India: ఇండియాలో.. డేంజర్.. యమడేంజర్..
Kondala Rao - April 23, 2021 / 03:09 PM IST

India ఇండియాలో కరోనా వైరస్ సెకండ్ ఫేజ్ లో పట్టపగ్గాల్లేకుండా వ్యాపిస్తోంది. భారత దేశంలో తప్ప ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ ఇంతగా పాజిటివ్ కేసులు రావట్లేదు. వారం రోజుల కిందట రోజుకి లక్షకు పైగా వచ్చిన కేసులు ఇప్పుడు మూడు లక్షలకు మించి నమోదవుతున్నాయి. మూడు రోజులుగా రోజుకు రెండు వేల మందికి పైగానే ప్రజలు ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తాజా లెక్కలని కేంద్ర ప్రభుత్వమే నిన్న గురువారం అధికారికంగా వెల్లడించింది. ఇక అనధికారికంగా ఇంకెంత మంది ఈ భూతం బారినపడుతున్నారో తలచుకుంటేనే ఒంట్లో వణుకు పుడుతోంది. దీనికితోడు ఆక్సీజన్ కొరత మన దేశాన్ని పట్టిపీడిస్తోంది. ఎటు చూసినా కరోనా.. కరోనా.. అనే కేకలే వినిపిస్తుండటంతో ఏం చేయాలో సర్కార్లకి పాలుపోవట్లేదు.
ఎవరూ అతీతం కాదు..
చివరికి ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, మాజీ ప్రధానులు ఇలా అందరికీ కొవిడ్-19 అంటుకుంటోంది. మరో వైపు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితంగా కేసులు నాన్ స్టాప్ గా పరుగెత్తుతున్నాయి. గత 24 గంటల్లో దాదాపు 17 లక్షల 40 వేల 550 మందికి కరోనా టెస్టులు చేయగా అందులో దాదాపు ఐదో వంతు మందికి (3 లక్షల 32 వేల 730 మందికి) నిర్ధారణ అయింది. ఇందులో 2,263 మంది తుది శ్వాస విడిచారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య ఒక కోటీ 62 లక్షల 63 వేల 695కి చేరింది. గతేడాది నుంచి ఇప్పటికి లక్షా 86 వేల 920 మంది చనిపోయారు.
ఇదొక్కటే ఊరట..
ఇప్పుడు దేశం మొత్తమ్మీద 24 లక్షల 28 వేల 616 మంది కొవిడ్-19కి చికిత్స పొందుతున్నారు. అయితే ఇందులో సుమారు 2 లక్షల మంది నిన్న ఈ జబ్బు నుంచి కోలుకొని ఇంటికి వెళ్లటం ఒక్కటే కాస్త ఊరట కలిగించే అంశం. కాగా ఇప్పటి వరకు కరోనాపై పైచేయి సాధించినవారి సంఖ్య కోటీ 36 లక్షలకు పెరిగింది. అంటే రికవరీ రేటు 84.46 శాతం అన్నమాట. నిన్న గురువారం 31 లక్షల 47 వేల 782 మందికి కొవిడ్-19 వ్యాక్సిన్ వేశారు. దీంతో మొత్తమ్మీద 13 కోట్ల 54 లక్షల టీకా డోసులను ప్రజలకు ఇచ్చినట్లయింది. మన దేశంలో కరోనా వ్యాప్తి మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటకల్లో విపరీతంగా ప్రభావం చూపుతోంది.