Congress: తెలంగాణ రాష్ట్రంలో తెలివైన లీడర్.. దేశంలో ఎవరికీ రాని ఆలోచన ఆయనకి..

Congress: వి.హనుమంతరావు(వీహెచ్) తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. రాజ్యసభ మాజీ సభ్యుడు. ప్రస్తుతం కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో దేశం మొత్తమ్మీద ఏ రాజకీయ నాయకుడికీ, ఏ పార్టీ లీడర్ కీ రాని బ్రహ్మాండమైన ఆలోచన ఆయనకి వచ్చింది. గ్రేట్. ప్రజాప్రతినిధి అంటే ఇలా ఉండాలి. నిత్యం కాకపోయినా కనీసం ఇప్పుడైనా ఇలా జనం గురించే ఆలోచించాలి. ఆయన తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ కి నిన్న బుధవారం ఒక లేఖ రాశారు. తనకు వచ్చిన ఆలోచనను ఆయనతో పంచుకున్నారు. ఇలా చేద్దాం అంటూ సలహా ఇచ్చారు.

ఏంటది?..

హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన గాంధీ భవన్ ని, అలాగే ఇందిరా భవన్ ని, జిల్లాల్లోని కాంగ్రెస్ కమిటీ కార్యాలయాలను మూడు నెలల పాటు కొవిడ్ కేర్ సెంటర్లుగా వాడుకునేందుకు ఇస్తామంటూ ప్రభుత్వానికి ప్రతిపాదించాల్సిందిగా కోరారు. ఏప్రిల్ 30న అంటే రేపు మున్సిపల్ ఎన్నికలు ముగిస్తే ఇప్పట్లో ఎలాగూ ఎలక్షన్లు లేవు కాబట్టి ఆ ఆఫీసులను ఖాళీగా ఉంచే కంటే ఆయా స్థలాల్లో పడకలను ఏర్పాటు చేసి కరోనా బాధితులకు చికిత్సాలయాలుగా మారిస్తే బాగుంటుంది కదా అని సూచించాడు. ఎంత మంచి ఆలోచన?. ప్రభుత్వాస్పత్రుల్లో బెడ్ల కొరత సమస్య చాలా వరకు తీరిపోతుంది.

ఒక్క కాంగ్రెసేనా?..

పొలిటికల్ పార్టీల లక్ష్యమేంటి?. ఉద్దేశమేంటి?. అధికారమా?. ప్రజాసేవా?. ఏదైనా కావొచ్చు. కానీ ఈ రెండూ పబ్లిక్ తో ముడిపడి ఉన్నవే కదా. జనం ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే అధికార పార్టీని తిడుతూ కూర్చునేకంటే ఇలాంటి సలహాలు సూచనలు ఇవ్వటం అభినందనీయం. ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు. టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, జనసేన.. ఇలా చాలా పార్టీలకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాలున్నాయి. వాటన్నింటినీ ఇలాగే ఇచ్చేస్తే?. వాటితోపాటు కాసిన్ని విరాళాలు కూడా ప్రకటిస్తే?. ఈ పార్టీలు ప్రజలకు ఇంతకు మించిన సేవ ఇంకెప్పుడు చేస్తాయి?. బండి సంజయ్, వైఎస్ షర్మిల, ఎల్.రమణ, తమ్మినేని వీరభద్రం తదితరులు వీహెచ్ బాటలో నడవాలని కోరుకుంటూ ఆయన సెల్యూట్.

Advertisement