KTR vs EATALA : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం సరికొత్త చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ ‘కేటీఆర్ సీఎం’ అనే ప్రచారం జరగ్గా అదిప్పుడు ‘ఈటల సీఎం’ అనే దిశగా మలుపు తిరుగుతోంది. అధికార పార్టీవాళ్లు ఈ డిమాండ్ చేయకపోయినా ప్రతిపక్ష పార్టీ (కాంగ్రెస్) నేతలు దీన్ని తెర మీదికి తెస్తున్నారు. ముఖ్యమంత్రిగా కేటీఆర్ కన్నా ఈటలే రాజేందరే బెటర్ అని బల్లగుద్ది చెబుతున్నారు. తాము కోరుకునేది జరగదని వాళ్లకు తెలిసినా టీఆరెస్ ని ఇరకాటంలో పడేయాలనే ఎత్తు, కేటీఆర్ కి చెక్ పెట్టాలనే పైఎత్తుతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు.
అసలెందుకు?..
‘ఈటల సీఎం’ అనే చర్చను స్వయంగా ఈటల రాజేందరే పరోక్షంగా మొదలు పెట్టారని చెప్పొచ్చు. 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆరెస్ రెండోసారి గెలిచాక ఈటలకు వెంటనే (మొదటి విడతలో) మంత్రి పదవి రాలేదు. తొలి విడతలో 2018 డిసెంబర్ 13న ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోం మంత్రిగా మహమూద్ అలీ (ఇద్దరు మాత్రమే) ప్రమాణం చేశారు. 2 నెలల నిరీక్షణ తర్వాత 2019 ఫిబ్రవరి 19న ఈటలకు కేబినెట్ లో చోటు దక్కింది. రెండోసారి మినిస్టర్ అయిన 6 నెలలకు ‘‘గులాబీ జెండాకు మేమూ ఓనర్లమే’’ అని ఈటల అనటం సంచలనం రేపింది. అతణ్ని కూడా ముఖ్యమంత్రి రేసులోకి తెచ్చింది.
మరోసారి: KTR vs EATALA
ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల కరోనా వంటి విపత్కర పరిస్థితుల్ని విజయవంతంగా డీల్ చేసి సత్తా చాటుకున్నారు. టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును కేటీఆర్ కి ఇచ్చినా ఏమీ అనలేదు. కానీ, ఈమధ్య మళ్లీ ఎందుకో లోతైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అందరూ ‘కేటీఆర్ సీఎం’ అంటున్నందుకు నొచ్చుకున్నారో ఏమో తెలియదు గానీ లేటెస్టుగా ఈటల చేసిన కామెంట్లు కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తున్నాయి. నేను మంత్రిగా ఉండొచ్చు.. ఉండకపోవచ్చు.. పార్టీలు, జెండాలు ఉండొచ్చు.. ఉండకపోవచ్చు.. ప్రజలు మాత్రం ఉంటారు.. వాళ్ల తరఫున నేనుంటాను అని ఆయన తాజాగా అనటం జనంలో ఆసక్తిని, టీఆరెస్ లో ఆందోళనను కలిగిస్తోంది.

చెరొకరు..
‘కేటీఆర్ సీఎం’ అన్నప్పుడల్లా అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ చెరో వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నాయి. కమలం పార్టీ వాళ్లు హరీష్ రావు పేరును ప్రస్తావిస్తుంటే హస్తం పార్టీ వాళ్లు ఈటలకు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ఈటెల రాజేందర్ అనే నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను’’ అనే సీన్ జరగబోతోందా అని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. హరీష్ రావు తన మేనమామ కేసీఆర్ కి ఎదురుతిరిగితే బాగోదు కాబట్టి బయటివాడైన ఈటల రాజేందర్ ను ముందు పెట్టి గులాబీ పార్టీ సీనియర్లు పాలి‘ట్రిక్స్’ చేస్తున్నారా అనే డౌటూ వస్తోంది.