కమలనాథులకు.. ‘‘కొత్త కొత్తగా ఉన్నది’’..
Kondala Rao - December 22, 2020 / 05:08 PM IST

బీజేపీ లీడర్లు ఇప్పుడు ఏ రాష్ట్రానికి పోయినా ‘‘ప్రజలు కొత్త నాయకత్వం, మార్పు కోరుకుంటున్నారు’’ అనే ప్రకటనలే చేస్తున్నారు. మొన్నటికిమొన్న.. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అధికార పార్టీ టీఆరెస్ కి టాటా, బైబై చెప్పేసి బీజేపీకి వెల్ కం అనటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
నిన్న అమిత్ షా..
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న పశ్చిమ బెంగాల్ వెళ్లి ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200 సీట్లు సాధించబోతోందని, అప్పుడు టీఎంసీలో మిగిలిపోయేది ఆ పార్టీ అధ్యక్షురాలు, సీఎం మమతా బెనర్జీ మాత్రమేనని ఎద్దేవా చేశారు. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇస్తే పశ్చిమ బెంగాల్ ను పసిడి బెంగాల్ గా డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు.
ఈరోజు అనురాగ్ ఠాకూర్..
ప్రస్తుత పరిస్థితుల్లో జమ్మూకాశ్మీర్ నూతన నాయకత్వాన్ని కోరుకుంటోందని బీజేపీ నేత, కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. జమ్మూకాశ్మీర్ లో జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికలకు ఆయన బాధ్యుడిగా వ్యవహరించారు. ఆ ఎలక్షన్ రిజల్ట్స్ నేడు రానున్న నేపథ్యంలో అనురాగ్ ఠాకూర్ ఈ ప్రకటన చేయటం గమనార్హం.
ప్రభుత్వ వ్యతిరేకతకు కొత్త పేరు
ఒక రాష్ట్రంలో లేదా ఒక ప్రాంతంలో ఐదేళ్లో, పదేళ్లో ఒకే పార్టీ అధికారంలో ఉంటే సర్కారుపై ప్రజల్లో సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది. గతంలో రాజకీయ పార్టీలు ప్రభుత్వ వ్యతిరేకత అనే పదం వాడేవారు. ఇప్పుడు బీజేపీవాళ్లు ‘‘ప్రజలు కొత్త నాయకత్వం కోరుకుంటున్నారు’’ అనే కొత్త ట్రెండ్ తెచ్చారు. ఈ ప్రకటనలకు తగ్గట్లే ఒకటో రెండో ఏరియాల్లో తప్ప దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు కమలనాథులకు అనుకూలంగానే వస్తుండటం విశేషం.
తిరుపతిలోనూ..
తిరుపతి ఎంపీ సీటుకి త్వరలో ఉప ఎన్నిక జరగనుండటంతో ఏపీ బీజేపీ నేతలు కూడా ‘‘రాష్ట్ర ప్రజలు కొత్త లీడర్ షిప్’’ను ఆశిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే టీడీపీ పాలన చూసేశారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ సర్కారును చూస్తున్నారు. కాబట్టి కొత్తగా బీజేపీని గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఎంత బాగా డెవలప్ చేస్తామో చేసి చూపిస్తామని ఛాలెంజ్ విసురుతున్నారు. కొత్త నాయకత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారా? కొత్త ప్రాంతాల్లో అధికారం కోసం బీజేపీవాళ్లు ఇలా ఆకట్టుకునే మాటలు చెబుతున్నారా అనేది ఎన్నికల తర్వాత గానీ తేలనుంది.