MAA Elections: అనుమాన‌మే నిజ‌మైందా?.. మా ఎల‌క్ష‌న్స్‌లో వైకాపా మ‌నుషులు..!

MAA Elections: ఇటీవ‌ల జ‌రిగిన మా ఎన్నిక‌ల‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని ప్ర‌కాశ్ రాజ్ ముందు నుండి అనుమానం వ్య‌క్తం చేశారు. ఎన్నికలు ముగిసి, అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసినా కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఆరోపణలు ఆగట్లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు.

MAA Elections

ఎన్నికలు జరిగిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రకాశ్‌ రాజ్‌, ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు మీడియా ముందుకు వచ్చిన రాజీనామా కూడా చేశారు. అయితే పాతికేళ్ల చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా తొలిసారిగా రికార్డ్ స్థాయిలో ఓటింగ్ న‌మోదైంది. 70 శాతం ఓట్లు నమోదయ్యాయి.

‘మా’ ఎన్నికల్లో వైకాపా జోక్యం ఉందంటూ శుక్రవారం మధ్యాహ్నం నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఇటీవల పోలింగ్‌ కేంద్రంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన ప్రకాశ్‌రాజ్‌ తాజాగా కృష్ణమోహన్‌కు లేఖ రాశారు.

ఎన్నికల హాల్‌లోకి వైకాపా కార్యకర్త నూకల సాంబశివరావుని ఎలా అనుమతించారంటూ? ప్రశ్నల వర్షం కురిపించారు. సాంబశివరావు ఎన్నికల హాల్‌లోని ఓటర్లను బెదిరించారంటూ.. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రకాశ్‌రాజ్‌ డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో మంచు విష్ణుతో సాంబశివరావు ఉన్న కొన్ని ఫొటోలను కృష్ణమోహన్‌కు పంపించారు.

అంతేకాకుండా జగ్గయ్యపేటకు చెందిన సాంబశివరావుపై క్రిమినల్‌ కేసులు కూడా ఉన్నాయని ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు. మరోవైపు, ఈ వీడియోలను అతి త్వరలో బయటపెడతానని ప్రకాశ్‌రాజ్‌ వెల్లడించారు. కృష్ణమోహన్‌ గారు.. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పటికైనా మాకు సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వండి. ఎన్నికల ఎలా జరిగాయి.. పోలింగ్‌ బూత్‌లో అసలేం జరిగిందో ప్రపంచానికి తెలియజేయనివ్వండి’’ అని పేర్కొన్నారు.