స్ట్రెయిట్ టాక్ విత్ శ్రావణి: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిలతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.!

Sravani Journalist - September 23, 2022 / 02:48 PM IST

160286స్ట్రెయిట్ టాక్ విత్ శ్రావణి: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిలతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.!

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారాలపట్టి ఆమె. తెలుగునాట ఓ మహిళ సుదీర్ఘ పాదయాత్ర చేయడం అనేది వైఎస్ షర్మిలకు మాత్రమే సొంతమైన విషయం. ఒకసారి కాదు, రెండోసారి కూడా ఆమె సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు.

ఓసారి అన్నయ్య వైఎస్ జగన్ కోసం, ఈసారి కేవలం తనకోసం మాత్రమే.. అదీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలిగా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు వైఎస్ షర్మిల. మొక్కవోని ధైర్యంతో వైఎస్ షర్మిల పాదయాత్ర 2 వేల కిలోమీటర్ల మైలు రాయిని దాటింది.

పాదయాత్ర సందర్భంగా తూటాల్లాంటి మాటల్ని రాజకయీ ప్రత్యర్థులపై వైఎస్ షర్మిల సంధిస్తున్నారు. వాటికి కౌంటర్ ఎటాక్ కూడా రాజకీయ ప్రత్యర్థుల నుంచి గట్టిగానే వస్తోంది. దానిపైనా వైఎస్ షర్మల మళ్ళీ స్పందించక తప్పడంలేదు. ‘మరదలు’ అంటూ ఓ మంత్రి వెటకారం చేయడం, ‘చెప్పుతో కొడతా’ అని షర్మిల సమాధానమివ్వడం.. ఇవన్నీ పాదయాత్ర సందర్భంగా చోటు చేసుకున్న కీలక పరిణామాలు.

కేఏ పాల్‌తో షర్మిలకు పోలిక పెట్టడం దగ్గర్నుంచి, షర్మిలపై పోలీసు కేసుల వరకు వ్యవహారాలు వెళ్ళడం తెలిసిన విషయాలే. రాజకీయాల్లో మగాళ్ళు పాదయాత్రలు చేయడానికి వుండే ఇబ్బందులకు అదనంగా, మహిళలకు కొన్న సమస్యలుంటాయ్. వాటిని సైతం షర్మిల అధిగమిస్తూ.. నిబద్ధతతో పాదయాత్ర చేస్తున్నారు. అదీ సుదీర్ఘ పాదయాత్ర. మండుటెండ అయినా, బోరున కురుస్తున్నవాన అయినా.. దేన్నీ ఆమె లెక్క చేయడంలేదు. తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటోంది.. రెండు వేల రెండు వందల కిటోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేసిన అలుపెరుగని బాటసారి ఆమె.

ఈ నేపథ్యంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలతో ఆ పాదయాత్రలోనే న్యూస్ క్యూబ్ ప్రతినిథి శ్రావణి నిర్వహించిన స్పెషల్ ఇంటర్వ్యూ.!

ప్రశ్న: రెండోసారి పాదయాత్ర చేస్తున్నారు.. అదీ 2 వేల కిలోమీటర్లకు పైగానే. ఈ రికార్డు మీకే సొంతం.. ఎలా ఫీలవుతున్నారు.?

జవాబు: దీన్నొక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ప్రజలతో మమేకం అవడం అదృష్టంగా భావిస్తున్నాను. నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ఆస్వాదించేవారు. యాత్ర చేస్తున్నంతసేపూ వేరే విషయాలేవీ ఆలోచనల్లోకి రావు. అదో ప్రత్యేకమైన భావన అని చెప్పేవారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.

ప్రశ్న: ఆంధ్రప్రదేశ్‌లో గతంలో పాదయాత్ర చేశారు. ఇప్పుడు తెలంగాణలో ఒంటరిగా పాదయాత్ర చేస్తున్నారు. అక్కడికీ, ఇక్కడికీ ఏం వ్యత్యాసం చూశారు.?

