Telangana: గరంగరం.. తెలంగాణ రాజకీయం..

Telangana: తెలంగాణ రాజకీయం గరంగరంగా సాగుతోంది. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్, టీఆర్ఎస్ వర్సెస్ ఈటల అన్నట్లు నడుస్తోంది. ‘రైతు గోస – బీజేపీ పోరు దీక్ష’ పేరుతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఇవాళ సోమవారం ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. పాడిందే పాడరా పాచిపళ్ల దాసుడా అనే సామెత మాదిరిగా అతను మళ్లీ కేసీఆర్ పై విమర్శలు చేశాడు. చెప్పింది చేయని, ఏమీ చేయని ఏకైక సీఎం అంటూ ఎద్దేవా చేశాడు. అయితే.. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీలో నెలల తరబడి దీక్షలు చేస్తున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పట్టించుకోవట్లేదు. తెలంగాణలో ఆ పార్టీని నడిపిస్తున్న బండి సంజయ్ మాత్రం అదే కర్షకుల వంకతో కారు పార్టీ సర్కారుపై కస్సుబస్సులాడుతున్నాడు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బండి తానా అంటే తందానా అనటానికి ఎప్పుడూ రెడీగా ఉండే సీనియర్ మహిళా నాయకురాలు విజయశాంతి కూడా ఇదే అదునుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

Telangana Politics

ధీటుగా స్పందించిన రూలింగ్ పార్టీ..

బండి సంజయ్ విమర్శలను అధికార పార్టీ టీఆర్ఎస్ ధీటుగా తిప్పికొట్టింది. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ-రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి కమలం పార్టీకి కర్రు కాచి వాత పెట్టారు. బండి సంజయ్ ఒక జోకర్ లా మాట్లాడుతున్నాడని, వ్యవసాయం తెలియని వ్యక్తి అని పల్లా చురకలంటించారు. సాగుకి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. రైతులు పండించిన పంటలను తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా కొనుగోలు చేయట్లేదని గర్వంగా చెప్పారు.

Telangana Politics

ఒళ్లెలా ఉంది బిడ్డా?..

బండి సంజయ్ పై అధికార పార్టీ శాసన సభ్యుడు బాల్క సుమన్ ఫైర్ అయ్యాడు. వ్యవస్థలపై అవగాహన లేనోడని తప్పుపట్టాడు. ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించాడు. నోటికొచ్చినట్లు వాగబట్టే ఇటీవలి ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రాలేదని, ముందు ఆ విషయాన్ని గ్రహించాలని హితవు పలికాడు. దేశంలోనే అత్యధికంగా 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నామని చెప్పాడు.

Telangana Politics

అదీ తెలంగాణలో అంతర్భాగమే..

ఇదిలాఉండగా మరో వైపు టీఆర్ఎస్, ఈటల వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఒక భాగమేనని, అది నిషేధిత ప్రాంతం కాదని మంత్రి గంగుల కమలాకర్ తేల్చిచెప్పారు. రాజు పోతే రాజరికం ఆగదంటూ పరోక్షంగా ఈటల రాజేందర్ ని ఉద్దేశించి సెటైర్లు వేశారు. తమపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ పిచ్చి సంతోషం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.