కేటీఆర్ కి సవాల్ గా మారిన గ్రేటర్..ఈ ఎన్నికల మీద ఎన్ని’కలలో’.. !!
Mamatha Reddy 1000 - November 22, 2020 / 03:57 PM IST

గ్రేటర్ హైదరాబాద్ లో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు డిసెంబర్ ఒకటిన జరగనున్నాయి అయితే ఈఎన్నికలు అధికార టీఆర్‌ఎస్‌కు ఎంతో ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ ఎన్నికలతోనే టీఆరెస్ భవిష్యత్ ఆధారపడి పడి ఉంది. ఎందుకంటే 2023లో జరిగే అసెంబ్లీ సాదారణ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఈ ఎన్నికలలో ఘన విజయం సాదించాలిసి ఉంది. అయితే టీఆరెస్ పార్టీకి దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో చుక్కెదురైంది. బీజేపీ పార్టీ అభ్యర్థి ఘన విజయాన్ని సాధించడంతో షాక్ లో ఉండిపోయారు. అందుకనే ఇప్పుడు ఈ అవకాశాన్ని ఆ పార్టీ వినియోగించుకుంటోంది. అయితే గత కార్పొరేషన్ ఎన్నికలలో మాదిరి టీిఆర్‌ఎస్‌కు ఈసారి అంత సానుకూల వాతావరణం ఉంటుందా..ఉండదా అన్నది పెద్ద చర్చగా ఉంది.
కేటీఆర్ భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలు ఇవే
అయితే మేయర్ పదవి వరకు టీఆర్‌ఎస్ ఏదో విధంగా కైవసం చేసుకోవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.కానీ కాని ఈసారి వంద డివిజన్‌లలో గెలవగలగాలి అంటే మాటలు కాదు.ఈ ఎన్నికలు ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావుకు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. ఎందుకంటే రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి కేటిఆర్ అని ప్రచారం జోరుగా జరుగుతుంది కాబట్టి ఈ ఎన్నికలలో ఆయన పార్టీని విజయ పదంలో నడిపించలసి ఉంటుంది. అది కూడా గతసారి వచ్చిన ఫలితాలకు తక్కువ కాకుండా చూసుకోవల్సి ఉంటుంది. ఒక్కసారి వెనక్కి వెళితే 2016 లో ఉన్న రాజకీయ పరిస్థితికి, ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. అప్పట్లో టీఆర్‌ఎస్‌కు పూర్తి అనుకూల వాతావరణ ఉంది. కానీ ఇప్పుడు మొట్టమొదటి సారి బీజేపీ పార్టీ తెలంగాణలో జెండా ఎగురవేసింది. దానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కాని, మంత్రి కేటిఆర్ కాని గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు పలు వరాలు ప్రకటించారు. అంతేకాకుండా టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్.పీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలందరిని డివిజన్‌లలో పనిచేయడానికి కేటాయించారు. అలాగే ఇటీవలి వరదల వల్ల ఇబ్బంది పడ్డ ప్రజలకు పదివేల రూపాయల చొప్పున సాయం చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించి, చకచకా పంపిణీ ఆరంభించారు. అయితే కొంతమందికి ఈ సహాయం అందలేదంటూ వస్తున్న నిరసనలు కాస్త ఇబ్బంది పెడుతున్నాయి. ఇక ఆశ్చర్యం కలిగించేలా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని మున్సిపాలిటీల్లో ఇంటి పన్నును 50 శాతం తగ్గించారు. ఏడాదికి పదిహేను వేల రూపాయల లోపు వారికి ఇది వర్తిస్తుందని చెప్పారు. అలాగే 75 చదరపు గజాల స్థలం ఉన్నవారు భవన నిర్మాణ అనుమతి తీసుకోనవసరం లేదని, 600 గజాల స్థలంలోపు వారు స్వీయ ధ్రువీకరణ చేసి నిర్మాణ అనుమతి తీసుకోవచ్చని కూడా కేటిఆర్ ప్రకటించారు.
గత వాగ్దానాల మాటేమిటి
గత కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కేటిఆర్ అనేక వాగ్దానాలు చేశారు. ఉదాహరణకు కేబీఆర్ పార్కు చుట్టూరా ప్లై ఓవర్లు వస్తాయని, హడావుడిగా శంకుస్థాపనలు కూడా చేశారు. కాని అవి రాలేదు. అయితే దుర్గమ్మ చెరువు పై నిర్మించిన వంతెన వరకు టీఆర్‌ఎస్ క్రెడిట్ తీసుకోవచ్చు. అప్పట్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లక్ష నిర్మించి పేదలకు ఇస్తామని హామీ ఇచ్చారు. అది కూడా పూర్తిగా సాధ్యపడలేదు.
ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో టీఆరెస్ పార్టీ కాస్త ఓడిపోయింది. అందుకనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చి, బీజేపీ పార్టీని గెలిపించిందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏమిటంటే టీఆర్‌ఎస్‌కు యాభై లోపు వచ్చినా నామినేటెడ్ సభ్యులతో పాటు, మజ్లిస్‌తో కలిసి మేయర్ పదవి దక్కించుకోవచ్చు. కాని గత ఎన్నికలలో కన్నా తక్కువ డివిజన్‌లలో గెలిస్తే, అది పార్టీకి అప్రతిష్టగా మారుతుంది. అందుకనే ఈసారి ఎన్నికలలో వంద సీట్ల టార్గెట్‌తో పనిచేయడానికి సమాయత్తం అయ్యారు. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు గెలుపు వల్ల టీఆర్‌ఎస్‌కు కొంత అప్రతిష్ట వచ్చినట్లయింది. గత ఆరేళ్లలో తొలిసారి ఒక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ఓడినట్లయింది. వీటన్నిటిని కవర్ చేసుకోవాలంటే హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించవలసి ఉంటుంది. గతసారి మాదిరే ఇప్పుడు కూడా టీఆర్‌ఎస్ అలా విజయం సాధిస్తే, కేటిఆర్ తిరుగులేని నేతగా ప్రజలలోను, పార్టీలోను నిలబడతారు.
బల్దియా కింగ్ మేకర్ ఎవరు
అలాకాకుండా గణనీయంగా సీట్లు తగ్గితే మాత్రం కేటిఆర్‌కు కూడా కాస్త చికాకుగానే ఉంటుంది. తెలంగాణలో మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు ఒక ఎత్తు అయితే, హైదరాబాద్ నగర కార్పొరేషన్ ఒక ఎత్తు అని చెప్పాలి. అంతేకాక కాంగ్రెస్‌కు చెందిన కొందరు ప్రముఖులను బీజేపీలోకి ఆకర్షిస్తున్నారు. టీఆర్‌ఎస్ కూడా ఆయా చోట్ల కాంగ్రెస్, బీజేపీలకు చెందిన కొందరిని ఆకర్షించవచ్చు. బీజేపీ హైదరాబాద్‌లో గణనీయంగా ముప్పై నుంచి నలభై సీట్లు సాధిస్తే వచ్చే శాసనసభ ఎన్నికలకు తామే చాంపియన్‌లమంటూ సవాలు విసిరే స్థాయిలో మాట్లాడతారు. ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే పోటీ టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య కేంద్రీకతం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ ఎన్నికలను చూస్తుంటే 2023లో జరిగే శాసనసభ ఎన్నికలకు ముందు ఇది ఒక రిహార్సిల్ అని చెప్పాలి…విజయం నిదా.. నాదా..సై అంటున్నాయి రాజకీయ పార్టీలు..