జవాబు: అక్కడా ఇక్కడా ప్రజలు, ప్రజా సమస్యలనేవి కామన్ ఫ్యాక్టర్. కాకపోతే, నేనుగా మాటిచ్చి వాళ్ళని కన్విన్స్ చేయడం అనేది పెద్ద ఛాలెంజ్. రాజశేఖర్ రెడ్డిని చూసిన ప్రసలు, రాజశేఖర్ రెడ్డి బిడ్డలో రాజశేఖర్ రెడ్డిని చూడగలరా.? అన్న ప్రశ్నకు నేను సమాధానం.

ప్రశ్న: పాదయాత్రకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన వారసులుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మీరు పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రలు అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డాయి. వైఎస్ కుటుంబం పాదయాత్రలకే అంకితమవుతుందా.?

జవాబు: నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర వల్ల నాకు అర్థమయ్యిందేంటంటే, పాదయాత్రకు మించి ప్రజలతో కనెక్ట్ అవడానికి ఇంకే అవకాశమూ వుండదు అని. ఆయన చూపిన బాటలోనే నేను నడుస్తున్నాను.

ప్రశ్న: షర్మిలకు ఇక్కడి రాజకీయాలతో పనేంటి.? అనేవారికి మీరిచ్చే సమాధానం.?

జవాబు: నేనెప్పుడూ రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. తెలంగాణలో కేసీయార్ రెండోసారి గెలవడం అనేది ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి లేకపోవడం వల్లనే. రాజకీయాల్లో ప్రత్యామ్నాయం లేకపోవడమనేది మంచిది కాదు. కాంగ్రెస్, బీజేపీ లాంటి పెద్ద పార్టీలు వుండి, ప్రత్యామ్నాయంగా మారలేకపోయాయి. అవి ప్రజలకు ఆ భరోసా ఇవ్వలేకపోయాయి. రాజశేఖర్ రెడ్డిగారి సంక్షేమ పాలన తెలంగాణలో గల్లంతయ్యింది గనుక, కేసీయార్ నిర్లక్ష్య పాలనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, నేను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది.

ప్రశ్న: మిమ్మల్ని పొలిటికల్ లేడీ సూపర్ స్టార్ అంటున్నారు.? మీదొక పార్టీయేనా.. అని లైట్ తీసుకున్నోళ్ళు, ఇప్పుడు మీ మీద ఫిర్యాదు చేసేదాకా వెళ్ళింది.. ఇలా రాజకీయాలు మారతాయని మీరు ఊహించారా.?

జవాబు: ఇంతకన్నా గొప్పగానే రాజకీయాలు మారుతుంటాయ్. వైఎస్సార్ పేరు మీద పెట్టిన పార్టీ ఇది. సక్సెస్ అవదన్న అనుమానం నాకెప్పుడూ లేదు. ఇతరులకు ఆ అనుమానాలు వుండొచ్చు. ఓ మహిళకు ఎవరి అండా లేదు, ఏం చేయగలదు.? అని అనుకోవచ్చు. మాట్లడతారు, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కు వుంటుంది. మాట్లడేవారికి విశ్వసనీయత వుండాలి. అలా వున్నవాళ్ళు మాట్లాడితే స్పందిస్తాను. ఇంత రియాక్షన్ వచ్చిందంటే, నాకు సంతోషమే కదా. ఇదే మా బలాన్ని చెప్పకనే చెబుతోంది. ప్రజల్లో నాకు ఆదరణ పెరుగుతోందని వాళ్ళకి అర్థమయ్యింది. సర్మిలా రెడ్డి వల్ల కేసీయార్ ఇమేజ్ డౌన్ అవుతోందనీ వారికి తెలిసింది. అందుకే, వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా నన్ను ఎలాగైనా ఆపాలన్న పద్ధతిలోనే ఇదంతా చేస్తున్నారు. స్పీకర్‌కి ఫిర్యాదు చేయడం, నా మీద ఎఫ్ఐఆర్ పెట్టడం.. ఇవన్నీ నన్ను ఆపేందుకు చేస్తున్న ప్రయత్నాలే. నన్ను అరెస్టు చేయించడానికీ ప్రయత్నిస్తున్నారు.

