CM KCR : కేసీఆర్ కొట్టబోయే ఈ దెబ్బకి ప్రతిపక్షం ఔట్.. ఎనీ డౌట్..

CM KCR : నింగిలోని చంద్రుడికి ఉన్నట్లే తెలంగాణలోని చంద్రుడికి(సీఎం కేసీఆర్ కి) కూడా ‘నిరుద్యోగం’ అనే చిన్న మచ్చ ఉందని ఆయన అభిమానులు అప్పుడప్పుడు ఒప్పుకుంటూ ఉంటారు. నీళ్లూ.. నిధులూ.. నియామకాలు.. అనే ప్రధాన నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయి రెండేళ్లు దాటినా కేసీఆర్ నిరుద్యోగులకు చేసిందేమీ లేదనే విమర్శ బలంగా వినిపిస్తోంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికే టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ మొన్న ఒక బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీశారు. అదే.. నిరుద్యోగ భృతి.

నెలకెంత?..

నిరుద్యోగులకు నెలకి రూ.3,016(మూడు వేల పదహార్ల) చొప్పున ప్రతినెలా ఇస్తామని అధికార పార్టీ టీఆరెస్ 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించి ఉద్యోగంలేనోళ్లని మురిపించింది. దీంతో చాలా మంది చదువుకున్నోళ్లు ఆ పార్టీకి కళ్లు మూసుకొని ఓటేసి గెలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతి కోసం 2019 బడ్జెట్ లో రూ.1,810 కోట్లు కేటాయించారు. కానీ.. ఆర్థిక సంక్షోభం, కరోనా సమస్యల నేపథ్యంలో ఈ పథకాన్ని అమలు చేయలేకపోయారు. దీంతో ఉద్యోగంలేనోళ్లల్లో కేసీఆర్ పై కోపం పెరిగిపోయింది. ఈ ప్రభావం దుబ్బాక, బల్దియా ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని చెప్పొచ్చు.

మరో వరం: CM KCR

దుబ్బాక, బల్దియా ఫలితాల తర్వాత కేసీఆర్ సర్కార్ రూట్ మార్చింది. 50 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని ఇటీవలే ప్రకటించి చదువుకున్నోళ్లల్లో సంతోషం నింపారు. ఓ వైపు ఈ కొలువుల భర్తీకి కసరత్తు చేస్తుండగానే మరో వైపు నిరుద్యోగ భృతి అనే మరో వరాన్ని మళ్లీ తెర పైకి తెచ్చి యువతలో ఆనందం రెట్టింపు చేశారు. దీనిపై పూర్తి వివరాల్ని సీఎం గారే రేపోమాపో ప్రకటిస్తారని చెప్పి కేటీఆర్ ప్రతిపక్ష పార్టీలకి షాక్ ఇచ్చారు. దీంతో ఒకటీ రెండు నెలల నుంచి సైలెంటుగా ఉంటున్న కేసీఆర్ మరోసారి జనరంజక పాలనకు శ్రీకారం చుట్టబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.

ఎంత మందికి..

నిరుద్యోగ భృతిని సుమారు 20 లక్షల మందికి ఇవ్వొచ్చని చెబుతున్నారు. ఉద్యోగంలేనివాళ్లని గుర్తించటం ఎలా అనేదానిపై ఇప్పుడు సమాలోచనలు జరుపుతున్నారు. ఇలాంటి పథకాన్ని గతంలో పశ్చిమ బెంగాల్, కేరళ తదితర రాష్ట్రాల్లో అమలు చేశారు. దీంతో అక్కడికి కూడా వెళ్లి అధ్యయనం చేసి రానున్నారు. నెల నెలా 20 లక్షల మందికి నిరుద్యోగ భృతిని చెల్లించాలంటే ఏడాదికి రూ.4,800 కోట్లు కావాలని ఇప్పటికే లెక్కలేశారు. ఈ పథకానికి అర్హులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేయాలని కూడా భావిస్తున్నారు. నిరుద్యోగులను గుర్తించటానికి సర్కారు దగ్గర సైంటిఫిక్ పాలసీలు, డేటా వంటివి లేవు. దీంతో వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు.

CM KCR : master-plan-to-beat-bjp-congress
CM KCR : master-plan-to-beat-bjp-congress

 

ఏమీ సేతుర.. : CM KCR

తాజా స్టేట్మెంటుతో టీఆర్ఎస్.. బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీల్ని కోలుకోలేనివిధంగా దెబ్బకొట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎల్ఆర్ఎస్.. ఆయుష్మాన్ భవ.. పంటల నియంత్రిత సాగు.. కొత్త వ్యవసాయ చట్టాలు.. ఈడబ్ల్యూసీలకి రిజర్వేషన్లు.. ఇలా అపొజిషన్ పార్టీలు లేవనెత్తున్న దాదాపు ప్రతి సమస్యనూ పరిష్కరిస్తూ కేసీఆర్ ఊహించనివిధంగా మళ్లీ ఫామ్ లోకి వస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో తెలంగాణ కమలనాథుడు బండి సంజయ్, కాంగ్రెస్ ఫైటర్ భట్టీ విక్రమార్క ఎట్సెట్రా ఎట్సెట్రా నాయకులు మెదడుకి మేత పెట్టి, కొత్త కొత్త డిమాండ్లు కనిపెట్టాల్సి ఉంటుందని తెలంగాణ, కేసీఆర్, టీరెఎస్ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు.

Advertisement