KTR : దాడులు చేస్తారేంట్రా దద్దమ్మల్లారా..

KTR : హన్మకొండలోని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి మీద బీజేపీ కార్యకర్తలు భౌతిక దాడులకు దిగటాన్ని టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చటానికి కమలం పార్టీ కుటిల యత్నాలకు పాల్పడుతోందని ఘాటుగా విమర్శించారు. తమ వాదనతో జనాన్ని ఒప్పించటం చేతకాక కమలం కేడర్ కొట్లాట్లకు దిగుతోందని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన నిన్న రాత్రి పొద్దుపోయాక ఒక ప్రకటన జారీ చేశారు.

ఇప్పటికే చెప్పాం..

‘‘పార్టీ కార్యకర్తలను, శ్రేణులను, నాయకులను ప్రతిఒక్కరినీ కాపాడుకునే శక్తి-యుక్తులు, మందీ-మార్బలం, బలం-బలగం మాకూ ఉన్నాయి. ఈ సంగతిని కాషాయం పార్టీవాళ్లు కాస్త గుర్తుంచుకుంటే మంచిది. ఎవరి ఓపికకైనా ఒక హద్దు ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఒకసారి చెప్పాం. అయినా వినకుండా పదే పదే రెచ్చగొడుతున్నారు. మా ఓపిక నశిస్తే వాళ్లు కనీసం బయట తిరిగే పరిస్థితి కూడా ఉండదు. ఆ పార్టీ చేస్తున్న భౌతిక దాడుల్ని మేమూ ధీటుగానే ఎదుర్కోగలం’’ అని కేటీఆర్ బీజేపీని గట్టిగా హెచ్చరించారు.

ఖండించాలి: KTR

ప్రజాస్వామ్యంలో దాడులకు చోటులేదని కేటీఆర్ హితవు పలికారు. ఇతర పార్టీల్ని భౌతికంగా కనుమరుగు చేయాలనుకోవటం అవివేకమని, బీజేపీ పాల్పడుతున్న ఇలాంటి దుందుడుకు చర్యల్ని ప్రజాస్వామికవాదులు ఖండించాలని టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపునిచ్చారు. కమలం పార్టీవాళ్లు గతంలోనూ ఇలాగే ఎటాక్స్ చేశారని, హేతుబద్ధమైన విమర్శల స్థాయిని దాటి ఈవిధంగా దురుసుగా వ్యవహరించటం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు ఏ కోశానా మంచిది కాదని మంత్రి దుయ్యబట్టారు. టీఆరెస్ విలువలతో కూడిన పాలిటిక్స్ ని కోరుకుంటోంది తప్ప ఇలాంటివాటిని కాదని కేటీఆర్ స్పష్టం చేశారు.

KTR : minister-ktr-warning-to-bjp
KTR : minister-ktr-warning-to-bjp

ఉద్యమ పార్టీ..

‘‘టీఆరెస్ అనేది ఒక ఉద్యమ పార్టీ అని బీజేపీ మర్చిపోవద్దు. ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా సంయమనంతో ముందుకు పోతున్నాం. మంచితనాన్ని చేతగానితనం అనుకోవద్దు. సొసైటీలోని మేధావులు, సాధారణ ప్రజలు, తెలంగాణ అభిమానులు అందరూ కమలం పార్టీని ఎక్కడికక్కడ నిలదీయాలి. మరోసారి ఇలా హద్దు మీరి ప్రవర్తించకుండా బుద్ధి చెప్పాలి’’ అని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆరెస్) వర్కింగ్ ప్రెసిడెంట్-రాష్ట్ర ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్) పిలుపునిచ్చారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి బీజేపీ వసూలు చేస్తున్న విరాళాలు లెక్కా పత్రం లేకుండా పోతున్నాయంటూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి (టీఆరెస్) ఆదివారం వరంగల్ లో వ్యాఖ్యానించటంతో ఆగ్రహానికి గురైన బీజేపీ కార్యకర్తలు హన్మకొండలోని ఆయన ఇంటి మీద రాళ్లు, గుడ్లు విసిరి దాడికి పాల్పడిన విషయం విధితమే.

Advertisement