Vakeel Saab Review: పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీ రివ్యూ .. స‌రైన న్యాయం చేసిన ప‌వ‌ర్‌ స్టార్

Vakeel Saab Review Rating
Vakeel Saab Review Rating
MovieVakeel Saab
Star CastPawanKalyan, Shruti Haasan, Nivetha Thomas, Anjali, Ananya Nagalla, Prakash Raj
DirectorVenu Sriram
ProducerBoney Kapoor, Dil Raju, Sireesh
MusicS. Thaman
Run Time2h 34m
Release9th April 2021

 

ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ సినిమా అంటే ప్రేక్ష‌కుల‌లో ఎన్ని ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అజ్ఞాత‌వాసి చిత్రం త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉన్న ప‌వ‌న్ మ‌ళ్లీ వ‌కీల్ సాబ్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్, ట్రైల‌ర్స్ భారీ అంచ‌నాలు పెంచ‌గా, మూవీ కోసం క‌ళ్లల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూశారు. ఈ రోజు చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కాగా, ఈ సినిమా అభిమానుల‌తో పాటు సినీ ప్రేక్ష‌కుల‌ని ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్ధాం..

కథ:

2016లో వ‌చ్చిన పింక్ రీమేక్‌గా వ‌కీల్ సాబ్ తెర‌కెక్క‌గా ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు అంజ‌లి, నివేదా థామ‌స్‌, అన‌న్య కీల‌క పాత్ర‌లు పోషించారు. ఎంపీ కొడుకు బ్యాచ్‌ను అనన్య‌, అంజ‌లి, నివేదాలు ఓ సంద‌ర్బంలో కొట్టి పారిపోతారు. దీనిపై ఎంపీ చాలా సీరియ‌స్ అవుతూ, త‌న ప‌లుకు బ‌డిని ఉప‌యోగించి నివేదాను జైల్లో పెట్టిస్తాడు. అయితే ఈ అమ్మాయిల‌కి అండ‌గా కె. స‌త్య‌దేవ్‌( ప‌వ‌న్ క‌ళ్యాణ్ ) ఉంటాడు. ఈ విష‌యం తెలుసుకున్న ఎంపీ స‌త్య‌దేవ్‌కు వార్నింగ్ ఇవ్వాల‌నుకుంటారు. దీంతో స‌త్య‌దేవ్ ఈ కేసుని టేక‌ప్ చేసి ముగ్గురు అమ్మాయిలకి న్యాయం జ‌రిగేలా పోరాడుతుంటాడు. అయితే కోర్టులో స‌త్య‌దేవ్‌(ప‌వ‌న్ క‌ళ్యాణ్‌)కు డిఫెన్స్ లాయ‌ర్‌గా నంద‌( ప్ర‌కాశ్ రాజ్‌) ఉంటారు. డిఫెన్స్ లాయ‌ర్‌ని ఓడించి స‌త్య‌దేవ్ కేసు ఎలా గెలిచాడు? స‌త్య‌దేవ్ ఆ ముగ్గురు మ‌హిళ‌ల కోసం ఎందుకు స్టాండ్ తీసుకున్నాడు? స‌త్య‌దేవ్ న్యాయ‌వాద వృత్తిని వ‌దిలి వేయ‌డానికి కార‌ణాలేంటి? అన్న‌దే క‌థ‌.

న‌టీన‌టుల ప‌ర్‌ఫర్మెన్స్ :

