PM Modi: ప్రధాని మోడీజీ.. ఏంటిది?.. భారత్ బయోటెక్ ఇప్పుడిలా అంటోంది?..

PM Modi: నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టాక ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ ని ఏర్పాటు చేశారు. ఆ నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ వారం పది రోజుల కిందట మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ (కోవాగ్జిన్) తయారీ టెక్నాలజీని ఇతర ప్రైవేట్ సంస్థలతో పంచుకునేందుకు భారత్ బయోటెక్ సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే ఆ కంపెనీలో ఉన్న అత్యాధునిక పరిశోధన వసతులు అన్ని చోట్లా లేవని, అందుకే ఆ సాంకేతికతని బదిలీ చేయకపోతున్నామని స్పష్టం చేశారు. ఐసీఎంఆర్, ఎన్ఐవీ వంటి సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ సంస్థలతో కలిసి డెవలప్ చేసిన ఆ టెక్నాలజీని ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకి కూడా ఇస్తే కొవాగ్జిన్ టీకాల ఉత్పత్తి తక్కువ సమయంలోనే ఎక్కువ జరుగుతుందని, తద్వారా కొరత అనేదే తలెత్తదని, ఎంతో మంది ప్రాణాలు నిలబడతాయని సూచిస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ తోపాటు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తదితరులు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఆ లెటర్లకి జవాబుగా అన్నట్లు వీకే పాల్ పైన చెప్పిన విధంగా వివరణ ఇచ్చారు.

కథ అడ్డం తిరిగింది..

కొవాగ్జిన్ క్రెడిట్ మొత్తం మాదే అని, ఐసీఎంఆర్, ఎన్ఐవీల నుంచి టీకా తయారీకి సంబంధించిన పరిజ్ఞానమేదే తీసుకోలేదని భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా తేల్చిచెప్పినట్లు ఓ ఇంగ్లిష్ న్యూస్ పేపర్ లో స్టోరీ వచ్చింది. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్ తయారీ సాంకేతికతని ఇతర కంపెనీలకు బదిలీ చేసే ప్రసక్తే లేదని ఆమె కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పారు. కరోనా స్ట్రెయిన్ ని ఇవ్వటానికి మాత్రమే ఐసీఎంఆర్, ఎన్ఐవీ పరిమితమయ్యాయని, పెద్ద జంతువులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించటానికి ప్రైవేట్ సంస్థలకు స్వేచ్ఛ లేకపోవటం వల్లే ఆ ప్రభుత్వ పరిశోధన సంస్థలతో చేతులు కలిపామని సుచిత్ర ఎల్ల వెల్లడించారు. వైరస్ టెస్టింగుల నుంచి మనుషులపై ప్రయోగాల దాకా అంతా మా శ్రమ ఫలితమే ఇది (కొవాగ్జిన్) అని వివరించారు.

హతవిధీ..

నీతి ఆయోగ్ సభ్యుడు చెప్పినదానికి, భారత్ బయోటెక్ జేఎండీ వాదనకి మధ్య పొంతనే లేదు. దీన్నిబట్టి కొవిడ్-19 వ్యాక్సిన్ విషయలో కేంద్ర ప్రభుత్వానికి సరైన ప్లానింగ్, క్లారిటీ, కంట్రోల్ వంటివేవీ లేవని అర్థమవుతోంది. హైదరాబాద్ లోని ఇదే భారత్ బయోటెక్ కంపెనీని సాక్షాత్తూ సందర్శించి, అక్కడి పరిశోధనలని పరిశీలించి, ఆ సంస్థ యజమానులను, సైంటిస్టులను అభినందించి, ప్రోత్సహించిన ప్రధాని ఇప్పుడేమంటారో చూడాలి. మోడీ నిజంగా అక్కడ జరుగుతున్న రీసెర్చ్ ని చూసి ఎంకరేజ్ చేయటానికి వచ్చారా? లేక అప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన పార్టీ బీజేపీ తరఫున పరోక్ష ప్రచారం కోసం వచ్చారా అనే చిన్న డౌటు ఇప్పటికీ జనాల్లో ఉండిపోయింది.