Manchu Vishnu: మా అధ్య‌క్ష ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన విష్ణు.. తొలి సంత‌కం దేనిపైన‌?

Manchu Vishnu: మా సమరంలో ఓటర్లు మంచుకే పట్టం కట్టారు. తొలి నుంచి వివాదాలు..వాగ్వాదాలు..విమర్శలు..వ్యక్తిగత ఆరోపణలతో సాగిన ఎన్నికల్లో అనూహ్యంగా భారీ స్థాయిలో పోలింగ్ జరిగింది. ఎట్ట‌కేల‌కు మంచు విష్ణు అధ్య‌క్షుడిగా గెలుపొందారు. మెగా క్యాంపు మద్దతుతో ప్రకాశ్ రాజ్ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇక, బరిలో దిగిన విష్ణుకు తండ్రి మోహన్ బాబు తొలి నుంచి అండగా నిలిచారు. అన్నీ తానై కుమారుడి విజయం కోసం శ్రమించారు. హీరో నరేశ్ సైతం విష్ణుకు మద్దతుగా నిలిచి విజయం కోసం పోరాడారు.

ఎట్ట‌కేల‌కు 107 ఓట్ల తేడాతో ప్ర‌కాశ్ రాజ్‌పై మంచు విష్ణు విజ‌యం సాధించారు.అయితే పోలింగ్‌, కౌంటింగ్‌ సందర్భంగా మోహన్‌బాబు వ్యవహరించిన తీరునూ ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ తీవ్రంగా ఖండించింది. మోహన్‌బాబు వాడిన భాష సరిగా లేదని, బెనర్జీ కన్నీటి పర్యంతమవగా, తనీశ్‌ భావోద్వేగానికి గురయ్యారు. భయపడుతూ ‘మా’లో కొనసాగలేమని అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 11 మంది రాజీనామా చేయ‌డం స‌ర్వత్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (‘మా’ )అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పెన్షన్ల ఫైలుపై తొలి సంతకం చేశారు. కాగా ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యుల మూకుమ్మడి రాజీనామాపై విష్ణు ఎలా స్పందిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ద‌స‌రా రోజు విష్ణు.. సీఎం జ‌గ‌న్‌ని క‌ల‌వ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నేరవేర్చడం సంగతి పక్కన పెడితే, ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి గెలిచి రాజీనామా చేసిన వారి స్థానాలను భర్తీ చేయడం ఇప్పుడు విష్ణుకి స‌వాల్‌గా మారింది. 11మంది రాజీనామాలను ఆమోదించటం, వారి స్థానంలో కొత్త వారిని నియమించటం. ఇక్కడ మూకుమ్మడి రాజీనామాలు చేయడంతో మంచు విష్ణు వారిని ఒప్పించే ప‌రిస్థితి లేనట్టుగా తెలుస్తుంది.