Animal Precautions :వాతావరణ మార్పుల వల్ల జంతువుల్లో వచ్చే వ్యాధులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Naveen Kumar Kabsa - May 30, 2022 / 02:46 PM IST

ఈ మధ్యన వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారిగా చల్లబడటం లేదంటే విపరీతమైన ఎండలతో వాతావరణం హీటెక్కడం లాంటి సందర్భాలను మనం తరుచుగా చూస్తూనే ఉన్నాం. ఎక్కువ ఎండ ఉన్నప్పుడు మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెంటనే మన శరీరాలను చల్లబరుచుకోవడానికి రకరకాల ప్రయత్నాలను చేస్తూనే ఉంటాం. మరి వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల జంతువుల శరీరాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, జంతువుల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
నిజానికి జంతువుల శరీరాలు కొంతస్థాయి వరకు వాతావరణ మార్పులను తట్టుకునేలా ఉంటాయి. కానీ అధికస్థాయిలో ఉండే వాతావరణ మార్పుల వల్ల జంతువుల శరీరాలు తట్టుకోలేవు. అధిక ఉష్ణోగ్రతల వల్ల జంతువుల్లో హీట్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తాయి. జంతువులు లోతైన శ్వాసను తీసుకోవడాన్ని గమినంచవచ్చు. జంతువుల్లో లాలాజలం విపరీతంగా ఉత్పత్తి అవుతుంది. అలాగే జంతువులు ధాన్యం లేదంటే మేతను తినడానికి ఇష్టపడవు మరియు కూర్చోవు. కొన్నిసార్లు జంతువులు వణుకుతాయి మరియు చివరకు మరణిస్తాయి.
మనుషులు ఎండను తట్టుకోవడానికి ఎలాగైతే జాగ్రత్తలు పాటించడం జరుగుతుందో అలాగే జంతువుల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా జంతువులను పాక లేదంటే షెడ్డులో కట్టేయడం కన్నా వాటిని చెట్ల కింద నీడలో ఉంచడం మంచి మార్గం. అలాగే పెద్ద ఫ్యాన్లు లేదంటే కూలర్లు మరియు ఫౌంటేన్లను ఉంచడం వల్ల వాటికి ఎండ వేడిమి తెలియదు. అలాగే అవి ఉండే ప్రదేశాల్లో తప్పకుండా వెంటలేషన్ ఉండేలా జాగ్రత్తపడాలి.
జంతువులు ఉండే యానిమల్ హౌజ్ పై కప్పు ఎత్తు కనీసం 12 అడుగులు లేదా అంతకన్నా ఎక్కువగా ఉండేలా జాగ్రత్తపడాలి. ఇక యానిమల్ హౌజ్ లోపల ఉపయోగించే ఫ్యాన్లు లేదంటే కూలర్లను 36-48 అంగుళాలు మరియు భూమి నుండి 5 అడుగుల ఎత్తులో ఉన్న గోడపై 30 డిగ్రీల కోణంలో అమర్చాలి. దీని వల్ల జంతువులకు వేడి ప్రభావం పడకుండా ఉంటుంది. అలాగే పశువులు స్నానం చేయడానికి వీలుగా 80 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు మరియు 4-6 అడుగుల లోతులో ఉండే చెరువు ఉంటే ఎంతో మంచిది.