ప్రశ్న: చట్ట సభలకు ప్రాతినిథ్యం వహిస్తున్న అధికార పార్టీ సీనియర్ లీడర్లని పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి దూషణలకు దిగడమేంటన్న ఆరోపణలకు మీరిచ్చే సమాధానమేంటి.?

జవాబు: నీకు దమ్ముంటే నీ మీద వచ్చిన ఆరోపణలకు సమాధానమిచ్చుకో. మీరు అవినీతి, దౌర్జన్యాలు, మాఫియా, అక్రమాలు చేస్తున్నారని మాట్లాడితే తప్పా.? అవి చేస్తే తప్పు లేదుగానీ, తప్పు చేస్తున్నారని ప్రశ్నిస్తే తప్పా.? ఓ మంత్రి నన్ను ‘మరదలు’ అంటే తప్పా.? ‘ఎవడ్రా నీకు మరదలు.?’ అని నేను ప్రవ్నిస్తే తప్పా.? మీకు దమ్ముంటే మీరు మీ నియోజకవర్గానికి ఏం చేశారో చర్చ పెట్టండి, అక్కడికి నేనొచ్చి మీకు సమాధానమిస్తాను. పబ్లిక్ ఫోరంలో అందరూ వుంటారు, నిజాలు తేలిపోతాయ్.

ప్రశ్న: తెలంగాణ రాజకీయాల్లోంచి నిష్క్రమించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుని మళ్ళీ షర్మిల తీసుకొచ్చి, తెలంగాణ ప్రజల మనోభావాల్ని దెబ్బ తీస్తోందనే వారికి మీరిచ్చే సమాధానమేంటి.? ఈ పార్టీకి స్కోప్ లేదనేవారికి ఏం సమాధానమిస్తారు.?

జవాబు: ఏది పడితే అది మాట్లాడతారు. గోబెల్స్ ప్రచారం చేస్తే సరిపోతుందా.? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు వైఎస్సార్ ఇచ్చినంత భరోసా, ఇప్పుడున్న నాయకులెవరూ ఇవ్వలేకపోతున్నారు. జలయజ్ఞం, ఉచిత విద్యుత్, బోర్లు.. ఇలాంవి తెలంగాణకే వైఎస్సార్ ఎక్కువగా చేశారు. తెలంగాణ నుంచి రాజశేఖర్ రెడ్డిని వేరు చేయడం అసాధ్యం. ఇక్కడ ప్రతి ఇంట్లో రాజశేఖర్ రెడ్డి లబ్దిదారులున్నారు. నేనొచ్చి కొత్తగా చేస్తున్నాననడంలో అర్థం లేదు.

ప్రశ్న: మంత్రి నిరంజన్ రెడ్డి ఫిర్యాదుపై మీరేమంటారు.?

జవాబు: మంత్రి గనుక ఆయన ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఓ మహిళను పట్టుకుని మంత్రి అసభ్యంగా మాట్లాడారని నేను ఫిర్యాదు చేస్తే, దానికి ఎఫ్ఐఆర్ బుక్ అవలేదు. ఎందుకని.? ప్రజాస్వామ్య దేశంలో మంత్రి మీద సామాన్యులెవరూ ఫిర్యాదు చేయకూడదా.? చట్టంలో రాసి వుందా.? ఎందుకని పోలీసులు నా ఫిర్యాదు తీసుకోవడంలేదు.? మంత్రి మీద ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదెందుకు.? ఇది ప్రజాస్వామ్యం కాదు కాబట్టి, ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్లున్నట్లు తెలంగాణలో టీఆర్ఎస్ వ్యవహరిస్తోంటే, బీజేపీకి ఆర్ఎస్ఎస్ వున్నట్లు.. పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఓ పార్టీ అధినేత ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ బుక్ చేయనప్పుడు, సామాన్య మహిళకు తెలంగాణలో ఏం భద్రత వుంటుంది.?

ప్రశ్న: పార్టీకి జనంలో ఆదరణ లేదు కాబట్టే, మీరు టీఆర్ఎస్ మీద అనవసరపు ఆరోపణలు చేసి, వార్తల్లోకెక్కే ప్రయత్నం చేస్తున్నారన్న టీఆర్ఎస్ ఆరోపణలకు మీ సమాధానమేంటి.?

