Kcr : ఫ్లాష్.. ఫ్లాష్.. : మోడీకి మరోసారి జై కొట్టిన కేసీఆర్

Kcr : కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను కేసీఆర్ వరసపెట్టి అమలుచేస్తున్నారు. ఇప్పటికే నూతన వ్యవసాయ చట్టాలకు సై అన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఆ తర్వాత ‘ఆయుష్మాన్ భారత్’లోనూ రాష్ట్రాన్ని చేర్చారు. తాజాగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని కూడా తెలంగాణలో అమలుచేసేందుకు ఇవాళ (గురువారం) నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్లూ మోడీ సర్కార్ విధానాల్ని అనుసరించేందుకు ససేమిరా అన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఒకదానితర్వాత ఒకటిగా వాటికి జై కొడుతుండటం చర్చనీయాంశమవుతోంది.

కీలక నిర్ణయం..

దేశంలోని అగ్ర కులాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కి చదువులు, ఉద్యోగాల్లో 10 శాతం సీట్లను, పోస్టులను పక్కన పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. రాజ్యాంగాన్ని సవరించి మరీ తెచ్చిన ఈ పది శాతం రిజర్వేషన్లను కేంద్రంతోపాటు వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే అమలుచేస్తున్నారు. తెలంగాణలో మాత్రం ఇన్నాళ్లూ అమలుకు నోచుకోలేదు. దీంతో హైకోర్టు ఈమధ్య ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది.

నేటితో తెర : Kcr

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తెలంగాణలో ఎందుకు అమలుచేయట్లేదంటూ ఉన్నత న్యాయస్థానం ఇటీవల ప్రశ్నించటంతో ప్రభుత్వంలో ఈ దిశగా కదలిక వచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అన్ని కోర్సులకీ అమలుచేసేలా సానుకూలంగా స్పందించాలంటూ హైకోర్టు సూచించింది. దీంతో.. గతంలో వెనకా ముందూ చూసుకోకుండా తీసుకున్న తొందరపాటు నిర్ణయాలన్నింటిపైనా తెలంగాణ సర్కారు ఇప్పుడు పున:సమీక్ష చేస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు పచ్చజెండా ఊపింది.

మొత్తం 60

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అన్ని వెనకబడిన వర్గాలకు కలిపి మొత్తం 50 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తున్నారు. 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను కూడా కలిపితే మొత్తం రిజర్వేషన్ల శాతం 60కి చేరుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇది 50 శాతానికి మించకూడదు. ఈ నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలును ఎలా ముందుకు తీసుకెళ్లాలనేదానిపై రెండు రోజుల్లో మరోసారి భేటీ కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

kcr-telangana-cm-following-modi
kcr-telangana-cm-following-modi

ఆదేశాలే తరువాయి : Kcr

రెండు రోజుల్లో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకోసారి సమావేశమై ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై లోతుగా చర్చిస్తారు. ఈ లోపు విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు. తర్వాత వాటిని పరిశీలించి తగిన మార్గదర్శకాలను జారీ చేస్తారు. త్వరలో 50 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవటం వల్ల ఎంతో మంది నిరుద్యోగులు ప్రయోజనం పొందే సువర్ణావకాశం ఉందని చెబుతున్నారు.

Advertisement