరకు వందల్లో మాత్రమే పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. కేవలం 26 మంది మాత్రమే కరోనాబారినపడి మృతిచెందారు.. అయితే, కరోనాపై పూర్తిస్థాయిలో విజయం సాధించి ప్రపంచదేశాల అభినందనలు అందుకున్న న్యూజిలాండ్‌లో ఆరు నెలల తర్వాత ఇప్పుడు మళ్లీ ఒక కేసు టెన్షన్ పెడుతోంది
డెల్టా వేరియంట్ పరిస్థితిని మొత్తం మార్చగలదని పేర్కొన్న ప్రధాని అత్యవసరంగా లాక్డౌన్ ప్రకటించింది. కరోనాపై పూర్తిగా విజయం సాధించకపోతే ఏం జరుగుతుందో మనం ప్రపంచమంతా గమనిస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలని, అవసరమైన సేవలకు మాత్రమే వెళ్లాలని ప్రధాని ఆర్డెర్న్ చెప్పారు.
ఇంటి నుండి బయలుదేరినప్పుడు అన్ని సమయాల్లో రక్షణాత్మక మాస్క్‌లు ధరించాలని సూచించారు. న్యూజిలాండ్‌లో చివరిగా ఫిబ్రవరిలో కరోనా కేసు గుర్తించారు. కరోనా డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరమనే విషయం ఇతర దేశాల అనుభవం ద్వారా తెలుస్తుందని అన్నారు. లాక్డౌన్ ప్రకటించిన తరువాత న్యూజిలాండ్ డాలర్ 1.5% తగ్గి 0.6926 డాలర్లకు పడిపోయింది.