జవాబు: పాదయాత్ర సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ఎమ్మెల్యే గురించీ మాట్లాడాను. మాట్లాడుతూనే వున్నాను. ఇప్పుడు వున్నపళంగా 2 వేల కిలోమీటర్లు పూర్తయ్యాక అధికార పార్టీ నేతలకు జ్ఞానోదయం కలిగింది. ఇప్పటికిప్పుడు పాదయాత్ర ఆపెయ్యాలనేది వారి ఆలోచన. వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం నాకేంటి.? స్థానికులు వచ్చి తమ సమస్యలు చెబుతున్నారు. మా ఎమ్మెల్యే మా భూముల్ని తీసుకున్నాడని ప్రజలు చెబుతారు గనుక, ఆ చెప్పిన విషయాల్ని పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడుతుంటాను. నేను మాట్లాడేది ఏదీ కల్పితం కాదు. ఏదో కలలో వచ్చిన విషయాలు అసలే కావు. కావాలని రాసుకుని మాట్లాడినవి కూడా కావు.

ప్రశ్న: ఏదో యధాలాపంగా మంగళవారం మరదలు.. అనే మాటకి ఎందుకింత వివాదం.? మీరెందుకు అంత ఓవర్ రియాక్ట్ అయ్యారు.? చెప్పుతో కొడతాను, మెట్టుతో కొడతాను అనే స్థాయి వ్యాఖ్యలు ఎందుకు.? విషయం స్పీకర్‌కి ఫిర్యాదు చేసేదాకా వెళ్ళింది.?

జవాబు: ఎందుకంటే, సందర్భం వచ్చింది గనుక.. ఈ మంత్రి ఇలాంటి మాటలు మాట్లాడాడు కాబట్టి, అది సభ్యత కాదు కాబట్టి.. మరదలు అన్నదానికి, ‘ఎవడ్రా నీకు మరదలు?’ అన్నాను. సభ్యత లేకుండా మాట్లడేవాడిని ప్రశ్నించాలి కదా.? నేను రియాక్ట్ అయితే మాత్రం, ఎందుకింత రియాక్షన్.? మరదలు అన్నవాడి మీద కదా ఎవరైనా మాట్లాడాల్సింది.? నన్ను అన్నాడు కాబట్టి పడాలా? నన్నుఎప్పుడో అన్నాడు కాబట్టి, క్షమించెయ్యాలా.? ఎందుకు క్షమించాలి.? అయినా ఎవరూ ఆయన్నెందుకు తప్పు పట్టరు.? ప్రశ్నించరు.?

ప్రశ్న: తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టినప్పటి నుంచి రెండు వేల రెండు వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేసినంతవరకు మీకు కలిసొస్తున్న అంశాలేంటి.? ప్రధానంగా సమస్యలపై ఫోకస్ పెడుతూ ముందుకు వెళుతున్నారు.. ఎలాంటి సమస్యల నుంచి వినతులు మీకు వస్తున్నాయి.?

జవాబు: అన్ని వర్గాలూ నిస్సహాయ స్థితిలో వున్నాయి. మద్దతుధర లేక, సాయం లేక, పంట నష్టపోతే.. నష్టపరిహారం లేకపోవడం.. రైతు చనిపోతే భీమా రాకపోవడం.. అసలు రైతు అనేవాడికి భరోసా లేకుండా పోయింది. వ్యవసాయం చేయడం దండగ అనే స్థితికి వచ్చేశారు రైతులు. కౌలు రైతుల్ని అసలు గుర్తించడంలేదు. రాజశేఖర్ రెడ్డి వున్నప్పుడు ఎరువుల సబ్సిడి, పంట నష్టపరిహారం.. ఇవన్నీ వుండేవి. ముప్ఫయ్ వేలు ఇచ్చే పథకాలు రద్దు చేసి, ఐదు వేలు చేతులో పెట్టి దులుపుకుంటున్నారు. విద్యార్థులు, మహిళలు.. ఇలా అందరూ ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగుల సమస్యలున్నాయ్.. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలేదు. అసైన్డ్ భూములేవి.? ప్రభుత్వ భూములేవి.? అన్నవాటిని గుర్తించి ప్రభుత్వ పెద్దలు కబ్జా చేయడానికే ధరణి తెచ్చారు.

