BJP : రాంచందర్ రావు గారూ.. వీటికేమంటారు?..

BJP : తెలంగాణ రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో బీజేపీ తరఫున మరోసారి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ నారపరాజు రాంచందర్ రావు ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ గెలవటం సాధ్యమేనా అనే అనుమానం విశ్లేషకులకు కలుగుతోంది. దీనికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా కమలం పార్టీ అనుసరిస్తున్న రాజకీయ ఎత్తుగడలు. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ టీఆరెస్ అడ్డగోలుగా లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతోందని కాషాయం పార్టీ అంటోంది. అందులో వాస్తవమెంతో ఆ పార్టీకి బాగా తెలుసు. కేసీఆర్ సర్కారు నిజంగానే కుంభ కోణాలు చేస్తుంటే, రాష్ట్ర ఖజానాను దోచేస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు చూస్తూ ఊరుకుంటోందని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఒట్టి మాటలు..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఢిల్లీకి వెళ్లొచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్ జైలుకు పోవటం ఖాయమని కేకలు వేస్తున్నారు. ముఖ్యమంత్రిని గద్దె దింపుతామని సవాళ్లు విసురుతున్నారు. కానీ అవి ఒట్టి డొల్ల కబుర్లేనని పబ్లిక్ కి అర్థమవుతూనే ఉంది. కమలం పార్టీ ఇలా మాటలు చెప్పటం కన్నా చేతల్లో చూపించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సెటైర్లు వేస్తుండటం తెలిసిన విషయమే. రాజకీయం కోసం రాద్ధాంతం చేయటం కన్నా గులాబీ పార్టీ పాలనలోని లోపాలను నిజాయితీగా, నిర్మాణాత్మకంగా పట్టి చూపొచ్చు కదా అని ఓటర్లు సూచిస్తున్నారు. రాంచందర్ రావు గారూ మీరేమంటారు?.

ఆ రాజ్యం ఎందుకు?

కారు పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని గాలికొదిలేసిందని బీజేపీ రోజూ విమర్శిస్తూనే ఉంది. అయితే మేము అధికారంలోకి వస్తే డెవల్మెంట్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇంకా బాగా అమలుచేస్తామని చెప్పకుండా రామరాజ్యం తెస్తామని ఎందుకు ఒకటికి పదిసార్లు వల్లెవేస్తున్నారు. రామరాజ్యం అంటే మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప మరొకటి ఉంటుందా అని మేధావులు అడుగుతున్నారు. మీరు రామరాజ్యం తెస్తే రాష్ట్రంలో ఉన్న ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతాల వాళ్లు ఏమైపోవాలని ధర్మ సందేహం వెలిబుచ్చుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ప్రశాంతంగానే ఉంది. మతాల మధ్య కుమ్ములాటలు గానీ మత మార్పిళ్లు గానీ ఏమీ జరగట్లేదు. ఒక వేళ జరిగితే వార్తలు వస్తాయి కదా. అయినా అసలు రామరాజ్యం కావాలని ఎవరడిగారు?. ప్రజల్లోకి వెళ్లటానికి వేరే అజెండాయే లేక దీన్ని పట్టుకొని వేలాడుతున్నారా అనే డౌటు కొద్దోగొప్పో రాజకీయ పరిజ్ఞానం కలిగిన ప్రతిఒక్కరికీ వస్తోంది.

BJP : ramchander rao garu what is your opion on these issues
BJP : ramchander rao garu what is your opion on these issues

రేట్లు.. ప్రైవేట్లు: BJP

గ్యాస్, పెట్రోల్, డీజిల్ తదితరాల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. మరో వైపు కేంద్రంలోని మీ పార్టీయేమో ప్రైవేట్ రంగాన్ని బలోపేతం చేయటంపై ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థలను వరసపెట్టి అమ్మేస్తోంది. ఎల్ఐసీ, రైల్వే వంటి వాటినీ వదలి పెట్టడం లేదు. జోనల్ వ్యవస్థకు అనుమతించకపోవటం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మంజూరు చేయకపోవటం, ఎస్సీల వర్గీకరణను బుట్టదాఖలు చేయటం, ఐటీఐఆర్ ప్రాజెక్టును క్లోజ్ చేయటం వంటి వైఫల్యాలెన్నో కమలం పార్టీ ఖాతాలో ఉన్నాయి. మోడీ గవర్నమెంట్ ఇస్తానని చెప్పిన ఆరు కోట్ల ఉద్యోగాల వివరాలను మీరింకా మంత్రి కేటీఆర్ కి చెప్పనేలేదు. వీటన్నింటినీ రాంచందర్ రావు గారు ఎలా సమర్థించుకుంటారు?. ఈ పరిస్థితుల్లో ఆయన రెండో గెలుస్తారా అనిపిస్తోంది.

Advertisement