‘మోడీ కాళ్ళ దగ్గర జగన్’ సంచలన ఆరోపణ .. ప్రూఫ్స్ కూడా ఉన్నాయా ?
Tech Desk-2 - November 8, 2020 / 06:33 PM IST

ఏ విషయంలోనూ ప్రత్యర్థులకు దొరకని వైఎస్ జగన్ ఒకేఒక్క విషయంలో మాత్రం తరచూ ప్రత్యర్థులకు చిక్కిపోతున్నారు . ఎక్కడైనా ఎవరికైనా సమాధానం చెప్పగల వైసీపీ నేతలు ఆ ఒక్క మ్యాటర్లో మాత్రం బిక్కమొహం వేస్తున్నారు. అదే ప్రధాని మోదీ. జగన్ సీఎం అయిన రోజు నుండి ప్రధానికి సమ్మతంగానే ఉంటూ వస్తున్నారు. అడుగడుగునా మోదీకి మద్దతు తెలు పుతూ ఆయన చల్లని చూపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఢిల్లీలో ఇచ్చే మద్దతు గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మోదీ అడగకుండానే అన్ని బిల్లులకు గ్రీన్ సిగ్నల్ వెళ్లిపోవడం వైసీపీ నేతలకు తప్పనిసరి కర్తవ్యం అయిపోయింది.
ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, నిధులు సకాలంలో విడుదలచేయకపోయినా, చివరికి పోలవరం విషయంలో అంచనా వ్యయాన్ని సగానికి సగం కుదించినా జగన్ మోదీ మీద కానీ అమిత్ షా మీద కానీ పల్లెత్తి మాట అనలేదు. రాష్ట్ర బీజేపీ మీద అయితే ఏదో ఒక విషయంలో రియాక్ట్ అవుతున్నారు కానీ కేంద్ర నాయకత్వం మీద మాత్రం నోరెత్తలేకపోతున్నారు. ఇదే తెలుగుదేశం పార్టీ నేతలకు అలుసు అయిపోయింది. జగన్ తన మీదున్న కేసులకు భయపడి మోదీకి లొంగిపోయారనే మాట పడవలి వస్తోంది. కానీ జగన్ మాత్రం ఆ విషయం మీద ఒకే రూట్లో వెళుతున్నారు. ఎక్కడా ఇసుమంత మార్పు కూడ లేదు.
ఇన్నాళ్లు తెనుగుదేశం నేతలే ఈ మాటను అంటుంటే తాజాగా సీపీఐ నారాయణ కూడ అదే అంటున్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్రంలో మోడీ కాళ్లు పట్టుకున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన. కేంద్రంలో బిజెపికి వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోరాడలేకపోతుంది. రాష్ట్ర బీజేపీ మీద అయితే విరుచుకుపడతారో కానీ కేంద్రం మీద మాత్రం ఎలాంటి విమర్శ చెయ్యట్లేదు. ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు ప్రజలను రెండు కాళ్ళతో తంతూ ఉంటే జగన్ మోహన్ రెడ్డి మాత్రం మోడీ కాళ్లు పట్టుకున్నారు అంటూ తిట్టిపోశారు. ఆధారాలు లేకుండా ఎప్పుడూ ఈ తరహా విమర్శలు చేయని సీపీఐ ఒక్కసారే ఇలా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.