ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్.. రాణించిన జడ్డూ, హార్ధిక్
Samsthi 2210 - December 2, 2020 / 01:34 PM IST

కాన్ బెర్రా వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. ఒకానొక దశలో రెండొదల యాభై స్కోరు కూడా రాదనే స్థితిలో భారత్ ఉండగా, ఆల్‌రౌండర్స్ జడేజా, హార్ధిక్ పాండ్యాలు ఆదుకున్నారు. హార్దిక్ పాండ్యా (92 నాటౌట్: 76 బంతుల్లో 7×4, 1×6), రవీంద్ర జడేజా (66 నాటౌట్: 50 బంతుల్లో 5×4, 3×6)ల కృషి వలన భారత్ నిర్ణీత ఓవర్లలో 302 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (63: 78 బంతుల్లో 5×4) కూడా అర్ధ సెంచరీ నమోదు చేయడం ఇండియాకి కలిసొచ్చింది.
ఈ మ్యాచ్‌లో పలు మార్పులతో బరిలోకి దిగాయి ఇండియా, ఆసీస్ జట్లు. భారత్ విషయానికి వస్తే మయాంక్ స్థానంలో శుభమన్ గిల్‌ని ఎంపిక చేయగా, షమి బదులు నటరాజన్, చాహల్ స్థానంలో కుల్దీప్ జట్టులోకి వచ్చారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మొదట దూకుడుగా ఆడే ప్రయత్నం చేసింది. కట్టుదిట్టమైన బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా బౌలర్స్ శిఖర్ ధావన్ వికెట్‌ని త్వరగానే తీసుకున్నారు. ఆ తర్వాత కొత్త ఓపెనర్ శుభమన్ గిల్ (33: 39 బంతుల్లో 3×4, 1×6) కూడా నిరాశపరిచాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (19: 21 బంతుల్లో 2×4), కేఎల్ రాహుల్ (5: 11 బంతుల్లో) వెంట వెంటనే పెవీలియన్ బాట పట్టారు.
ఒకానొక దశలో 152/5తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్ జట్టుని.. ఆరో వికెట్‌కి 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ద్వారా హార్దిక్ పాండ్యా- రవీంద్ర జడేజా ఆదుకుంది. దీంతో భారత్ ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్‌ని నిర్ధేశించగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో అస్గన్ అగర్ రెండు వికెట్లు పడగొట్టగా.. జోష్ హేజిల్‌వుడ్, సీన్ అబాట్, ఆడమ్ జంపాకి తలో వికెట్ దక్కింది. ఇక ఈ మ్యాచ్‌లో మరో విశేషం ఏమంటే విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ద్వారా వన్డేల్లో 12,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కాగా, ఆస్ట్రేలియా వరుస విజయాలతో సిరీస్‌ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.