ప్రశ్న: వైఎస్సార్ తెలంగాణ పార్టీకి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులుంటాయనే భావన వుంది. రెడ్డి, క్రిస్టియన్ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి దూరమవుతాయని సునీల్ కొనుగోలు లాంటి వ్యూహకర్తల టీమ్ ఓ రిపోర్ట్ ఇచ్చింది. కాంగ్రెస్ గతంలో మీ పార్టీని లెక్కల్లోకి తీసుకోలేదు. ఇప్పుడు మీ పార్టీకి బలం పెరగడాన్ని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మీకెలా అనిపిస్తోంది.?

జవాబు: మమ్మల్ని కాంగ్రెస్ పట్టించుకోకపోయినా, టీఆర్ఎస్ అలాగే బీజేపీ పట్టించుకోకపోయినా మాకేమీ అభ్యంతరం లేదు. దయచేసి మా జోలికి రాకండి. మీ పని మీరు చేసుకోండి. మీ అభిప్రాయం ఎవరికీ మేటర్ కాదు. నన్ను తక్కువ చూసినా నాకేమీ నష్టం లేదు. చాపకింద నీరులా మేం విస్తరిస్తున్నాం.

ప్రశ్న: షర్మిలకు వున్న ధైర్యమేంటి.? మొండి పట్టుదల ఏంటి.? ఇంకా ఎంతదూరమీ ప్రయాణం.?

జవాబు: ఓసారి అడుగు అంటూ వేశాక వెనకడుగు వేసేది లేదు. నిలబడాలనుకున్నాను ఈ ప్రజల కోసం, నిలబడతాను. మొన్న చెప్పినట్లు రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారు, నన్ను కూడా చంపుతారు. కానీ, తెలంగాణ ప్రజల కోసం గట్టిగానే నిలబడతాను ఊపిరి వున్నంతవరకు, ప్రాణం వున్నంతవరకు. ఈ పాదయాత్ర ఎండనకా వాననకా చేస్తున్నాను. అన్నీ పక్కన పెట్టి చేస్తున్నాను. నా చిత్తశుద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదిస్తే, రాజశేఖర్ రెడ్డిగారి పాలన అందిస్తాను. అది లేదూ అంటే.. ఇలాగే పోరాటం చేస్తాను.. ప్రజల పక్షాన మాత్రం నిలబడతాను.

ప్రశ్న: ఇన్నేళ్ళ తర్వాత వైఎస్సార్ మరణంపై మీకెందుకు అనుమానం వచ్చింది.? కుట్ర చేసి చంపారని ఎందుకు అంటున్నారు.? ఎవరు కూడా ఊహించని కాంట్రవర్సీ, ఓ స్టేట్మెంట్ షర్మిల ఆయన కూతురుగా మాట్లాడటమేంటి.?

జవాబు: ఇది కాంట్రవర్సీ కాదు. కాంట్రవర్సీ అవుతుందని అనుకోలేదు. ఆలోచించకుండా వచ్చిన మాట ఇది. కొత్తగా కుట్ర చేశారనే అనుమానం వచ్చింది కాదు. రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పటినుంచీ ఈ అనుమానం ఇలాగే వుంది. నాకే కాదు, కోట్ల మంది తెలుగు ప్రజలకు ఈ అనుమాననం వుంది. ఇప్పటిదాకా ఎందుకు ఇది ప్రస్తావించలేదంటటే, ఇది కుట్ర కాదని మేమెప్పుడూ చెప్పలేదు. మా మనసులో వున్న మాట అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ విచారణ చేయించాలి. కాంగ్రెస్ పార్టీ మా కుటుంబాన్ని వేధించింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంక్వయిరీ వేస్తారు, మాకు న్యాయం చేస్తారు.. అన్న నమ్మకం ఎందుకు పోయిందంటే, రాజశేఖర్ రెడ్డి పేరుని ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. విచారణ చేస్తారన్న నమ్మకం అందుకే పోయింది. న్యాయం జరగలేదని తేలిపోయింది. అప్పటికీ ఇప్పటికీ మాలోనూ, ప్రజల్లోనూ కుట్ర చేసి చంపారన్న అనుమానమే వుంది.