ప‌వ‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు సంవత్స‌రాల త‌ర్వాత రీఎంట్రీ ఇచ్చినప్ప‌టికీ త‌న‌దైన శైలిలో హావ‌భావాలు ప‌లికించారు. న్యాయ‌వాదిగా అద‌ర‌గొట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న చేసిన సినిమాలు ఓ ఎత్తైతే, వ‌కీల్ సాబ్‌లో ప‌వ‌న్ ప‌ర్‌ఫార్మెన్స్ వేరే లెవ‌ల్‌. ఎమోషనల్ సీన్స్, కాలేజ్ ఎపిసోడ్స్, కోర్టులో సీరియస్ గా ఉంటూనే హృద్యంగా వేసిన సెటైర్స్ ప్రేక్ష‌కుల‌కి వినోదాన్ని పంచాయి. కీక‌ల పాత్ర‌లు పోషించిన అంజ‌లి, నివేదా థామ‌స్, అన‌న్య‌లు పాత్ర‌లో ఒదిగిపోయారు. ఇక పవ‌ప్‌కు పోటీగా ప్ర‌కాశ్ రాజ్ అద్భుతంగా న‌టించారు. శృతి హాస‌న్ కూడా మంచి వినోదం అందించింది.

సాంకేతిక నిపుణుల ప‌ర్‌ఫార్మెన్స్:

అద్భుత‌మైన మ్యూజిక్‌తో టాలీవుడ్ ఇండ‌స్ట్రీని షేక్ చేస్తున్న థ‌మ‌న్ .. వకీల్ సాబ్ కోసం అద్భుత‌మైన బాణీలు స‌మ‌కూర్చాడు. సాంగ్స్ కోసం మంచి బాణీలు ఇచ్చిన థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద‌ర‌గొట్టాడు. సెకండాఫ్ కోర్ట్ సీన్స్ స‌మ‌యంలో థ‌మ‌న్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్ష‌కుల‌ని ఎక్క‌డికో తీసుకెళ్లింది. వినోద్ విజువల్స్ కూడా అదిరిపోయాయి. మూడు డిఫరెంట్ లుక్స్ లో పవన్ కళ్యాణ్ ని సూపర్బ్ గా చూపించి అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా చేశాడు. ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది.

పెద్ద‌గా ప‌రిచ‌యం లేని ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్.. పింక్ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా అద్భుతంగా తీర్చిదిద్ధాడు. ఒరిజిన‌ల్ క‌థ‌ను ఏ మాత్రం డ్యామేజ్ చేయ‌కుండా బాగా చూపించాడు. క‌థ‌, క‌థ‌నం విష‌యంలో ఆయ‌న ప‌నితీరు చాలా బాగుంది. క‌థ‌ను ప‌క్క దారి మ‌ళ్లించకుండానే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లోని హీరోయిజాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ అద‌ర‌గొట్టాడు. దిల్ రాజు – బోణి కపూర్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్

– పవన్ కళ్యాణ్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్
– ఆస‌క్తిని క‌లిగించే సెకండాఫ్‌
– థ‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
– ఎమోషనల్ కనెక్షన్ , కోర్ట్ రూం స‌న్నివేశాలు
– క్లైమాక్స్

మైన‌స్ పాయింట్స్ :

– ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉండ‌డం
– ప‌లు రెగ్యులర్ సీన్స్

తీర్పు:

మూడేళ్ళ నుండి ప‌వ‌న్ సినిమా కోసం ఆవురావుర‌మంటూ ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు వ‌కీల్ సాబ్ చిత్రం ప‌సందైన విందు భోజ‌నం అందించింది. న‌టుడిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌డంతో ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. క్లాస్ , మాస్ అనే తేడా లేకుండా అంద‌రు ఆడియ‌న్స్ ఈ సినిమాకు క‌నెక్ట్ అవుతున్నారు. ఓ వైపు సీరియ‌స్‌గా ఉంటూనే మ‌రోవైపు సెటైరిక‌ల్స్ డైలాగ్స్‌తో న‌వ్వు తెప్పించి మెప్పించాడు ప‌వ‌న్. ఒరిజిన‌ల్ క‌న్నా వ‌కీల్ సాబ్ చిత్రం అద్భుతంగా ఉంద‌నే భావ‌న అభిమానుల‌లో ఉంది. ఈ ఏడాది ప్రేక్ష‌కుల‌ని అల‌రించే చిత్రాల‌లో వ‌కీల్ సాబ్ చిత్రం ప‌క్కాగా చేరుతుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

న్యూస్ క్యూబ్ రేటింగ్ : 3.25/5

Advertisement