YS Jagan: వైఎస్ జ‌గ‌న్ బ‌యోపిక్.. ప్ర‌ధాన పాత్రధారి ఎవ‌రంటే..!

YS Jagan ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్‌ల హ‌డావిడి న‌డుస్తుంది. సినీ, క్రీడా, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌కి సంబంధించి బ‌యోపిక్స్ తెర‌కెక్కిస్తున్నారు. వీటికి ప్రేక్ష‌కుల నుండి మంచి ఆద‌ర‌ణ లభిస్తున్న నేప‌థ్యంలో వ‌రుసపెట్టి బ‌యోపిక్స్ వ‌స్తున్నాయి. ఇక ఇప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి త‌న‌యుడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రూపొంద‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ వార్త‌లు గ‌త కొంత కాలం నుండి టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ప్ప‌టికీ పూర్తి క్లారిటీ రావ‌డం లేదు. వైఎస్ జ‌గ‌న్ బ‌యోపిక్‌ని ‘యాత్ర’ను తెరకెక్కించిన దర్శకుడు మహి వి రాఘవనే తెర‌కెక్కించ‌నున్నారు. ఆ మ‌ధ్య‌ వైఎస్ జగన్ బయోపిక్ అంశంపై స్పందించిన యాత్ర సినిమా దర్శకుడు మహి వి రాఘవ.. దివంగత నేత వైఎస్సార్ బయోపిక్ అంటే తీయడం కాస్త కష్టం కానీ, వైఎస్ జగన్ విషయంలో ఏ ఇబ్బంది ఉండదన్నాడు.

వైఎస్సార్ సినిమా అంటే ఆయన లైఫ్ మొత్తాన్ని తెలుసుకోవాల్సి వచ్చింది కానీ జగన్ విషయంలో తనకు బాగానే తెలుసునంటున్నాడు. ఏపీ సీఎం జగన్ జీవితంలో మంచి, చెడు, కష్టాలు, నష్టాలు, పోరాటం, పాలన అన్నీ చూశారని వీటితో ఎమోషనల్ జర్నీగా బయోపిక్‌ను చూపిస్తానని ధీమాగా చెబుతున్నాడు. వైఎస్ జగన్ నుంచి బయోపిక్‌కు అనుమతి రావడం తరువాయి అన్న ఆయ‌న అంతా కుదిరతే 2022లోగానీ 2023లోనైనా జగన్ బయోపిక్‌ను తెరమీద చూపిస్తా అని అప్ప‌ట్లో చెప్పుకొచ్చారు.

యాత్ర-2 సీఎం జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. తండ్రి చనిపోయిన తరువాత జగన్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. ఆ తరువాత పాదయాత్ర చేపట్టి సీఎం ఎలా అయ్యారన్న కోణంలో ఈ కథ ఉండబోతున్నట్టు సమాచారం.యాత్ర-2లో జగన్ పాత్రలో నాగార్జున నటిస్తున్నారని అప్ప‌ట్లో జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.

తాజాగా యాత్ర 2లో జ‌గ‌న్ పాత్ర‌ను స్కామ్ 2 ఫేం ప్ర‌తీక్ గాంధీ పోషించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ గుజ‌రాతీ న‌టుడికి జ‌గ‌న్ పోలిక‌లు మ్యాచ్ కావ‌డంతో మ‌హి రాఘ‌వ ఈయ‌న‌ను త‌న సినిమా కోసం ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. అతి త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. ఆనందో బ్రహ్మ, యాత్ర సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందారు దర్శకుడు మహి వి రాఘవ.