ప్రశ్న: ఎవరి మీద మీకు అనుమానం వుంది.? అప్పట్లో రిలయన్స్ మీద ఆరోపణలు వచ్చాయి, ఆ సంస్థపై దాడులూ జరిగాయి. జర్నలిస్టులపైనా అరెస్టులు జరిగాయి. అప్పుడు మాట్లాడని షర్మిల, ఇప్పుడెందుకు మాట్లాడుతోందని టీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది.?

జవాబు: అప్పుడు మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేయదు. ఆ పార్టీ మమ్మల్ని వేధించింది. విచారణ జరగాలన్నది మా పాయింట్. విచారణ చేయించలేదు. ఎవరో ఒకరి మీద నేను ఆరోపణ చేయను. మీకు నిజంగానే ఏ పాత్రా లేకుంటే, కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై ఎందుకు విచారణ చేయించలేదు.? ఇదే నా పాయింట్.

ప్రశ్న: పోగొట్టుకున్న వైఎస్సార్‌ని మీ రూపంలో తెలంగాణ సమాజం గుర్తిస్తుందా.?

జవాబు: అటు వైపు నుంచి ఇంత పెద్ద స్పందన రాకపోతే, ఇన్ని వందల వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం కష్టం. ప్రజల నుంచి ఆ ప్రేమ లభిస్తోంది కాబట్టే, రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇదంతా చేయగలుగుతోంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా షర్మిల, మీరందిస్తున్న ప్రేమకు శిరసు వంచి నమస్కరిస్తోంది.

ప్రశ్న: షర్మిల ఎనర్జీ సీక్రెట్ ఏంటి.? అదే చిరునవ్వు, అదే ఎనర్జీ.. సుదీర్ఘ పాదయాత్ర తెలంగాణలో లేడీ సూపర్ స్టార్ అవుతారనీ, తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారనీ ఎలా అనుకున్నారు.? మీ హెల్త్ సీక్రెట్ ఏంటి.? మీ డైట్ ఏంటి.?

జవాబు: ఆ సీక్రెట్ దేవుడే. దేవుడు నడిపిస్తున్నాడు, ప్రజలు నడిపిస్తున్నారు. అడుగులు మాత్రమే నావి.

ప్రశ్న: రాష్ట్రంలో త్రిముఖ పోరు కనిపిస్తోంది. అధికారంలోకి తామే వస్తామని బీజేపీ అంటోంది. టీఆర్ఎస్ కూడా గెలుపు తమదేనని చెబుతోంది. కాంగ్రెస్ కూడా తమదే అధికారమని అంటోంది. మునుగోడులో గెలిచేది తామేనని ముగ్గురూ చెబుతున్నారు.

జవాబు: ఇదే సినారియో 2018లో కూడా వుంది. కానీ, ప్రజలు కేసీయార్ వల్ల ఇబ్బంది పడుతూ వేరే ప్రత్యమ్నాయం లేక టీఆర్ఎస్ గెలిచింద. కేసీయార్ సీఎం అయ్యారు. మీరే నిజంగా ప్రత్యామ్నాయం అయితే ఎందుకు 2018లో కేసీయార్ గెలిచారు.? కాంగ్రెస్, బీజేపీ ఆ స్థాయిలో బలపడలేదు, వారికి ఆ చిత్తశుద్ధి కూడా లేదు. మీ వైఫల్యం వల్లనే కేసీయార్ పాలనని తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు. మీరు ప్రజలకు భరోసా ఇచ్చి వుంటే, ప్రజలే మీకు అధికారమిచ్చేవారు. ఈ మూడు పార్టీల వల్ల తెలంగాణకు ప్రయోజనమేంటి.? ఒక చోట ఎమ్మెల్యేతో డిఫెక్ట్ చేయించి, అక్కడ తమ బలాన్ని ఉపయోగించి గెలవడం అనేది బీజేపీ వ్యూహం. మీకు నిజంగా బలం వుంటే ఎందుకీ దొంగ స్ట్రేటజీలు. ఈటెల రాజేందర్ గెలిస్తే మీకు హైప్ వస్తోందా.? దీన్ని మేం కరెక్ట్ అనాలా.? లేని కంటెండర్‌ని చీఫ్ కంటెండర్‌గా చూపించడం కేసీయార్ వ్యూహమా.? కాంగ్రెస్‌ని పక్కన పెట్టి బీజేపీని టీఆర్ఎస్ ముందుకు తెస్తోంది. ఇదేం వ్యూహం.?

