Sourav Ganguly: దాదా బ‌యోపిక్.. ప్ర‌ధాన పాత్ర‌లో ఎవ‌రు న‌టించ‌నున్నారో తెలుసా?

Sourav Ganguly: ప్ర‌స్తుతం బ‌యోపిక్ ట్రెండ్ న‌డుస్తుంది. సినిమా,రాజ‌కీయం, క్రీడ‌ల‌కు సంబంధించిన ప్ర‌ముఖుల జీవిత నేప‌థ్యంలో అనేక సినిమాలు వ‌స్తున్నాయి. క్రీడా ప్ర‌ముఖుల బ‌యోపిక్స్‌కి కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌డంతో మేక‌ర్స్ క్రికెట్ లెజెండ్స్ జీవితంపై సినిమాలు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.ఇప్ప‌టికే ధోని బ‌యోపిక్ రాగా, ఇది సూప‌ర్ హిట్ అయింది. ఇక ప్ర‌స్తుతం భార‌త మ‌హిళా క్రికెట‌ర్ మిథాలీ రాజ్ బ‌యోపిక్ సెట్స్ పై ఉంది. ఇందులో తాప్సీ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది.

Sourav Ganguly

ఝుల‌న్ గోస్వామి బ‌యోపిక్ కూడా రూపొందుతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. క‌ట్ చేస్తే భారత క్రికెట్ జట్టు గతిని మార్చిన మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జీవితంపై బాలీవుడ్​లో బయోపిక్​ తెరకెక్కడం దాదాపు క‌న్‌ఫాం అయింది. ఈ బ‌యోపిక్‌కి తాను అనుమతి ఇచ్చినట్టు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ తెలిపారు. రూ. 200 నుంచి 250 కోట్ల భారీ బడ్జెట్‌తో గంగూలీ బయోపిక్ తెరకెక్కనుంది.

తాజాగా మీడియాతో మాట్లాడిన గంగూలీ త‌న బ‌యోపిక్ మూవీకి అనుమ‌తి ఇవ్వ‌డం జ‌రిగింది అని చెప్పారు. ఈ సినిమా హిందీలో తెర‌కెక్క‌నుంది. డైరెక్ట‌ర్ ఎవ‌రు అనేది ఇప్పుడే చెప్ప‌డం క‌ష్టం. బయోపిక్ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించేందుకు ఇంకొద్ది రోజులు సమయం పడుతుందని గంగూలీ పేర్కొన్న‌ట్టు తెలుస్తుంది. సౌరవ్ గంగూలీ బయోపిక్ నిర్మించనున్న చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటికే స్క్రిప్ట్ విషయంలో గంగూలీతో పలుమార్లు సంప్రదింపులు జరిపినట్టు బాలీవుడ్ మీడియా చెబుతోంది.

గంగూలీ పాత్రలో ఎవరు నటిస్తారన్న అంశం పెద్ద చర్చగా మారింది. సంజ‌య్ ద‌త్ బ‌యోపిక్‌లో న‌టించి మెప్పించిన రణ్‌బీర్ క‌పూర్ గంగూలీ బ‌యోపిక్‌కి కూడా స‌రిగ్గా స‌రిపోతాడ‌ని అంటున్నారు. గంగూలీ కూడా రణ్​బీర్ పేరును ప్రస్తావించాడు. అలాగే హృతిక్ రోషన్ కూడా గంగూలీ పాత్రకు సరిపోతాడని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నతనం నుంచి బీసీసీఐ అధ్యక్షుడు అయ్యే వరకు గంగూలీ మొత్తం జీవితం సినిమాగా రానుంది.

ఇటీవ‌ల క‌పిల్ దేవ్ బ‌యోపిక్ కూడా రూపొంద‌గా, ఈ చిత్రం 83 అనే టైటిల్‌తో రూపొందించారు. ఇందులో ర‌ణ్‌వీర్ సింగ్, దీపికా ప‌దుకొణేతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ముఖ్య పాత్ర‌లు పోషించారు.