CM JAGAN: సీఎం జగన్ స్పందనలు.. ఆశ్చర్యకరం..

CM JAGAN: మన దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి అందునా ఒక ఆంధ్రుడు ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టడం.. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ హఠాత్తుగా చనిపోవటం.. ఈ రెండు సంఘటనలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించటం ఆశ్చర్యకరంగా ఉంది. ఈ రెండు విషయాల్లో సీఎం జగన్ నుంచి రియాక్షన్ రాదేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ.. ఎట్టకేలకు ఆయన పేరుతో ప్రకటనలు రావటం చర్చనీయాంశంగా మారింది. దీనికి గల కారణాలు దాదాపు అందరికీ తెలిసినవే. అయినా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకోవటం సహజం, ఆసక్తికరం.

ఎన్వీ రమణ విషయంలో..

సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిగా ఉన్నప్పుడు ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనేది వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా, ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రధాన ఆరోపణ. దీనికి ఆయన సాక్ష్యాలను కూడా చూపారు. వాటిని అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకి లేఖ రూపంలో అందజేశారు. ఇది దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. టీడీపీ సర్కారు ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేయగా జగన్ ప్రభుత్వం దాన్ని కేవలం శాసన రాజధానికే పరిమితం చేసింది. దీంతో అంతకుముందు అక్కడ భూములు కొన్నోళ్లలో ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని, కాబట్టే రాజధాని తరలింపు నిర్ణయం ఆయనకు నచ్చలేదని వైఎస్సార్సీపీ చెబుతోంది.

ఈ ఉద్దేశంతోనే..

రాజధాని అమరావతికి సంబంధించిన కేసులేవైనా ఏపీ హైకోర్టుకు వస్తే వాటిలో జగన్ సర్కార్కు వ్యతిరేకంగా తీర్పు వచ్చేలా ఎన్వీ రమణ హైకోర్టు జడ్జిలను ప్రభావితం చేస్తున్నారని సీఎం జగన్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ వాదనలని సుప్రీంకోర్టు చివరికి తోసిపుచ్చింది. అనంతర పరిణామాల్లో ఎన్వీ రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు జగన్ శుభాకాంక్షలు చెప్పరేమో అని ఎక్కువ మంది భావించారు. కానీ.. నామమాత్రంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో శుభాకాంక్షల ప్రకటన వెలువడటం గమనార్హం.

రాధాకృష్ణ విషయంలో..

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు ఈరోజు మంగళవారం ఉదయం సతీవియోగం జరిగింది. ఆయన భార్య కనకదుర్గ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ వార్త ఇవాళ పొద్దున్నే వచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తదితర ప్రముఖులు రాధాకృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా వెంటనే సంతాపం తెలుపుతారేమో అని విశ్లేషకులు ఎదురుచూశారు. కానీ సాయంత్రం 5 గంటల తర్వాత సంబంధిత ప్రకటన రావటం ఆశ్చర్యం కలిగించింది. ఈ కష్టకాలంలో రాధాకృష్ణకు, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని దేవుణ్ని కోరుకుంటున్నట్లు జగన్ పేరుతో స్టేట్మెంట్ వచ్చింది.

ఎందుకింత లేటు?..

సహజంగా ప్రముఖులు ఎవరు చనిపోయినా స్వయంగా ముఖ్యమంత్రులే, అంతకన్నా పెద్ద పదవుల్లో ఉన్నోళ్లే సంతాప ప్రకటనలను రూపొందించి విడుదల చేయరు. వాళ్ల కార్యాలయ ఉన్నతాధికారులు సంబంధిత అనుమతులు తీసుకొని ఆయా హోదాలు, ఆయా వ్యక్తుల పేర్లతో స్టేట్మెంట్లను కంపోజ్ చేయించి రిలీజ్ చేస్తుంటారు. ఈ మాత్రం దానికి కూడా సీఎం జగన్ ఇంత లేట్ చేయటం కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే.. వైఎస్ ఫ్యామిలీకి, ఆంధ్రజ్యోతి మీడియాకి మధ్య తొలి నుంచీ సత్సంబంధాలు లేకపోవటమే దీనికి కారణం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా ఈ రెండు వర్గాల మధ్య పచ్చ గడ్డి వేసిన భగ్గుమంటోంది. ఇదీ నేపథ్యం.

Advertisement