Bandi: ఏపీ, తెలంగాణ అయింది.. ఇక పశ్చిమ బెంగాల్ మీద పడ్డాడు..

Bandi: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సార్ ఇన్నాళ్లూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించే మాట్లాడారనుకుంటే ఇవాళ బుధవారం పశ్చిమ బెంగాల్ పాలిటిక్స్ పైనా ఘాటుగా, తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణలో మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పొరేషన్లలో తన పార్టీ నిండా మునిగిపోతే మారుమాట్లాడడు గానీ అక్కడెక్కడో తిరుపతిలో, ఇంకా దూరంగా ఉన్న వెస్ట్ బెంగాల్ లో జరుగుతున్నవాటిని మాత్రం ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాడని విమర్శకులు అంటున్నారు. నాగార్జునసాగర్ బైఎలక్షన్ లో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిన వ్యక్తి, గతంలో తమ పార్టీయే గెలిచిన లింగోజిగూడ మున్సిపల్ డివిజన్ ని సైతం కోల్పోయిన వ్యక్తి ఇతర రాష్ట్రాల రాజకీయాల గురించి ఆగ్రహంగా మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారు.

రాక్షసి అంట.. మమతా బేగం అంట..

మనం ఎప్పుడూ చెప్పుకునేదే. బండి సంజయ్ కుమార్ సార్ సేమ్ ఇవాళ కూడా తనకు అలవాటైన భాషనే అలవోకగా వాడేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని రాక్షసి అన్నారు. ఆ రాష్ట్రాన్ని ఆమె బంగ్లాదేశ్ కి అప్పగించేలా పాలన సాగిస్తున్నారని రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. మమతా బెనర్జీ తన పేరును మమతా బేగంగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. రోహింగ్యాలకు, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు పశ్చిమ బెంగాల్ ని అడ్డాగా మార్చారని విమర్శించారు. విదేశీ నిధులను, రోహింగ్యాలు ఇచ్చిన డబ్బులను మమతా బెనర్జీ మొన్నటి ఎన్నికల్లో ఖర్చు చేశారని ఆరోపించారు. ఇంకా నయం.. పశ్చిమ బెంగాల్ పైన కూడా సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని అనలేదు. సంతోషం.

బీజేపీ తిరగబడితే..

పశ్చిమ బెంగాల్ లో పోలీసులతో కలిసి బీజేపీ నాయకుల పైన, కార్యకర్తల పైన దాడులు చేస్తున్నారని బండి సంజయ్ కుమార్ సార్ మండిపడ్డారు. ఆ రాష్ట్రంలో పరిస్థితి ఇలాగే ఉంటే కమలనాథులు కరసేవ చేయాల్సి వస్తుందని సీఎం మమతా బెనర్జీని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలు తిరగబడితే టీఎంసీ పార్టీ పరిస్థితి ఏంటని వార్నింగ్ ఇచ్చారు. సార్.. సార్.. మీలాగే ఆమె పార్టీ కార్యకర్తలు కూడా ఆవేశపరులనుకుంటా. అందుకే మీ పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు. తప్పే సార్. కాదనట్లేదు. కానీ.. మీరు కూడా వాళ్ల మాదిరిగానే కోప్పడితే ఎలా?. అప్పుడు మీకు వాళ్లకు తేడా ఏం ఉంటుంది?. కొంచెం కూల్ డౌన్ సార్. అక్కడెక్కడో గొడవలు జరిగితే తెలంగాణలో ఎందుకు సార్ హడావుడి చేస్తారు?. అక్కడ మీ పార్టీవాళ్లు ఉన్నారుగా. వాళ్లు చూసుకుంటారులెండి. మీరు ఇక్కడ తెలంగాణలో మీ పార్టీని బలోపేతం చెయ్యండి. కనీసం డిపాజిట్లయినా తిరిగొచ్చేలా చూసుకోండి. ఆంధ్రప్రదేశ్ గురించో, మరో రాష్ట్రం గురించో ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకండి అని పబ్లిక్ అభిప్రాయపడుతున్నారు.

 

Advertisement