Telangana Assembly : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ భవనంలో ఈ రోజు(మంగళవారం) మధ్యాహ్నం స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. పాత శాసన సభ బిల్డింగ్ లో తూర్పు వైపున ఉన్న పైకప్పు ఎలివేషన్ లో కొంత భాగం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అసెంబ్లీ ఆవరణలో భారీ శబ్ధం వచ్చింది. ఈ ఘటన శాసన సభ సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు ముచ్చెమటలు పట్టించింది. ఏం జరిగిందో తెలియని తీవ్ర ఆందోళనతో వాళ్లు పరుగులు తీశారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆఫీసు భవనం పైకప్పు గోపురం, పిట్టగోడ అంచులు కూలిపోగా ఆ శిథిలాలు గార్డెన్ ఏరియాలో పడ్డాయి. వేరే చోట పడి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని అంటున్నారు. లక్కీగా అలా జరక్కపోవటంతో అంతా హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు.
సెంచరీ హిస్టరీ..
తెలంగాణ శాసన సభ భవనానికి గొప్ప నేపథ్యం, వందేళ్లకు పైబడిన చరిత్ర ఉంది. 6వ నిజాం మహబూబ్ అలీఖాన్ పరిపాలనలో ఈ బిల్డింగ్ కట్టారు. దీనికి ప్రభుత్వ సొమ్ము కాకుండా ప్రజల చందాలను వినియోగించటం విశేషం. 1905లో కన్ స్ట్రక్షన్ మొదలు పెట్టగా ఎనిమిదేళ్ల అనంతరం అంటే 1913లో పూర్తయింది. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రారంభించారు. అప్పట్లో దీన్ని ‘‘మహబూబియా టౌన్ హాల్’’ అనేవారు. తదనంతర కాలంలో అసెంబ్లీగా మారింది. ఈ బిల్డింగ్ లైఫ్ టైమ్ అయిపోతోందనే విషయాన్ని ఇవాళ జరిగిన చిన్న ప్రమాదం మరోసారి రుజువు చేస్తోందని చెబుతున్నారు. ఈ భవనానికి గతంలో పలుమార్లు రిపేర్లు చేసినా ఇలా జరగటం చర్చనీయాంశమవుతోంది. మెయింటనెన్స్ లోపాన్ని పట్టి చూపింది.

కొత్తవి ఎప్పుడో?: Telangana Assembly
తెలంగాణ అసెంబ్లీ భవనం పాతబడటంతో కొత్త శాసన సభ బిల్డింగ్ నిర్మించాలని కేసీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే నిర్ణయించారు. ఈ మేరకు ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బీ శాఖ ఆధీనంలోని భూమిలో నిర్మానం మొదలుపెట్టారు. దీనికి 2020లో భూమి పూజ పూర్తి చేశారు. స్వయంగా కేసీఆరే శంకుస్థాపన నిర్వహించారు. ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అసెంబ్లీతోపాటు తెలంగాణ సచివాలయానికి కూడా కొత్త బిల్డింగ్ కడుతున్న సంగతి తెలిసిందే. పాత సెక్రటేరియట్ ని కూల్చేసి అదే ప్లేసులో నూతన భవనం నిర్మిస్తున్నారు. మరో ఏడాది కాలంలో ఇవి రెండూ అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు.