COMEDIAN: బిగ్ షాక్.. గుండెపోటుతో పాపులర్ కమెడీయన్ కన్నుమూత
Samsthi 2210 - April 17, 2021 / 11:46 AM IST

COMEDIAN తన కామెడీతో నవ్వులు పంచి ప్రేక్షకులని ఎంతగానో అలరించిన వివేక్(59) ఈ రోజు తెల్లవారుఝామున హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురువారం రోజు వివేక్ కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్ తీసుకోగా శుక్రవారం రోజు హార్ట్ ఎటాక్ వచ్చింది.దీంతో వెంటనే అతని భార్య, కూతురు శుక్రవారం ఉదయం 11 గంటలకు అపస్మారక స్థితిలో ఉన్న వివేక్‌ను హాస్పిటల్‌కు తరలించారు. అయితే మొదటి నుండి వైద్యులు వివేక్ పరిస్థితి విషమంగానే ఉందని చెప్పుకొచ్చారు. వివేక్‌ను బ్రతికించేందుకు చాలా ప్రయత్నించిన కూడా వారి ప్రయత్నం సఫలం కాలేదు. శనివారం తెల్లవారు జామున 4.35 గంటలకు వివేక్ మృతి చెందినట్టు సిమ్స్ హాస్పిటల్ హెల్త్ బులిటెన్‌లో తెలిపింది.
రజనీకాంత్, కమల్ హాసన్, విశాల్, విజయ్ వంటి స్టార్ హీరోల సరసన పలు సినిమాలలో నటించి అలరించిన వివేక్ దాదాపు 300కు పైగా సినిమాలలో నటించాడు. ఆయన సినిమాలు తెలుగులోను డబ్ చేసుకొని విడుదల అయిన నేపథ్యంలో వివేక్ తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా సుపరిచితం. 2009లో పద్మశ్రీ అవార్డును అందుకున్న వివేక్ వృక్షాల నరికివేతకు వ్యతిరేకంగా, పర్యావరణ సంరక్షణకు మద్దతుగా ఆయన పలు ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు.
గతంలో వివేక్ కుమారుడు డెంగీ జ్వరం కారణంగా మృతి చెందిన విషయం తెల్సిందే. అప్పటి నుండి వివేక్ చాలా కుంగిపోయాడు. సినిమాలు చేయడం కూడా తగ్గించాడు. వివేక్ మృతి పట్ల తెలుగు, తమిళ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. అలానే కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అయితే టీకా వేసుకున్న క్రమంలో ఆయనకు గుండెపోటురావడం , ఆ క్రమంలో చికిత్స పొందుతూ హాస్పిటల్‌లో మృతి చెందాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పుకార్లని వైద్యులు ఖండించారు. కరోనరీ సిండ్రోమ్‌తో ఓ నటుడు హాస్పిటల్‌లో చేరడం ఇదే మొదటి సారి అని శివస్వామి తెలిపారు.