Ayodhya : ‘అయోధ్యలో రామాలయం’.. అవసరమా అధ్యక్షా?

Ayodhya : తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ టీఆరెస్ కి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాకపోయినా ఆ పాత్రను సమర్థంగా పోషిస్తున్న బీజేపీకి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా హిందుత్వం అంశంపై ఇరు వర్గాలు నువ్వానేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాయి. అయోధ్యలో చేపడుతున్న రామ మందిర నిర్మాణానికి నిధుల సేకరణ విషయంలో సీఎం కేసీఆర్ సహకరించాలని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడి హోదాలో బండి సంజయ్ నిన్న కోరిన విషయం తెలిసిందే. అయితే దానికి విరుద్ధంగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు (టీఆరెస్) ఇవాళ పిలుపునివ్వటం గమనార్హం.

విరాళాలివ్వొద్దు..

అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరానికి ఎవరూ కూడా విరాళాలు ఇవ్వొద్దని ఎమ్మెల్యే విద్యాసాగర్ కోరారు. జగిత్యాలలో గురువారం జరిగిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు. రామ మందిరం పేరుతో బీజేపీ నేతలు బిచ్చం ఎత్తుకుంటున్నారంటూ తీవ్రంగా విమర్శించారు. ప్రతి గ్రామంలోనూ రామాలయం ఉండగా అయోధ్యలో ప్రత్యేకంగా రామ మందిరం నిర్మించటం అవసరమా అని అడిగారు. తాము కూడా శ్రీరాముణ్ని కొలుస్తామని చెప్పారు. బొట్టు పెట్టుకుంటేనే భక్తులమవుతామా లేకపోతే లేదా అని ఎమ్మెల్యే విద్యాసాగర్ కమలం పార్టీ నాయకులను ఉద్దేశించి ప్రశ్నించారు.

బీజేపీ కౌంటర్ : Ayodhya

కోరుట్ల శాసన సభ్యుడు విద్యాసాగర్ చేసిన కాంట్రవర్సియల్ కామెంట్లకు కాషాయం శిబిరం నుంచి కౌంటర్లు పడ్డాయి. హిందుత్వ అ‘జెండా’ను మోసే విషయంలో తెలంగాణ బీజేపీ ఎమ్యెల్యేల్లో గోషామహల్ శాసన సభ్యుడు రాజాసింగ్ ముందు వరుసలో ఉంటాడనే విషయం విధితమే. అదిగో ఆయనే ఈ విద్యాసాగర్ వ్యాఖ్యల్ని ఖండించారు. అయోధ్యలో రామమందిరం అనేది ప్రతి ఒక్క హిందువు కల అని, అందులో అందర్నీ భాగస్వాములను చేసేందుకే విరాళాలు సేకరిస్తున్నాం తప్ప బిచ్చమెత్తుకోవాల్సిన గత్యంతరం తమకు లేదంటూ గట్టిగా సమాధానమిచ్చారు.

ayodhya-trs-mla-comments
ayodhya-trs-mla-comments

సారీ చెప్పు..

అధికార పార్టీ శాససభ్యుడు విద్యాసాగర్ చేసిన ఘాటు వ్యాఖ్యలపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రామాలయ నిర్మాణ నిధి కోసం తాము ఎవరి మీదా ఎలాంటి ఒత్తిడి తేవట్లేదని, ఇష్టమైనవాళ్లే డబ్బులు ఇవ్వాలని సూచించారు. గతంలో ఈ మందిరం నిర్మాణానికి అనేక మంది వాలంటరీగా ముందుకు వచ్చారని గుర్తు చేశారు. తాము కలెక్షన్లు వసూలు చేస్తున్నామనే మాటలు సరికాదని గోషామహల్ ఎమ్యెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Advertisement