ప్రశ్న: మునుగోడు బై పోల్‌లో మీ స్టాండ్ ఏంటి.? అభ్యర్థిని పెడతామని ప్రకటించారు కదా.?

జవాబు: అభ్యర్థిని ప్రకటించామనేది వాస్తవం కాదు. మేం పెడితే మీరు ఏం చేస్తారు.? అన్నది ఒక సవాల్ మాత్రమే విసిరాము. మునుగోడు ఎలక్షన్ ఎందుకు వచ్చిందో గమనించాలి. అధికారం కావాలని ఓ పార్టీ, అధికారం నిలబెట్టుకోవాలని ఇంకో పార్టీ. అంతకు మించి మునుగోడు ఉప ఎన్నికని ఎలా డిస్క్రైబ్ చేస్తాం.? ఒక ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి బీజేపీ ఉప ఎన్నిక తెచ్చింది. వెంటనే ఆ రాజీనామాని ఆమోదింపజేసి, ఉప ఎన్నికకు సై అంటోంది టీఆర్ఎస్. ఈ రెండు పార్టీలూ వాళ్ళ అధికారమదంతో, వాళ్ళ మజిల్ పవర్‌తో గెలవాలనుకుంటున్న ఉప ఎన్నిక కాకపోతే, దీన్ని ఎలా చూడాలి.? మనుగోడు ఉప ఎన్నిక వచ్చింది ఇదొక డాగ్ ఫైట్ అవుతుంది. వీధిలో కుక్కల కొట్లాట.

ప్రశ్న: మనుగోడు ఖచ్చితంగా బీజేపీకే రాబోతోంది.. అలాగే ఇంకొన్ని చోట్ల కూడా బై పోల్ వస్తుందని బీజేపీ చెబుతోంది. అవే సెమీ ఫైనల్ అంటున్నారు.?

జవాబు: మీకు సిగ్గుండాలి కదా.? ఇదేం వ్యూహమిది.? ఐదేళ్ళకు ఎమ్మెల్యేని ప్రజలు గెలిపించుకుంటే, రాజీనామా చేయించి ఉప ఎన్నిక ఏంటి.? మీకు కావాలంటే క్యాడర్‌ని పెంచుకోండి. విభజన సమస్యలపై మీరేం చేశారు.? బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏమయ్యింది.? కోచ్ ఫ్యాక్టరీ ఏమయ్యింది.? మీకు దమ్ముంటే 2 కోట్ల ఉద్యోగాలన్నారు కదా, సంవత్సరానికి.. ఎనిమిదేళ్ళలో 16 కోట్ల ఉద్యోగాలు రావాలి కదా.? మా బిడ్డలకి 50 లక్షల ఉద్యోగాలైనా ఇచ్చారా.? ఇంటికో ఉద్యోగమని ఈయన అంటాడు.. రెండు కోట్ల ఉద్యోగాలని ఆయనంటాడు.. మీకు మీ హామీలను నిలబెట్టుకోవాలనే దమ్ము లేదు. మతం పేరు చెప్పి చిచ్చు పెట్టడం. ప్రజలు సంతోషంగా వుండకూడదు. ఆ మంటల్లో చలికాచుకోవాలి. ఒకడి చేత డిఫెక్ట్ చేయించి, ఎలక్షన్లు తెప్పించాలి.

ప్రశ్న: టీఆర్ఎస్‌కి వామపక్షాలు మద్దతిచ్చాయి.. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది.. బీజేపీ అభ్యర్థి వున్నారు.. షర్మిల మునుగోడులో ఏం చేయబోతున్నారు.?

