Telangana BJP : తెలుగువారికి గర్వకారణమైన తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పేరుని అధికార పార్టీ టీఆరెస్ రాజకీయంగా వాడుకుంటుండటాన్ని రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నట్లు అనిపిస్తోంది. పీవీ ఐదుగురి కుమార్తెల్లో ఒకరైన సురభి వాణీదేవికి సీఎం కేసీఆర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వటాన్ని ఆయా పార్టీలు తప్పుపడుతున్నాయి. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ కాస్త అతి తెలివిని, అతి విశ్వాసాన్ని ప్రదర్శించింది. గులాబీ అధిపతి వేసిన ఎత్తుని చిత్తు చేయటానికి ప్రయత్నించింది. పీవీ మరో కుమార్తె కొడుకు ఎన్వీ సుభాష్ ని ఈరోజు తెర మీదికి తెచ్చింది. ఆయన చేత ముఖ్యమంత్రిపైన ఘాటు విమర్శలు చేయించింది. ఎన్వీ సుభాష్ కమలం పార్టీ నాయకుడు. గతంలో రాష్ట్ర బీజేపీకి అధికార ప్రతినిధి కూడా.
ఏమన్నారు?..
ఎన్వీ సుభాస్ సోమవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తన తాత, మహామనిషి పీవీ నరసింహారావు పేరు చెప్పి తమ కుటుంబాన్ని మోసం చేశారని మండిపడ్డారు. తన చిన్నమ్మ వాణీదేవికి టీఆరెస్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వటాన్ని పరోక్షంగా ప్రస్తావించిన ఆయన ఇది బ్రాహ్మణ సమాజం ఓట్లను చీల్చేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓడిపోయే స్థానంలో అవకాశం ఇవ్వటాన్నిబట్టే కేసీఆర్ కుతంత్రమేంటో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. వాణీదేవిని టీఆరెస్ హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సెగ్మెంట్ లో బీజేపీ తరఫున బరిలో నిలుచున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ పీవీ కుమార్తెను బలిపశువును చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇంత ధీమానా?: Telangana BJP
ఈ స్థానంలో తనపై సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ పోటీ చేసినా ఓడిపోవటం ఖాయమని రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. పీవీ కూతురిని రాజ్యసభకు నామినేట్ చేయొచ్చు కదా అని ఉచిత సలహా ఇచ్చారు. కేవలం పరాజయం పాల్జేయటం కోసమే, తద్వారా నలుగురిలో చులకన చేయటం కోసమే కేసీఆర్ పీవీ కుటుంబాన్ని రోడ్డు మీదికి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా రామచంద్రరావు చేసిన విమర్శలు ఓకే గానీ కేసీఆర్, కేటీఆర్ సైతం తనని ఓడించలేరనటం మాత్రం కాస్త ‘‘అతి’’ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు. కేసీఆర్.. పార్టీ ప్రయోజనాల కోసమే పీవీ ఫ్యామిలీని బజారుకి ఈడుస్తున్నారనటం కూడా కరెక్ట్ కాదని అంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని మర్చిపోకూడదని పరిశీలకులు పేర్కొంటున్నారు.

పొన్నం కామెంట్స్
రాజకీయ ప్రయోజనాల కోసమే అధికార పార్టీ పీవీ కుమార్తెను తెర మీదికి తీసుకొచ్చిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై గౌరవం ఉంటే మిగతా అభ్యర్థులు తమ నామినేషన్లను వాలంటరీగా విత్ డ్రా చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసరటం అర్థం పర్థం లేని చర్య అని పొన్నం అన్నారు. పీవీ నరసింహారావుపై టీఆరెస్ పార్టీకి నిజంగా అభిమానం ఉంటే ఆయన కూతురు వాణీదేవిని రాజ్యసభ్యకు గానీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గానీ పంపాలని డిమాండ్ చేశారు.