తెలిసి కూడా గ్రేటర్ లో కేసీఆర్ తప్పు చేశాడా..?
Mamatha Reddy 1000 - December 6, 2020 / 03:47 PM IST

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వంద డివిజన్లలో మేమే గెలుస్తామని కేసీఆర్ ప్రగల్భాలు పలికారు కానీ తీరా చూస్తే చచ్చి చెడి 60 సీట్లను కూడా గెలుచుకోవడానికి కష్టపడ్డారు. గతంలో నాలుగు సీట్లు సాధించిన బీజేపీ ఇప్పుడు 48 సీట్లు సాధించి తన సత్తా ఏంటో చాటింది. గతంలో గెలిచిన చాలా డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం చవి చూడాల్సి వచ్చింది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల పై కూడా పడనుందని కేసీఆర్ ముందస్తుగానే గ్రహించారు.

kcr did mistake in ghmc elections
అందుకే ప్రచారానికి కేవలం ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. వారం రోజుల సమయంలోనే దూకుడుగా ప్రచారం చేసి హైదరాబాద్ నగరవాసులు తమవైపు తిప్పుకోవడం లో బండి సంజయ్, కిషన్ రెడ్డి, అమిత్ షా తదితర బీజేపీ నేతలు సక్సెస్ అయ్యారు. పొలోమని ఢిల్లీ నుంచి ఎంతమంది వచ్చినా.. నాలుగు రోజుల ముచ్చటే.. శాశ్వతంగా మీకు అండగా ఉండేది నేనే అంటూ కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో చెప్పుకొచ్చినా.. నగరవాసులు అసలు పట్టించుకోలేదు. ఓటింగ్ శాతం తక్కువగా నమోదయింది కాబట్టి తెరాస మెజారిటీ ఓట్లతో ముందంజలో ఉంది కానీ ఎక్కువ ఓటింగ్ శాతం నమోదైనట్టయితే బీజేపీ పార్టీయే గెలిచి తీరేదని కొందరు రాజకీయ విశ్లేషకులు ఘంటాపథంగా చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిసారీ ఎన్నికల పోటీ వన్ సైడ్ వార్ అవుతుంది కానీ ఈసారి మాత్రం తెరాస కి బీజేపీ హోరాహోరీ పోటీ ఇచ్చింది. కేసీఆర్ కూడా గతంలో లాగా దూకుడుగా వ్యవహరించలేకపోతున్నారు. ఇటువంటి సమయం లో బీజేపీ అనూహ్యమైన విజయాలను సాధించడం కేసీఆర్ కి మింగుడు పడడం లేదు. తెరాస కి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ పాగా వేసి గెలిచింది. సాధారణంగా హైదరాబాద్ లో స్థిరపడిపోయిన ఓటర్ల అందరూ కూడా టిఆర్ఎస్ కే ఓటు వేస్తారు అని అనుకున్నారు కానీ అలా జరగలేదు. అలా జరిగి ఉంటే బీజేపీ కి ఈ స్థాయిలో ఓట్లు వచ్చి ఉండకపోయేవి. సెటిలర్లతో పాటు కొన్ని సామాజిక వర్గాల ప్రజలు కూడా టీఆర్ఎస్ కి ఓట్లు వేయలేదు. దీంతో కేసీఆర్ మరియు కేటీఆర్ ఢీలా పడిపోతున్నారు.
ఐటీ రంగ సంస్థలనున్న గచ్చి బౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో బీజేపీ అనూహ్యమైన రీతిలో మద్దతు సాధించగలిగింది. ఐటీ మంత్రి కేటీఆర్ కు కూడా ఈ విషయంలో తీవ్ర నిరాశ చూపుతున్నారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు కూడా నిరాశా నిస్పృహల మధ్య తాను మాట్లాడడానికి కష్టపడ్డారు. ఇటీవల వచ్చిన వరదల కారణంగానే కేసీఆర్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కుండపోత వర్షాల కారణంగా నగర కాలనీలు సముద్రాన్ని తలపిస్తున్న సమయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఆ తర్వాత ప్రకటించిన వరద సాయం కూడా అందరికీ అందకపోవడంతో ప్రజలు తీవ్ర వ్యతిరేకతను చూపించారు. ఆ వ్యతిరేకతే ఈ రోజున బిజెపి పార్టీని ఆకాశానికి ఎత్తిందని తెలుస్తోంది. విశేషమేమిటంటే పోస్టల్ బ్యాలట్స్ లో బీజేపీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తుంటే కేసీఆర్ కి ప్రభుత్వ ఉద్యోగులందరూ శత్రువులుగా మారారని చెప్పుకోవచ్చు.
ఎక్స్ అఫీషియో ఓట్లతో టీఆర్ఎస్ మేయర్ అధిష్టానాన్ని దక్కించుకోగలదు కానీ బీజేపీ నుంచి తమకు పెద్ద ప్రమాదమే ఉందని కేటీఆర్ & కేసీఆర్ తెగ భయపడిపోతున్నారు. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేటీఆర్ ప్రచారం చేసి కాస్తోకూస్తో ప్రజలను తమవైపు తిప్పుకునే గలిగారు కానీ భవిష్యత్తులో బీజేపీ ఎత్తులకు పైఎత్తులు వెయ్యకపోతే తెరాస కథ ముగుస్తుంది. ఇప్పటికైనా ఒక గుణపాఠం నేర్చుకుని ప్రజలకు సుపరిపాలన అందించడానికి టీఆర్ఎస్ నడుం బిగిస్తుందో లేక బీజేపీ కి పోటీ ఇవ్వలేక నామరూపాల్లేకుండా కనుమరుగవుతుందో చూడాలి.