జవాబు: మీ ప్రశ్న ఏదైనా, మీకు సమాధానం త్వరలోనే లభిస్తుంది. ఇక్కడ కమ్యూనిస్టులు ఎందుకు టీఆర్ఎస్‌కి సపోర్ట్ చేస్తున్నారు.? ఇదెక్కడి విచిత్రం. అసలు కమ్యూనిస్టు పార్టీల సిద్ధాంతమేంటి.? ఒక్క మాట కూడా నిలబెట్టుకోని కేసీయార్‌కి మద్దతివ్వడమేంటి.? ఇది ముమ్మాటికీ అమ్ముడుపోవడమే. కమ్యూనిస్టు పార్టీలు నిజంగానే అమ్ముడుకాకపోతే కేసీయార్‌తో ఎందుకు కలుస్తున్నారు.? ఈ ఒక్క విషయంలో కేసీయార్ మాట నిలబెట్టుకున్నాడని చెప్పే దమ్ముందా.? ఈ ఒక్కసారికే కేసీయార్‌కి సపోర్ట్ అంటారా.? సిగ్గుండాలి కదా.? ఒక్కసారికి అమ్ముడు పోయాం.. అలా అవసరమైనప్పుడల్లా అమ్ముడుపోతామని చెబుతారా.?

ప్రశ్న: ఈ కేసుల వ్యవహారం చూస్తున్నాం.. అరెస్టు చేస్తారా.? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రలో అరెస్టయ్యే అవకాశం ఏమైనా వుందా.? ఆ అనుమానం కలుగుతుందా.? పాదయాత్ర రద్దవుతుందా.? మీరేమంటారు.?

జవాబు: ఈ ట్రిక్కులు ఏవో ప్లే చేస్తారని అనుమానం మాకూ వచ్చింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇదంతా చేశారని నేను అనుకోవడంలేదు. ఏడాది నుంచీ గమనిస్తున్నాం. మేం ఎలా పెరుగుతున్నాం, మా గ్రాఫ్ ఎలా పెరుగుతోందనేది పరిశీలిస్తూనే వున్నారు. అత్యంత వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు కట్టడి చేయకపోతే, ఇకపై చేయలేం.. అని ఏదో ఒకటి చేసి పాదయాత్రను ఆపాలని వాళ్ళ మైండ్‌లో పడింది. ఆ అనుమానం నాకు బలంగా కలుగుతోంది.

ప్రశ్న: బీజేపీ, టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగాలు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ, కేఏ పాల్‌తో మిమ్మల్ని పోల్చుతున్నాయి. పెద్ద కుటుంబం నుంచి వచ్చిన షర్మిలను కేఏ పాల్‌తో పోల్చడం సబబు కాదని వైఎస్సార్టీపీ సోషల్ మీడియా టీమ్ వాదిస్తోంది. దీనిపైన మీ కామెంట్ ఏంటి.?

జవాబు: కామెంట్ చేసేవాడికి క్రెడిబులిటీ వుంటే కదా, నేను ఆ కామెంట్‌కి సమాధానం చెప్పేది.? వాళ్ళ ఇష్టమొచ్చింది చేసుకోమని చెప్పండి. ఇంతకంటే వంద రెట్లు చేసుకోమని చెప్పండి. నాకు ఏమీ ఫరక్ పడదు.!

ఇలా సాగింది వైఎస్ షర్మిలతో న్యూస్ క్యూబ్ ప్రతినిథి శ్రావణి ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ ఆసాంతం.. షర్మిలతో నడుస్తూనే చేయడం గమనార్హం. ఈ సుదీర్ఘ ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో రోడ్డుపై వెళుతున్న వాహనాల్లోంచి వైఎస్ షర్మిలను అభినందిస్తూ కొందరు, ఆమెకు దగ్గరగా వచ్చి ఫొటోలు దిగేందుకు ప్రయత్నించినవారు ఇంకొందరు. వెరసి, వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర అంచనాలకు మించి విజయవంతమయ్యిందని నిస్సందేహంగా చెప్పొచ్చు.