Ravi Shastri :2021 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత టీమిండియా కోచ్ ప‌దవికి గుడ్ బై చెప్ప‌నున్న ర‌విశాస్త్రి

Samsthi 2210 - August 16, 2021 / 04:33 PM IST

Ravi Shastri :2021 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత టీమిండియా కోచ్ ప‌దవికి గుడ్ బై చెప్ప‌నున్న ర‌విశాస్త్రి

Ravi Shastri: మాజీ భార‌త‌ ఆట‌గాడు, ప్ర‌స్తుతం టీమిండియా హెడ్ కోచ్ ర‌విశాస్త్రి భార‌త విజ‌యాల‌లో ముఖ్య భూమిక పోషిస్తున్న విష‌యం తెలిసిందే. భారత జట్టు విజయాల్లో హెడ్ కోచ్ రవిశాస్త్రికి దక్కుతున్న క్రెడిట్ తక్కువే ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న కృషిని గుర్తించిన బీసీసీఐ డ‌బ్బులు బాగానే ముట్ట‌జెబుతుంద‌ట‌.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన క్రికెట్ బోర్డుగా గుర్తింపు పొందిన భారత క్రికెట్ బోర్డు, హెడ్ కోచ్ రవిశాస్త్రికి ఏటా రూ.8 కోట్ల 20 లక్షల పారితోషికంగా అందిస్తోందని టాక్. టాప్ 2లో ఆసీస్ కోచ్ కంటే ఇది దాదాపు రెట్టింపు మొత్తం. ప్రపంచంలో అత్యధిక వేతనాన్ని అందుకున్న క్రికెట్ కోచ్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రవిశాస్త్రి. కొన్నాళ్లుగా భార‌త జ‌ట్టుకి త‌న సేవ‌ల‌ని అందిస్తున్న ర‌విశాస్త్రి త్వ‌ర‌లో రిటైర్‌మెంట్ తీసుకోనున్న‌ట్టు ఊహ‌గానాలు వినిపిస్తున్నాయి.

2021 టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత ర‌విశాస్త్రి హెడ్ కోచ్ ప‌దవికి రాజీనామా చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని సాగనంపే దిశగా బీసీసీఐ పావులు కదుపుతుండ‌డంతో ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్టు తెలుస్తుంది. ర‌విశాస్త్రి స్థానంలో హెడ్ కోచ్ బాధ్యతలను రాహుల్ ద్రవిడ్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ర‌విశాస్త్రి కోచ్‌గా ప‌నిచేస్తున్న‌ప్ప‌టి నుంచి భార‌త్ అనేక విదేశీ సిరీస్‌లలో విజ‌యం సాధించింది. ఎంతో పురోగ‌మించింది.

రవిశాస్త్రి ప‌ద‌వీ కాలం కూడా ముగియ‌నుండ‌డంతో ఇక‌పై శాస్త్రికి కాకుండా కోచ్ ప‌ద‌విని ద్రవిడ్‌కు అప్ప‌గించాల‌ని బీసీసీఐ ఆలోచిస్తున్న‌ట్లు సమాచారం. ద్రవిడ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో భార‌త అండ‌ర్ 19 క్రికెట్ జ‌ట్లు వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌లో స‌త్తా చాటాయి. 2016 జ‌రిగిన అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త జ‌ట్టు ర‌న్న‌రప్‌గా నిల‌వ‌గా, 2018లో ఏకంగా విజేత‌గా నిలిచింది. దీంతో ద్రవిడ్ 2019 జూలై 8 నుంచి బెంగ‌ళూరులోని ఎన్‌సీఏకు హెడ్‌గా కొన‌సాగుతున్నాడు.

ఇటీవల శ్రీలంక వెళ్లిన టీమిండియా జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ స‌మ‌యంలోను టీమిండియా యువ జ‌ట్టు మంచి ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చింది. ఈ క్ర‌మంలోనే బీసీసీఐ ర‌విశాస్త్రికి బ‌దులు రాహుల్ ద్ర‌విడ్‌ని తీసుకోవాల‌ని ఆలోచిస్తుంద‌ట‌.

2017 నుంచి రవిశాస్త్రి భారత జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. రవిశాస్త్రికి కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతు బలంగా ఉంది. 2007లో భారత జట్టు మేనేజర్‌గా రవిశాస్త్రి నియమితులయ్యాడు. ఆ తర్వాత 2014 నుంచి 2017 వరకు టీమ్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. 2017 నుంచి ఇప్పటి వరకు హెడ్ కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. 1981 – 92 మధ్య టీమిండియాకు రవిశాస్త్రి ఆడాడు. 80 టెస్టుల్లో 3830 పరుగులు చేసి, 151 వికెట్లు తీశాడు. 150 వన్డేల్లో 3108 పరుగులు చేసి, 129 వికెట్లు పడగొట్టాడు.

Read Today's Latest Exclusive in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us