Ghatkesar : ఇటీవల తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఘట్కేసర్ కిడ్నాప్ డ్రామా యువతి ఈరోజు ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ అమ్మాయి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నెల 10వ తేదీన తనను ఎవరో అపహరించుకుపోయారంటూ కట్టుకథ చెప్పిన బీ ఫార్మసీ విద్యార్థిని ఇవాళ నిద్ర మాత్రలు మింగి సూసైడ్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కిడ్నాప్ అంతా అబద్ధం అనే విషయం వెలుగు చూసినప్పటి నుంచి ఆమె ఘట్కేసర్ లోని తన మేనమామ ఇంట్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకున్న సంగతి తెలిసి బంధువులు ఘట్కేసర్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లగా ఆమె అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈ తాజా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఎందుకిలా?: Ghatkesar
కీసరకు చెందిన ఈ యువతి గతంలో కూడా ఇలాగే ఒకసారి కిడ్నాప్ నాటకం ఆడిందని అన్నారు. దీన్నిబట్టి ఆ విద్యార్థిని మానసిక స్థితిపై అప్పట్లోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికితోడు లేటెస్ట్ కిడ్నాప్ ఎపిసోడ్ వల్ల తన కుటుంబం పరువు పోయినట్లు డీప్ గా ఫీలై ఉంటుందని, అందుకే ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. అపహరణకు గురైందనే కేసులో ఈ యువతి అకారణంగా ఆటోడ్రైవర్లపై నిందలు మోపినట్లు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. పోలీసులను తప్పుదోవ పట్టించిందనే ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆమె జీవితం చివరకు ఇలా విషాదాంతమైంది.