Kathi Mahesh: క‌త్తి మ‌హేష్ భార్య ఎక్క‌డున్నారు, ఆయ‌న అంత్య‌క్రియ‌లు ఎవ‌రు చేయబోతున్నారు..!

Kathi Mahesh: సినీ క్రిటిక్,బిగ్ బాస్ ఫేం క‌త్తి మ‌హేష్ శ‌నివారం తుది శ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. జూన్ 26 తెల్లవారుజామున క‌త్తి మ‌హేష్ కారుకి ప్ర‌మాదం జ‌ర‌గ‌గా, అత‌నికి హాస్పిటల్ లో 10 రోజులకు పైగానే చికిత్స అందించారు. అయిన‌ప్ప‌టికీ మరణించాడు. తన సొంతూరు పీలేరు నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు చెన్నై, నెల్లూరు మార్గమధ్యంలో ఆగివున్న లారీని ఆయన ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో కత్తి మహేష్ సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు.

క‌త్తి మ‌హేష్‌ని నెల్లూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించినా.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చెన్నై హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. అక్కడే కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నాడు కత్తి. ఈయన మరణవార్త తెలిసిన వెంటనే అతడి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కోలుకుని బయటికి వస్తాడు అనుకుంటున్న తరుణంలో కత్తి ఇలా కన్నుమూయడం తీర‌ని దుఃఖాన్నిమిగిల్చింది.

సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని భావించిన స్నేహితులు, శ్రేయోభిలాషులు ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి విషాదం నేపథ్యంలో ఆయన అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయి? ఆయన భార్య, పిల్లలు ఎక్క‌డున్నార‌నే విష‌యాల‌పై చ‌ర్చ న‌డుస్తుంది.

క‌త్తి మ‌హేష్ మొద‌టి నుండి ఆద‌ర్శ‌భావాలు పాటిస్తూ ముక్కుసూటిగా మాట్లాడుతూ వ‌చ్చారు. ఎక్కువ‌గా ప‌లు విష‌యాల‌పై స్పందించే ఆయ‌న కాంట్ర‌వ‌ర్సీస్‌కి కేంద్ర‌బిందువుగా మారాడు. సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించే సమయంలోనే బెంగాలీ అమ్మాయి సోనాలితో ప్రేమలో పడ్డారు. కొన్ని రోజుల త‌ర్వాత మ‌తాంత‌ర వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నారు.

ఇటీవ‌ల త‌న కుమారుడి బ‌ర్త్ డేకావ‌డంతో ఆయ‌న త‌న కొడుకును సోష‌ల్ మీడియా ద్వారా ప‌రిచ‌యం చేశాడు. అయితే కొన్ని రోజుల క్రితం మహేష్‌, సోనాలి ప‌రస్ప‌ర విభేదాల‌తో విడిపోగా, ఇద్ద‌రు స్నేహ‌పూర్వకంగా ఉంటున్నారు. వీలున్న‌ప్పుడ‌ల్లా భోపాల్‌కి వెళ్లి భార్య , పిల్ల‌ల‌ని క‌లిసి వ‌స్తుంటారు. బిగ్ బాస్ సీజ‌న్ తొలి సీజ‌న్ పూణేలో జ‌ర‌గ‌గా ఆ షోలో క‌త్తి మ‌హేష్ పాల్గొన్న విష‌యం తెలిసిందే. షో నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక మ‌హేష్ బోపాల్‌లోని త‌న భార్య‌, పిల్ల‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లి కొంత స‌మ‌యం గ‌డిపాక హైద‌రాబాద్‌కు వ‌చ్చారు.

భార్యతో విడిపోయినా గానీ.. స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూ.. కొడుకు అంటే ఎంతో ప్రేమను వ్యక్తం చేస్తున్నారు క‌త్తి మ‌హేష్‌. ఇప్పుడు ఆయ‌న మృతితో వారు దిగ్భ్రాంతి చెందుతున్న‌ట్టు తెలుస్తుంది. జూలై 11న క‌త్తి మ‌హేష్ అంత్య‌క్రియ‌లు జ‌ర‌పనుండ‌గా, కుమారుడితోనే చితికి నిప్పంటిస్తార‌ని సమాచారం. చిత్తూరు జిల్లాలోని వాయల్పాడు సమీపంలోని తన స్వగ్రామంలో అంత్య‌క్రియ‌లు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు.