Dravid : ద్ర‌విడ్ బృందంలో తెలంగాణ క్రికెట‌ర్‌.. ఫీల్డింగ్ కోచ్‌గా ప‌దవి..!

Dravid : ర‌విశాస్త్రితో పాటు మిగ‌తా సిబ్బంది ప‌ద‌వీ కాలం పూర్తి కావ‌డంతో కొత్త ప‌దవుల‌లో ఎవ‌రెవ‌రు ఉంటార‌నే దానిపై బీసీసీఐ తుది ప్ర‌క‌ట‌న చేసింది. న్యూజీలాండ్‌తో జరుగనున్న సిరీస్ నుంచి ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా పని ప్రారంభించనున్నాడు. పాత వారిలో కేవలం బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాత్రమే తిరిగి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ దరఖాస్తును పరిశీలించిన అనంతరం క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) రాథోడ్‌కు మారోసారి అవకాశం కల్పించింది.

Rahul Dravid coach
Rahul Draviid coach

ఇక బౌలింగ్ కోచ్‌గా పరాస్ మంబ్రేను ఎంపిక చేశారు. రాహుల్ ద్రవిడ్‌తో కలసి నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్ఏసీ)లో పని చేయడమే కాకుండా.. అతడికి మంచి అనుభవం ఉండటంతో సీఏసీ పచ్చ జండా ఊపింది. ఇక ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్. శ్రీదర్ స్థానంలో దిలీప్ బాధ్యతలు చేపట్టనున్నాడు. తెలంగాణకు చెందిన టి. దిలీప్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా సుదీర్ఘ అనుభవం ఉన్నది.

Rahul Dravid coach
Rahul Dravid coach

14 ఏళ్ల తన కోచింగ్ కెరీర్‌లో ఇండియా అండర్ – 19, ఫస్ట్ క్లాస్ జట్లకు కోచ్‌గా పని చేశాడు. ఇటీవల భారత జట్టు శ్రీలంకలో పర్యటించిన సమయంలో తాత్కాలిక ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. దిలీప్ తన క్రికెట్ కెరీర్‌లో హెచ్‌సీఏ ఏ-డివిజన్ లీగ్స్‌లో కాంటినెంటల్ క్రికెట్ క్లబ్ తరపున పలు మ్యాచ్‌లు ఆడాడు. క్రికెట్ కెరీర్ అనంతరం బీసీసీఐ లెవెల్-3 శిక్షణను పూర్తి చేసుకున్న దిలీప్ ఆ తర్వాత పూర్తి స్థాయి కోచ్‌గా మారాడు

ప్రస్తుతం భారత జట్టులో ఉన్న పలువురు యువకులకు ఫీల్డింగ్ మెలకువలు నేర్పిన అనుభవం దిలీప్‌కు ఉన్నది. బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాథోడ్‌నే కొనసాగించాలని నిర్ణయించిన భారత క్రికెట్‌ బోర్డు.. బౌలింగ్‌ కోచ్‌గా ద్రవిడ్‌ సన్నిహితుడు, టీమిండియా మాజీ బౌలర్‌ పరాస్‌ మాంబ్రేను, ఫీల్డింగ్‌ కోచ్‌గా టి దిలీప్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ ఈ ముగ్గురు పేర్లు ఖరారైతే.. వీరంతా ద్రవిడ్‌ కోచింగ్‌ టీంలో సహాయక సిబ్బందిగా పని చేస్తారు. ఈ నియామకాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌ స్థానాలతో పాటు నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్‌సీఏ)లో స్పోర్ట్స్‌ సైన్స్‌, మెడిసిన్ హెడ్ ప‌ద‌వుల‌కు బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

telangana cricketer as fielding coach in Dravid team
telangana cricketer as fielding coach in Dravid team

హైదరాబాద్‌కు చెందిన టి. దిలీప్ భారత జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపికైనట్లు హెచ్‌సీఏ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. తెలుగు వాడికి జాతీయ స్థాయిలో మంచి బాధ్యతలు దక్కడంపై హెచ్‌సీఏ అభినందించింది. హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్ కూడా దిలీప్ నియామకంపై హర్షం వ్యక్తం చేశారు.