Bandi : ‘బండి’కి భలే ‘పంచ్’ర్లు

Bandi : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కి ఈరోజు భలే ‘పంచ్’ర్లు పడ్డాయి. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నాయకుడు భట్టి విక్రమార్క గట్టి కౌంటర్లు ఇచ్చారు. ‘మాటలాపి ముందు పనిచూడు’ అని సెటైర్లు వేశారు. ‘‘బండి సంజయ్ బడాయి డైలాగులకు అంతే లేకుండా పోతోంది. తెల్లారింది మొదలు అవినీతిపరులపై ఆ కేసులు పెడతాం.. ఈ కేసులు పెడతాం.. అని బెదిరించటం తప్ప ఒక్కర్ని కూడా బుక్కు చేసింది లేదంటూ భట్టి ఎద్దేవా చేశారు.

చేతల్లో చూపించు..

బండి సంజయ్ ఒట్టి పోజులు కొట్టడం తప్ప ఇప్పటివరకు చేసిందేమీలేదని భట్టి విమర్శించారు. ఆయన చెప్పేదాంట్లో నిజం ఉంటే చేతల్లోనూ చేసి చూపాలని సవాల్ విసిరారు. తెలంగాణలో లక్షల కోట్ల రూపాయల కరప్షన్ జరుగుతుంటే సీబీఐ, విజిలెన్స్ వంటి కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించకుండా కమలనాథులు కళ్లప్పగించి చూస్తూ ఊరుకుంటోందని భట్టి తప్పుపట్టారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఆ సంస్థల్ని రంగంలోకి దింపి రాష్ట్రంలోని కరప్షన్ రాయుళ్ల పనిపట్టాలని ఛాలెంజ్ విసిరారు.

కాళేశ్వరం కంటేనా? : Bandi

తెలంగాణలో పెద్దఎత్తున కుంభకోణాలు చోటుచేసుకుంటున్నాయనటానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు మించిన ఉదాహరణ ఏముంటుందని భట్టి ప్రశ్నించారు. కేవలం రూ.28 వేల కోట్లకే పూర్తికావాల్సిన ఆ ప్రాజెక్టు వ్యయాన్ని కేసీఆర్ సర్కార్ ఏకంగా లక్షా పదిహేను వేల కోట్లకు అడ్డూఅదుపూ లేకుండా పెంచుకుంటూ పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరానికి అసలు రీడిజైనింగ్ ఎందుకు చేశారో, దానివల్ల ఒరిగే ప్రయోజనాలేంటో విచారణలో గానీ తేలదని భట్టి పేర్కొన్నారు.

గాలికొదిలేసింది..

టీఆరెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని మూడేళ్లుగా గాలికొదిలేసిందని భట్టి మండిపడ్డారు. సమస్యల పరిష్కారాన్ని పక్కనపెట్టి సామాజిక తెలంగాణ ఎలా సాధిస్తారని మంత్రులను నిలదీశారు. రాష్ట్రంలో గవర్నమెంట్ ఉందా అనే డౌటు కలుగుతోందని, సెక్రటేరియట్ లేకుండా చేసిన గొప్పతనం ఈ సర్కారుకే దక్కుతుందని చురకలంటించారు. సచివాలయం లేకపోవటంతో మినిస్టర్లు, పెద్దాఫీసర్లు ఎక్కడున్నారో ఎవరికీ తెలియట్లేదని భట్టి ధ్వజమెత్తారు.

bandi-bhatti-satires-on-bandi
bandi-bhatti-satires-on-bandi

అందుకే.. : Bandi

సమస్యల మీద నుంచి ప్రజల దృష్టిని మరల్చటానికే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ‘కేటీఆర్ సీఎం’ అనే కొత్త ప్రచారం అందుకున్నారని, తద్వారా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని భట్టి విమర్శించారు. తమ సమస్యలను పరిష్కరిస్తారనే ఆశతో ప్రజలు నాయకులను ఎన్నుకుంటే వాళ్లేమో చేతులెత్తేశారని, దీంతో సర్వత్రా ఆందోళన నెలకొందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు.

Advertisement