పార్టీ అధిపతీ.. ఛలో తిరుపతి..

Kondala Rao - January 15, 2021 / 03:38 PM IST

పార్టీ అధిపతీ.. ఛలో తిరుపతి..

మొన్న బుధవారం మొదలైన మూడు రోజుల సంక్రాంతి పండుగ సంబరాలు ఇవాళ శుక్రవారం కనుమతో పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలోని పొలిటికల్ పార్టీల అధినేతలు గడచిన వారం పది రోజుల నుంచి కాస్త రిలాక్స్ డ్ మోడ్ లో కుటుంబాలతో కలిసి గడిపేందుకు తగిన సమయం కేటాయించారు. ఇక, రేపటితో ఈ పొంగల్ ఫెస్టివల్ మూడ్ కి తెర దించి.. ఎల్లుండి నుంచి బై ఎలక్షన్ ఫెస్టివల్ మూడ్ లోకి మారిపోనున్నారు.

ముందుగా టీడీపీ..

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రాజకీయం తప్ప మరొకటి తెలియని వ్యక్తిగా ఎప్పుడూ ప్రజలతో మీటింగులు, పార్టీ లీడర్లతో టెలీ, వీడియో కాన్ఫరెన్సులు పెడుతూ బిజీబిజీగా ఉంటుంటారు. అదే లైఫ్ స్టయిల్ ని కొనసాగిస్తూ ఆయన ఎల్లుండు ఆదివారం తిరుపతిలో ఉప ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుడతారని అంటున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. సంక్రాంతి అనంతరం పార్టీ నాయకులందరూ పబ్లిక్ లోనే ఉండాలని బాబు ఆదేశించినట్లు సమాచారం.

పది రోజుల పాటు..

ఈ నెల 17న అంటే ఆదివారం తిరుపతిలో టీడీపీ ఆఫీసును ప్రారంభించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే బై ఎలక్షన్ కి పార్టీ క్యాండిడేట్(కేంద్ర మాజీ మంత్రి)ని ప్రకటించిన ఈ ప్రతిపక్ష పార్టీ.. 18వ తేదీ నుంచి పది రోజుల పాటు పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో విరివిగా పర్యటించాలని ప్రణాళిక సిద్ధం చేసిందట. బై ఎలక్షన్ నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా జనంలోకి వెళ్లి జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక చర్యలను ఎండగట్టాలని చూస్తున్నారు.

రెండు, మూడు సభలు..

వైఎస్సార్సీపీ పాలనలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడుల గురించి టీడీపీ నేతలు ప్రజలకు వివరించనున్నారు. ఈ మేరకు తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ లో రెండు, మూడు బహిరంగ సభలకు ప్లాన్ వేశారు. కాకపోతే ఇవి ఎన్నికల ప్రకటన వచ్చాక కార్యరూపం దాల్చుతాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యతను చంద్రబాబు ఏకంగా 70 మంది సీనియర్ నేతల భుజాల మీద పెట్టిన విషయం విధితమే.

21న పవన్ కళ్యాణ్..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 21న తిరుపతిలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ శుక్రవారం అఫిషియల్ గా ప్రకటించింది. ఆ రోజు సాయంత్రం నగరంలో ఏర్పాటుచేసిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశంలో పవర్ స్టార్ పాల్గొంటారు. ఈ భేటీలో ఆయనతోపాటు పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాలుపంచుకుంటారు. ప్రధానంగా ఉప ఎన్నికలపైనే చర్చించనున్నారు. టీడీపీ, జనసేన రంగంలోకి దిగుతుండటంతో ఇక బీజేపీ, అధికార పార్టీ వైఎస్సార్సీపీ కూడా తమ కార్యకలాపాలను ముమ్మరం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా పొలిటికల్ పార్టీల అధినేతలందరూ రానున్న రోజుల్లో ‘ఛలో తిరుపతి’ బాట పట్టేట్లు ఉన్నారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us