Vijayashanti: విజయశాంతీ.. పార్టీలు మారతావు తప్ప నువ్వు మారవా?.

Vijayashanti: విజయశాంతి గురించి పరిచయం అవసరంలేదు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మారిన మనిషి. పార్టీలు మారతారు తప్ప ఆమె మారరనే అభిప్రాయం జనాల్లో ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆమె ఈరోజు శుక్రవారం పెద్ద మాట అన్నారు. ఆయన పైన హత్యాయత్నం కేసు నమోదు చేసినా తప్పులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే అంబులెన్సులను తెలంగాణ సరిహద్దుల్లో ఆపుతున్నారనే వార్తలపై విజయశాంతి ఇలా ఘాటుగా స్పందించారు. కేసీఆర్ సర్కారు తీరుతో సరిహద్దుల వద్ద పలువురు పేషెంట్లు చనిపోయే పరిస్థితి తలెత్తుతోందని తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ సందర్భంలో రాములమ్మ కొన్ని ముఖ్య విషయాలను మర్చిపోయారు.

తెలంగాణ ఏం కావాలి?..

విజయశాంతి ప్రస్తుతం బీజేపీలో ఉన్నట్లున్నారు. అందుకే ఆమె జాతీయ కోణంలో ఆలోచిస్తున్నారనిపిస్తోంది. తెలంగాణ ప్రజలు ఏమైపోయినా పర్లేదు గానీ పక్క రాష్ట్రాల వాళ్లను మాత్రం బాగా పట్టించుకోవాలి అన్నట్లు నీతులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల రోగుల వల్ల తెలంగాణ పేషెంట్లకే చాలా మందికి బెడ్లు దొరకని పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. నాలుగైదు ఆస్పత్రులకు తిరుగుతున్నా పడకలు అందుబాటులో ఉండట్లేదు. 45 శాతం బెడ్లను వేరే రాష్ట్రాలవాళ్లకే ఇవ్వాల్సి వస్తోంది. పైగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాణవాయువు కోటా ఏరోజుది ఆరోజే అయిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీవాళ్లు వచ్చినా, ఎవరు వచ్చినా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం మౌఖిక ఆదేశాలతో బోర్డర్లలో అంబులెన్సులను ఆపుతోంది. ఈ విషయం విజయశాంతికి అర్థం కావట్లేదా?. ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నారా?.

జడ్జిలు సర్వజ్ఞులు కాదట..

సరిహద్దుల్లో అంబులెన్సులను ఆపే విషయమై సర్కారు నుంచి ఆదేశాలున్నాయా అని తెలంగాణ హైకోర్టు అడిగితే ఆఫీసర్లు సరైన సమాధానం ఇవ్వలేకపోయారని విజయశాంతి దెప్పిపొడిచారు. అయితే జడ్జిల గురించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి నిన్న గురువారం ఏమన్నారో ఆమె తెలుసుకుంటే మంచిదని విమర్శకులు సూచిస్తున్నారు. ‘‘జడ్జిలు సర్వజ్ఞులు కారు. వాళ్లు ఆదేశించిన వెంటనే అమలుచేయాలంటే కష్టం’’ అని సీటీ రవి ఏకంగా న్యాయమూర్తులకే కౌంటర్లు వేశారు. కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిదని కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న తేల్చిచెప్పింది. కాబట్టి ఈ లేడీ సూపర్ స్టార్ ఇది రీల్ లైఫ్ కాదని, రియల్ లైఫ్ అని మర్చిపోకుండా, వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.