Monkey Pox: మంకీపాక్స్ క‌ల‌క‌లం.. వ‌ణికిపోతున్న ప్ర‌జ‌లు

Monkey Pox: ప్ర‌స్తుతం క‌రోనా వ‌ల‌న ప్ర‌పంచ‌మంతా వ‌ణికిపోతుంటే మ‌రోవైపు మంకీ పాక్స్, జికా అంటూ అనేక ర‌కాల వైర‌స్‌లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా అమెరికాలో మంకీపాక్స్ క‌ల‌క‌లం సృష్టిస్తుంది. 20 ఏళ్ల త‌ర్వాత తొలిసారి ఓ అరుదైన వ్యాధి అమెరికా ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తుంది. నైజీరియా వెళ్లి వ‌చ్చిన వ్య‌క్తికి మంకీ పాక్స్ సోకిందని తెలిసి అత‌నిని ఐసోలేష‌న్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ వ్య‌క్తి ప్ర‌యాణించిన విమానంలో ఇత‌ర ప్ర‌యాణికుల్ని కూడా గుర్తించి అప్ర‌మ‌త్తం చేస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కేసు న‌మోదైంద‌ని, దీని వ‌ల‌న ప్ర‌జానికానికి పెద్ద ప్ర‌మాదం ఏమి లేద‌ని ప్ర‌భుత్వ అధికారులు చెబుతున్నారు.2003లో మంకీపాక్స్ క‌ల‌క‌లం సృష్టించ‌గా అప్పుడు 47 మందికి సోకింది. జూన్‌లో బ్రిట‌న్‌లోను నాలుగు మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వ‌చ్చిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

మంకీ పాక్స్ సోకిన వారికి జ్వ‌రం, త‌ల‌నొప్పి, న‌డుం నొప్పి, కండ‌రాల నొప్పి, అల‌స‌ట‌గా ఉంటుంది. త‌ర్వాతి ద‌శ‌లో చ‌ర్మంపైన ద‌ద్ద‌ర్లు, బొబ్బ‌లు ఏర్ప‌డ‌తాయి. ఇవి సాధార‌ణంగా ముఖం, అర‌చేతులు, అరికాళ్ల‌పై వ‌స్తుంటాయి. వీటి వ‌ల‌న మ‌చ్చ‌లు కూడా ఏర్ప‌డ‌తాయి. ల‌క్ష‌ణాలు 14 నుండి 21 రోజుల‌లో బ‌య‌ట‌ప‌డతాయి. మైల్డ్ కేసులో ల‌క్ష‌ణాలు క‌న‌ప‌డ‌వు. ఆ స‌మ‌యంలో ఒక‌రి నుండి మ‌రొక‌రికి సోకే అవ‌కాశం ఉంది.

మంకీపాక్స్‌కి ప్ర‌స్తుతం ఎలాంటి చికిత్స లేదని అమెరిక‌న‌స్ సీడీసీ వెల్ల‌డించింది. వ్యాప్తిని అడ్డుకోవ‌డంలో స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ స‌హా కొన్ని యాంటీ వైర‌ల్ ఔష‌దాలు తీసుకోవ‌చ్చ‌ని, వాటి వ‌లన మంచి ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని అధికారులు చెబుతున్నారు.

మంకీపాక్స్ అనేది స్మాల్‌పాక్స్ కుటుంబానికి చెందిన‌ది. జంతువుల నుండి మ‌నుషుల‌కు ఈ వ్యాధి సోకుతుంది. మ‌ధ్య‌, ప‌శ్చిమ ఆఫ్రాకాలో వైర‌స్ ఎక్కువ‌గా వ్యాపిస్తుంటుంది. క‌రోనా మాదిరిగానే తుంపర్లతో ఒక‌రి నుండి మ‌రొక‌రికి సోకుతుంది. వ్యాధి వ‌చ్చిన వారిని తాకితే మంకీపాక్స్ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. శ‌రీరంలోకి పూర్తిగా వ్యాపించ‌డానికి 5 నుండి 21 రోజులు ప‌ట్టొచ్చ‌ని చెబుతున్నారు.